పాపం.. పెద్దిరెడ్డి!

– నియోజకవర్గానికి వెళ్లలేని దుస్థితి
– సొంత కౌన్సిలర్ల తిరుగుబాటు
– టీడీపీలో చేరిన వైసీపీ కార్పొరేటర్లు
– త్వరలో మరికొందరి చేరిక
– ఖాళీ అవుతున్న వైసీపీ పుంగనూరు మున్సిపాలిటీ
– పుంగనూరులో ఆరిపోయిన పెద్దిరెడ్డి ప్రభ
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఆయన రెండు నెలల క్రితం వరకూ ఉమ్మడి చిత్తూరు జిల్లాకు మకుటం లేని రారాజు. అనంతపురం కూడా ఆయన సామ్రాజ్యమే. అక్కడ కలెక్టరుగా రావాలన్నా, ఎస్పీగా వెళ్లాలన్నా ఆయన అనుమతి తీసుకోవాల్సిందే. ఇక సీఐ, డీఎస్పీల సంగతి చెప్పనక్కర్లేదు. పుంగనూరు కేంద్రంగా చక్రం తిప్పిన రారాజుకు.. ఇప్పుడు సొంత నియోజకవర్గంలో అడుగుపెట్టలేని దయనీయం.

ఆయనను నియోజకవర్గంలోకి రానీయమని హెచ్చరించటంతో 20 రోజుల నుంచి ఇంటికే పరిమితం కావలసిన దుస్థితి. కనీసం తనను గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు చెప్పుకోలేని దయనీయం. చివరాఖరకు ఆయన పుణ్యాన కౌన్సిలర్లుగా గెలిచిన వారే ఇప్పుడు తిరుగుబాటుబావుటా ఎగరేసిన విషాదం. బహుశా ఇలాంటి దుస్థితి వస్తుందని ఆయన కలలో కూడా ఊహించి ఉండరు. శతాబ్దాలుగా పుంగనూరు నియోజకవర్గం, కేంద్రంగా జిల్లా-రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన మాజీ మంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరిపోతున్న రాజకీయ ప్రభ ఇది.

మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వంటి రాజకీయయోధుడికి సైతం సినిమా కష్టాలు తప్పటం లేదు. అధికారంలో ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగిన పెద్దిరెడ్డి హవా ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఐదేళ్ల పాటు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడును వేధించి, ఆయనపై రాళ్లు వేయించి, చివరాఖరకు హత్యాయత్నం కేసులు కూడా పెట్టించిన పెద్దిరెడ్డి పరిస్థితి ప్రస్తుతం సొంత నియోజకవర్గంలోనే దారుణంగా మారింది. చంద్రబాబును కుప్పంలో, బాలకృష్ణను హిందూపురంలో ఓడిస్తానని సవాల్ విసిరిన పెద్దిరెడ్డికి, ప్రస్తుతం సొంత నియోజకవర్గంలో కాలుపెట్టే పరిస్థితి లేదు. అధికారంలో ఉన్న రోజుల్లో తమపై అక్రమ కేసులు పెట్టించి వేధించిన పెద్దిరెడ్డిని నియోజకవర్గంలోకి రానిచ్చేది లేదని టీడీపీ కార్యకర్తలు రోడ్లపై బైఠాయిస్తున్నారు. దీనితో గత 20 రోజుల నుంచి గెలిచిన ఎమ్మెల్యే అయిన పెద్దిరెడ్డి పొరుగున ఉండిపోవలసిన దుస్థితి.

అది చాలదన్నట్లు.. తాజాగా ఆయన పెంచి పోషించి, కౌన్సిలర్లుగా తయారుచేసిన వారే పెద్దిరెడ్డిపై తిరుగుబాటు చేసిన దయనీయం. పుంగనూరు మున్సిపల్ చైర్మన్ అలీంబాషాతో సహా 12 మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. పెద్దిరెడ్డి చేతిలో ఓడిపోయిన టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి చల్లా రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో, మరికొందరు కౌన్సిలర్లు త్వరలో సైకిల్ ఎక్కేందుకు సిద్ధమవుతున్నారట.

నిజానికి పెద్దిరెడ్డి 1970వ దశకం నుంచి రాజకీయాల్లో ఉండి, మంత్రి- ఎమ్మెల్యే పదవులు అనుభవించినప్పటికీ.. పుంగనూరులో మాత్రం ఎదురులేకుండా చూసుకున్నారు. గతంలో ఎన్డీఆర్,చంద్రబాబు సీఎంలుగా ఉన్నప్పటికీ తన నియోజకవర్గంలో చక్రం తిప్పారు. కానీ ఈసారే రింగు రివర్సయింది. దానికి కారణం.. ఆయన గత ఐదేళ్లు వ్యక్తిగతంగా చంద్రబాబును వేధించడంతోపాటు, రాజకీయంగా టీడీపీని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నించడమే.

అధికారంలో ఉన్నప్పుడు విర్రవీగితే.. అది పోయిన తర్వాత ఇలాంటి విషాదాలే ఎదురవక తప్పదు. అధికారం ఉన్నప్పుడు ప్రత్యర్ధులను శత్రువుల్లా వేధిస్తే.. అది పోయిన తర్వాత, తమకూ అదే పరిస్థితి తమకూ ఎదురవుతుందనటానికి పెద్దిరెడ్డి విషాదమే ఉదాహరణ.