మీరేంటి.. నాకు సలహాలు ఇచ్చేది

-జగన్.. నిన్ను పాతాళానికి తొక్కేస్తా!
– నిన్ను పాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కల్యాణ్ కాదు
– మీరేంటి నాకు సలహాలు, సూచనలు ఇచ్చేది?
– జగన్ ఎలాంటి వాడో మీకు తెలుసా?
– నేను యుద్ధం చేస్తున్నది మామూలు వ్యక్తితో కాదు
– నన్ను అనుమానించే వాడు నా వాడు కాదు
– క్లేమోర్ మైన్లు పేలినా చలించని దురంధరుడు చంద్రబాబు
– నా నాలుగో పెళ్లాం నువ్వేనా జగన్… అయితే రా జగన్
– భారతి గారూ… ఆ మాట మేం మిమ్మల్ని అంటే ఎలా ఉంటుంది
– ఐదుగురు రెడ్ల కోసం ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారు
– జనసేన-టీడీపీ జెండా సభలో జనసేనాని పవన్ కల్యాణ్

తాడేపల్లిగూడెం: జనసేనాని పవన్ కల్యాణ్ తాడేపల్లిగూడెం జనసేన-టీడీపీ జెండా సభలో తీవ్ర భావోద్వేగాలతో ప్రసంగించారు. సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు. జగన్… సామాన్యుడు రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తాం. జగన్… నీ కోటలు బద్దలు కొడతాం అని తీవ్ర స్వరంతో హెచ్చరించారు. తాము 24 ఎమ్మెల్యే సీట్లకు, 3 ఎంపీ సీట్లకు ఒప్పుకోవడం పట్ల వైసీపీ నేతలు విమర్శిస్తున్నారని… కానీ వామనుడ్ని చూసి బలిచక్రవర్తి కూడా ఇంతేనా అనుకున్నాడని, ఆ తర్వాత నెత్తిమీద కాలుబెట్టి తొక్కేసరికి అది ‘ఎంతో’ అని అప్పుడు అర్థమైందని అన్నారు. వామనుడిలాగా నిన్ను అథఃపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కల్యాణ్ కాదు, నా పార్టీ పేరు జనసేన కాదు… అంటూ సవాల్ విసిరారు.

“మనం ఏమిటో వైసీపీ వాళ్లకు ఎన్నికల తర్వాత అర్థమవుతుంది… నెత్తి మీద కాలేసి తొక్కుతాం కదా… అప్పుడు అర్థమవుతుంది మేమేంటో. జగన్… జనసేన ఒక్క సీటు గెలిస్తేనే… నేను రాజమండ్రికి వస్తుంటే రాత్రికి రాత్రి రోడ్లు వేశారు. 10వ తరగతి పిల్లలు రాత్రంతా చదువుకుని పరీక్షకు సిద్ధమైనట్టు మీరు రాత్రికి రాత్రి రోడ్లు వేశారు. ఇప్పటిదాకా పవన్ కల్యాణ్ తాలూకు శాంతినే చూశావు… ఇక నా యుద్ధం ఏంటో చూస్తావు” అంటూ హెచ్చరించారు.

ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అండగా నిలవకపోతే, నాకు కష్టం వచ్చినప్పుడు ఎవరూ నిలబడరు అనే మాటను తాను నమ్ముతానని అన్నారు. తాను పొత్తు పెట్టుకున్నది అందుకేనని వెల్లడించారు. తాను 2019లోనే ప్రజలకు చెప్పానని, జగన్ కు ఓటేయొద్దని చెప్పినా వినలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో సహకారం ఉంటేనే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని, అందుకే సహకారం అందించడానికి మనల్ని తగ్గించుకుని మరీ ప్రజలను గెలిపించడానికి ముందుకొచ్చానని వివరించారు. 2014లో జనసేన పార్టీని స్థాపించినప్పటి నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి కృషి చేస్తున్నానని, పొత్తులు కూడా అందుకే పెట్టుకున్నానని తెలిపారు.

సీట్ల పంపకంపై నాకు సూచనలు, సలహాలు ఇస్తున్నారు… మీకేం తెలుసు ఈ జగన్ ఎలాంటివాడో! సొంత బాబాయ్ ని చంపాడు… సొంత చెల్లెలిని గోడకేసి కొట్టాడు. నేను ఎవడితో యుద్ధం చేస్తున్నానో నాకు తెలుసు. నాకు సలహాలు, సూచనలు ఇవ్వాలని చూడొద్దు. సొంతబాబాయ్ ని చంపి గుండెపోటు అన్నా, వేల కోట్లు దోచినా, దళిత డ్రైవర్ ను చంపి శవాన్ని డోర్ డెలివరీ చేసినా ఎవరూ ప్రశ్నించరు. ఏ తప్పు చేయని నన్ను ప్రశ్నిస్తారేంటి?

