-టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి సర్వస్వం కాదు
-ప్రజల ఆస్తికి పూర్తి భద్రత
వాస్తవాలు:
-అసలు ల్యాండ్ టైట్లింగ్ చట్టం చేయాలని చెప్పింది బీజేపీ ప్రభుత్వమే పవన్
-2019లో ముసాయిదా చట్టం చేసిన కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం
-దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఈ చట్టం చేయాలని సిఫారసు
కచ్చితమైన హక్కులు ఇచ్చేలా టైటిల్ గ్యారంటీ చట్టాన్ని తేవాలని 40 ఏళ్లుగా దేశంలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక కచ్చితమైన హక్కులతో ఆధునిక భూ రికార్డులు తయారు చేయాలనే ఉద్దేశంతో లాండ్ టైట్లింగ్ చట్టాన్ని ప్రతిపాదించింది. అన్ని రాష్ట్రాలూ అమలు చేయాలని సూచించింది.
ఆ క్రమంలో తొలిసారి చట్టం చేసిన ఏపీ. వాస్తవంగా ఈ చట్టం ఇంకా రాష్ట్రంలో అమలులోకి రాలేదు. గెజిట్ మాత్రమే జారీ చేసింది. అమలుకు అవసరమైన నిబంధనలు, మార్గదర్శకాలను ఇంకా జారీ చేయలేదు. అవి జారీ అయ్యాక చట్టం అమలవుతుంది.
1 ) కోర్టుల్లో సవాల్ చేయడం కుదరదనేది అపోహే
ఆస్తికి సంబంధించి TRO (Title Registration Officers )చేసిందే తుది నిర్ణయమని, దాన్ని సాధారణ సివిల్ కోర్టుల్లో సవాల్ చేయడం సాధ్యం కాదనే ప్రచారం నిజం కాదు.
టీఆర్‌వో టైటిల్ రిజిస్టర్‌ను నిర్వహించేది ఒక క్లర్క్ మాత్రమే. టైటిల్ అప్పిలేట్ అథారిటీ చెప్పింది చేయడం తప్ప దేనిపైనా సొంతంగా నిర్ణయం తీసుకొనే అవకాశం ఉండదు. రిజిస్ట్రేషన్లు, కోర్టు ఆర్డర్ల ప్రకారమే రిజిస్టర్‌లో అతను మార్పులు చేసే వీలుంటుంది. అభ్యంతరం ఉంటే అప్పిలేట్ ట్రిబ్యునల్‌కు అప్పీల్ చేసుకోవచ్చు. అప్పటికీ సంతృప్తి చెందకపోతే హైకోర్టును ఆశ్రయించవచ్చు
ఆస్తిని టీఆర్‌వో వివాదాల రిజిస్టర్‌లో చేరిస్తే , దానిపై హైకోర్టులో తప్ప కింది కోర్టుల్లో సవాలు చేయడానికి అవకాశం ఉండదనే ప్రచారం కూడా నిజం కాదు. ఏదైనా ఆస్తిని వివాదాల రిజిస్టర్‌లో చేర్చడంపై అభ్యంతరం ఉంటే అప్పిలేట్ అథారిటీ దగ్గర అప్పీల్ చేసుకోవచ్చు. అక్కడా న్యాయం జరగలేదనుకుంటే హైకోర్టుకు వెళ్లవచ్చు.
2 ) ఆస్తికి సంబంధించిన అన్ని వ్యవహారాలు టీఆర్‌వో కనుసన్నల్లోనే ఉంటుందని ప్రజలను భయపెట్టేలా ప్రచారం చేస్తున్నారు.
టైటిల్ రిజిస్టర్‌లో రికార్డులు భద్రంగా, సురక్షితంగా ఉంటాయి. అత్యంత కట్టుదిట్టంగా, పారదర్శకమైన విధానంలో టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి వాటిని నిర్వహిస్తారు.
3 ) టీఆర్‌వో అధికార పార్టీకి చెందిన స్థానిక ఎమ్మెల్యే లేదా ఎంపీ చేతిలో ఉంటారని, రికార్డును ఎప్పుడైనా మార్చేయవచ్చన్నది కూడా విష ప్రచారమే.
