Mahanaadu-Logo-PNG-Large

శానిటేషన్‌ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి

-వేలెత్తి చూపించే పరిస్థితి రాకుండా చేద్దాం 
-ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు

నరసరావుపేట, మహానాడు:  నియోజకవర్గంలో శానిటేషన్ పనులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని నరసరావుపేట ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవిందబాబు అన్నారు. నరసరావుపేట మున్సిపల్ సచివాలయ శానిటేషన్ సిబ్బందితో సమీక్షా సమావేశం శనివారం నిర్వహించారు. గత కొద్ది రోజులుగా వర్షాలు తీవ్రంగా పడుతున్న నేపథ్యంలో వ్యాధులు వ్యాపించే అవకాశాలున్నాయని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కొన్ని ప్రాంతాల్లో మురుగు నీరు రోడ్లపై పారుతోందని, ఫలితంగా దోమలు వ్యాపిస్తున్నాయనే ఫిర్యాదులు ప్రజల నుండి ఎక్కువగా వస్తున్నట్లు తెలిపారు. ప్రజల ఆరోగ్యం గురించి సరైన నిర్ణయం తీసుకునే బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నందున ప్రజల కోసం పని చేయాలన్నారు. మనం చేసే పనే మనకు గుర్తింపు తీసుకొస్తుందనే విషయాన్ని గుర్తెరిగి పని చేయాలని సూచించారు.

సైడ్ కాలువల విషయంలో గత ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం ప్రదర్శించిందని పేర్కొన్నారు. ఇళ్ల నుంచి వచ్చే మురుగు తొలగింపు పై దృష్టి పెట్టాలన్నారు. ఇప్పుడు పట్టించుకోకుంటే.. తర్వాత వ్యాధులు ప్రబలితే పరుగులు పెట్టినా ఫలితం ఉండబోదన్నారు. ఎవరైనా పని చేయకపోయినా కొంత కాలం వేచి చూస్తానని, అప్పటికీ చేయకుంటే మాత్రం చర్యలు తీప్పవన్నారు.రాష్ట్ర అభివృద్ధికి యువత పాత్ర అత్యంత కీలకమైనదని, ఎవరో  చెప్పే వరకు కాకుండా అభివృద్ధిపై మీ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు.

పని చేసిన సిబ్బందికి అవార్డులు,రివార్డులు ఇచ్చేలాచూస్తానన్నారు. ఎవరైనా ఇబ్బందులకు గురి చేస్తే అధికారుల దృష్టికి తీసుకురావాలని, వాటిని పరిష్కరించే బాధ్యతను వ్యక్తిగతంగా తీసుకుంటానని ఎమ్మెల్యే డా౹౹చదలవాడ శానిటేషన్ సిబ్బందికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కొట్ట కిరణ్, వాసిరెడ్డి రవి, కొవ్వూరు బాబు, మస్తాన్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.