రాష్ట్రంలో ఐదుగురు రెడ్ల కోసం ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారు. ఏపీలో ఏ మూలకు వెళ్లినా ఈ ఐదుగురు రెడ్లు ప్రజలకు ఏం కావాలో నిర్ణయిస్తారు. ప్రజలకు ఏం కావాలో నిర్ణయించడానికి మీరెవరు? మాట్లాడితే నేను ఒక్కడినే అని జగన్ అంటున్నాడు. నువ్వు నిజంగా ఒక్కడివా? ఒక్కడివే ప్రజలను ఇబ్బంది పెడుతున్నావా? ఈయన యువ ముఖ్యమంత్రి అంట. యువతను బొంద పెట్టడానికి తప్ప ఈ యువ ముఖ్యమంత్రి ఎందుకూ పనికిరాలేదు.

నన్ను నమ్మే వాడే నా వాడు అవుతాడు, నన్ను అనుమానించేవాడు నా వాడు ఎప్పటికీ కాడు. పవన్ కల్యాణ్ తో స్నేహం అంటే చచ్చేదాకా… పవన్ కల్యాణ్ తో శత్రుత్వం అంటే అవతలివాడు చచ్చేదాకా. పవన్ కల్యాణ్ అంటే… అర్ధరాత్రి వచ్చే 108, మహిళలు రక్షణ కోసం కట్టే రక్షాబంధన్, పెద్దలు గౌరవంగా భుజాన వేసుకునే కండువా… అంటూ పవన్ ఆవేశంగా ప్రసంగించారు.

క్లేమోర్ మైన్లు పేలినా, పేలుడు ధాటికి వాహనం 16 అడుగుల ఎత్తుకు ఎగిసి కిందపడినా… చొక్కా దులుపుకుని ఇవతలికి వచ్చేసిన దురంధరుడు చంద్రబాబు అని జనసేనాని పవన్ కల్యాణ్ కీర్తించారు. ఇప్పుడు తాము అటువంటి గొప్ప నేతతో కలిసి నడుస్తున్నామని అన్నారు. చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి అవసరం అని స్పష్టం చేశారు. చంద్రబాబు రాష్ట్రాభివృద్ధికి అవసరమైన వనరులు సమకూర్చగలరని, పారిశ్రామికవేత్తలను తీసుకురాగలరని, నవ నగర నిర్మాణం చేయగలరని వివరించారు. రాష్ట్రాన్ని ముందుకు నడిపించగలడు అనే నమ్మకంతోనే చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నామని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

“నా తపన మీరు బాగుండాలనే… అయితే యుద్ధ తంత్రం గురించి, పోల్ మేనేజ్ మెంట్ గురించి మీకేం తెలుసు? అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయాలంటే ఎంత ఖర్చవుతుందో మీకు తెలుసా? మన దగ్గర అంత డబ్బులు ఉన్నాయా? అందుకే 24 అసెంబ్లీ సీట్లు, 3 లోక్ సభ స్థానాలకు ఒప్పుకోవాల్సి వచ్చింది” అని పవన్ కల్యాణ్ వివరించారు. నన్ను నమ్మండి… వ్యూహం నాకు వదిలేయండి… నేను మీకోసం పనిచేస్తాను అని స్పష్టం చేశారు. నన్ను నమ్మి నడుస్తున్న జనసైనికులు, వీర మహిళలు, యువత… నాలుగు దశాబ్దాల అనుభవం ఉన్న చంద్రబాబును నమ్మి నడుస్తున్న తెలుగు తమ్ముళ్లు, తెలుగు మహిళలు అందరూ కలిసి మహా యుద్ధంలో పాల్గొందాం… ఈ సందర్భంగా 2024 ఎన్నికలకు శంఖారావం పూరిస్తున్నాను అని పవన్ పేర్కొన్నారు.
మాటిమాటికీ తన పెళ్లిళ్ల గురించి మాట్లాడుతుంటాడని, కానీ తామెప్పుడూ జగన్ అర్ధాంగి గురించి మాట్లాడలేదని పవన్ స్పష్టం చేశారు. “జగన్ కు సంబంధించినంత వరకు పవన్ కల్యాణ్ అంటే మూడు పెళ్లిళ్లు, రెండు విడాకులు. అతడి దృష్టిలో నాలుగు పెళ్లిళ్లు అంటాడు. మరి ఆ నాలుగో పెళ్లాం ఎవరో తెలీదు… మరి అది జగనేమో నాకు తెలియదు. నాకు ఇదే విసుగొస్తోంది జగన్! లేని నాలుగో పెళ్లాం అంటే నువ్వే… రా జగన్ రా!

భారతీ మేడం గారూ మీకు కూడా చెబుతున్నాను… మేం ఎప్పుడయినా సరే మిమ్మల్ని మేడం భారతి గారూ అని గౌరవంగా మాట్లాడతాం. మీ ఆయన ఇంత నీచంగా ప్రవర్తించినా గానీ, చంద్రబాబు అర్ధాంగిని మాట్లాడినా కానీ, నా భార్యను అన్నా కానీ మేం మిమ్మల్ని ఏమీ అనలేదు. పెళ్లాలు, పెళ్లాలు అంటాడు.. ఆ మాట మేం మిమ్మల్ని అంటే ఎలా ఉంటుంది భారతి గారూ… ఒక్కసారి ఆలోచించండి. నేనేమీ ఇంగ్లీషు మీడియాలో చదువుకున్న వాడ్ని కాను. నాక్కూడా భాష వచ్చు… నేనూ మాట్లాడగలను” అంటూ పవన్ హెచ్చరించారు.