ప్రస్తుతం రెవెన్యూ అధికారులు ఉన్నట్టే టీఆర్‌వో కూడా ఉంటారు. ఇప్పుడున్న రెవెన్యూ అధికారులు ఇష్టం వచ్చినట్లు భూమి రికార్డులు మార్చేస్తున్నారా? సెటిల్మెంట్ రికార్డు (ఆర్‌ఎస్‌ఆర్)ను రెవెన్యూ వ్యవస్థే తయారు చేసింది. ప్రస్తుతం భూములకు సంబంధించిన బలమైన సాక్ష్యం ఆ రికార్డే. అందులో కోర్టు జోక్యం లేదు. ఈనాం రైత్వారీ పట్టాలిచ్చింది వాళ్లే. ఎస్టేట్ అబాలిషన్ కింద తుది హక్కులు నిర్థారించిందీ రెవెన్యూ అధికారులే.
ఇప్పుడున్న రికార్డులన్నీ రెవెన్యూ తయారు చేసినవే. అలాంటప్పుడు లాండ్ టైట్లింగ్ చట్టం ప్రకారం, కొత్త రికార్డులు తయారు చేసే పనిని వారికి కాకుండా ఎవరికి ఇస్తారు?
టైటిల్ రిజిస్టర్ ఆన్‌లైన్‌లో ఉంటుంది. అందులో ఏమైనా మార్పులు చేయాలంటే అది అప్పిలేట్ అథారిటీ లేదా కోర్టు ఆర్డర్ ద్వారానే జరుగుతాయి తప్ప వేరే విధంగా అవకాశం ఉండదు. అది కూడా ఆటో మ్యుటేషన్ ద్వారానే జరుగుతాయి. ఇంతకంటె పారదర్శకం, పటిష్టమైన విధానం ఏముంది? లాండ్ టైట్లింగ్ యాక్ట్ వచ్చింది వివాదాలు లేని సమాజాన్ని తీసుకువచ్చి, ప్రజలను ఆ వివాదాల నుంచి విముక్తి చేయడం కోసమే. టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి సర్వస్వం కాదు
4 ) రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన చట్టం ప్రకారం నియమితుడయ్యే భూ ప్రాధికార సంస్థ, టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి (టీఆర్‌వో) పరిధిలోకి ప్రజల స్థిరాస్తులన్నీ వెళ్లిపోతాయన్నది తప్పుడు ప్రచారమే.
లాండ్ టైట్లింగ్ అప్పిలేట్ అథారిటీ ఆర్డర్ లేకుండా టీఆర్‌వో టైటిల్ రిజిస్టర్‌లో ఏ మార్పూ చేసే అవకాశం ఉండదు. టీఆర్‌వో ప్రజల ఆస్తి హక్కుల టైటిల్ రిజిస్టర్‌ను మాత్రమే నిర్వహిస్తారు. అప్పిలేట్ అథారిటీ ఇరు పార్టీల వాదనలు విన్న తర్వాతే ఆర్డర్ ఇస్తారు. ఈ అధికారి జాయింట్ కలెక్టర్, అంతకంటే పైస్థాయి అధికారి మాత్రమే ఉంటారు.
నిజానికి అప్పిలేట్ అధికారి ఆర్డర్ ఇచ్చాక కూడా టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి నేరుగా దాన్ని రిజిస్టర్‌లో మార్పు చేయలేరు. ఆర్డర్ ప్రకారం ఆటో మ్యుటేషన్ జరిగిపోతుంది. ఇక్కడ రెవెన్యూ, రిజిస్ట్రేషన్, సివిల్ కోర్టుల జోక్యం ఉండదు. దీనివల్ల ప్రజల ఆస్తికి పూర్తి భద్రత ఏర్పడుతుంది.
5 ) స్థిరాస్తిని కొనుక్కుంటే రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత దాన్ని టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి దగ్గర తిరిగి నమోదు చేయించుకోవాలనేది కూడా స్వార్థపరులు సృష్టించిన అపోహే.
రిజిస్ట్రేషన్ జరిగిన వెంటనే ఆటో మ్యుటేషన్ జరిగిపోతుంది. అలాంటప్పుడు తిరిగి టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి దగ్గర నమోదు చేయించుకోవాలని చెప్పడం ప్రజలను వంచించడమే.
సేకరణ : దేవరశెట్టి. శ్రీనివాసరావు