వినుకొండలో కూటమి శ్రేణుల నిరసన కార్యక్రమం
పాల్గొన్న టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు
వినుకొండ, మహానాడు: రాష్ట్రవ్యాప్తంగా మే 1వ తేదీనే లబ్దిదారులకు ఇళ్ల దగ్గరే పింఛన్లు పంపిణీ చేయాలని కోరుతూ వినుకొండ 14వ వార్డులో టీడీపీ శ్రేణులు ఆదివారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. వినుకొండ కూటమి అభ్యర్థి జి.వి.ఆంజనేయులు, జనసేన నియోజకవర్గ సమన్వయకర్త కొనిజేటి నాగశ్రీను రాయల్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. జీవీ మాట్లాడుతూ గత నెలలో 32 మంది అభాగ్యుల ప్రాణాలు తీసిన విషాదం పునరావృతం కానివ్వొద్దని, కుట్రలు ఆపి అవ్వా తాతలకు ఇంటికే పింఛను అందించాలని విజ్ఞప్తి చేశారు. పింఛన్లు ఇంటికి ఇవ్వకుండా ఇబ్బంది పెడితే ఓట్లు పడతాయని భావిస్తున్నారని కానీ, వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. అవసరమైతే ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. జగన్ ఇప్పటికైనా కుట్రలు మానుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ఎమ్మార్పీఎస్ నాయకులు పాల్గొన్నారు.