– ప్రజల కోసం పవనుడు పుస్తకావిష్కరణలో ఎమ్మెల్యే గళ్ళా మాధవి
గుంటూరు, మహానాడు: సమాజం పట్ల బాధ్యత, ప్రజల పట్ల ప్రేమ, దేశం పట్ల భక్తి ఉన్న పవన్ కల్యాణ్ లాంటి నాయకులు అరుదుగా ఉంటారని పశ్చిమ నియోజకవర్గం శాసన సభ్యుడు గళ్ళా మాధవి అన్నారు. తన సామాజిక, రాజకీయ ప్రయాణం అంతా పోరాటాలు, త్యాగాలు, గుప్త దానాలతో నిండి ఉంటుందని, గర్వించదగ్గ గొప్ప నాయకుడు పవన్ కల్యాణ్ అంటూ ఆమె కొనియాడారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో జిల్లా జనసేన అధికార ప్రతినిధి ఆళ్ళ హరి ఆధ్వర్యంలో ప్రజలతో పవనుడు అనే పుస్తకాన్ని ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మాట్లాడారు.
విజయాలకు పొంగిపోకుండా, అపజయాలకు కుంగిపోకుండా స్థిత ప్రజ్ఞతకు నిలువెత్తురూపంగా పవన్ కల్యాణ్ నిలిచారన్నారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా తక్షణమే స్పందించే పవన్ కల్యాణ్ తన సంపాదనలో అధిక భాగం దానాలకే ఖర్చు చేస్తారని పేర్కొన్నారు. జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి మాట్లాడుతూ పవన్ కల్యాణ్ లాంటి నిస్వార్ధ నాయకుడి బాటలో పయనిస్తునందుకు గర్వంగా ఉందన్నారు. కార్యక్రమంలో రెల్లి యువ నేత సోమి ఉదయ్ కుమార్, జనసేన నగర నాయకులు బొడ్డుపల్లి రాధాకృష్ణ, కదిరి సంజీవ్, యరసాని సత్యం, అలా కాసులు, వడ్డే సుబ్బారావు, శ్రీను, టీడీపీ నాయకులు కూరంగి శ్రీను, చింతకాయల సాయి, బాబు, తదితరులు పాల్గొన్నారు.