అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్
జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గొప్ప మానవతావాది అని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. శుక్రవారం చల్లపల్లి బస్టాండ్ సెంటరులో జనసేన పార్టీ సభ్యత్వాల నమోదు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివేకానందుని స్ఫూర్తితో మానవ సేవ, సమాజ సేవ చేయాలనే ఆలోచనతో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారని, ఆయన ఎలాంటి స్వార్థ చింతన లేని గొప్ప నాయకుడని తెలిపారు.
కల్మషం లేని పవన్ కళ్యాణ్ సారథ్యంలో పనిచేస్తున్న జన సైనికులు తెల్ల కాగితం లాంటి వారన్నారు. సమున్నత ఆశయాలతో సమాజాన్ని సంస్కరించాలనే అత్యున్నత భావనతో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
పవన్ కళ్యాణ్ అనునిత్యం అందించే ఆదేశాలను అనుసరించి జనసైనికులు క్రమశిక్షణతో ముందుకు సాగాలని బుద్ధప్రసాద్ పిలుపునిచ్చారు.
జనసేన పార్టీని నమ్ముకొని పార్టీ కోసం పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తల కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని అధినేత పవన్ కళ్యాణ్ క్రియాశీలక సభ్యత నమోదు ద్వారా వారికి బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు.
గతంలోనూ ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది కార్యకర్తల కుటుంబాలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అండగా నిలిచినట్లు గుర్తు చేశారు. తన సొంత డబ్బుతో వేల మంది రైతులు, కౌలు రైతుల కుటుంబాలను పవన్ కళ్యాణ్ ఆదుకున్న విషయాన్ని గుర్తు చేశారు.
నాలుగో విడత సభ్యత్వ నమోదు కార్యక్రమం ద్వారా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, ఎన్నికల ముందు పార్టీలో చేరిన వారందరూ క్రియాశీలక సభ్యత్వాలు పొందాలని సూచించారు. క్రియాశీలక వాలంటీర్లు అత్యధిక సభ్యత్వాలు నమోదు చేసి అవనిగడ్డ నియోజకవర్గాన్ని ముందు వరసలో నిలపాలని పిలుపునిచ్చారు.
గ్రామాల్లో అత్యధిక సంఖ్యలో నమోదయ్యే జనసేన పార్టీ సభ్యత్వాలే కొలమానంగా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్, ఎంపీటీసీ స్థానాలకు పోటీ చేసేందుకు కూటమిలో తగిన ప్రాధాన్యత పొందే అవకాశాన్ని జనసైనికులు దృష్టిలో ఉంచుకొని సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా చల్లపల్లిలో గతంలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన జనసైనికుడు మెండు దొరబాబు సతీమణి మెండు జ్యోతికి తొలి సభ్యత్వాన్ని ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ అందించారు.
చల్లపల్లిలో గత ఏడాది సభ్యత్వ నమోదు కార్యక్రమంలో అత్యధిక సభ్యత్వాలు నమోదు చేసిన జనసేన పార్టీ సీనియర్ నాయకుడు పసుపులేటి రవిని ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ ఘనంగా సత్కరించారు.
కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు చోడగం విమల్ కృష్ణ, ప్రధాన కార్యదర్శి తోట మురళీకృష్ణ, పట్టణ అధ్యక్షులు బొందలపాటి వీరబాబు, సీనియర్ నాయకులు బాదర్ల లోలాక్షుడు, నియోజకవర్గ ఐటీ కో-ఆర్డినేటర్ సూదాని నందగోపాల్, నాయకులు జీవీ తాతారావు, షేక్ నసీంఘోరి, పసుపులేటి రవికుమార్, అడపా రాంబాబు, అడపా రవి, గోళ్ళ ప్రసాద్, ఉరిమి మణికాంత్, యడ్లపల్లి లక్ష్మణరావు, పినిశెట్టి నిరంజన్, పసుపులేటి శ్రీను, రంజిత్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.