వైసీపీ ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబాటు

– ఎమ్మెల్యే కృష్ణప్రసాద్‌

పెడన, మహానాడు: గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబాటు చేసినట్టుగానే భావిస్తున్నామని శాసన సభ్యుడు కాగిత కృష్ణ ప్రసాద్, మాజీ శాసన సభ్యుడు బూరగడ్డ వేదవ్యాస్ అన్నారు. పెడన మండలం నడుపూరు గ్రామ సచివాలయం వద్ద మంగళవారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో వారు మాట్లాడుతూ గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద నిప్పులు చెరిగారు. రైతులకు తీవ్ర అన్యాయం చేసే ల్యాండ్ టైటిలింగ్ విధానం ప్రవేశ పెట్టడం ద్వారా జగన్ ఘోరమైన తప్పిదం చేశారని అన్నారు. పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటోలను వేయించుకోవడం కూడా అంతే తప్పన్నారు. ప్రజల సొంత ఆస్తి మీద ఆయన బొమ్మలేంటి అని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని రద్దు చేశామని గుర్తు చేశారు.

చంద్రబాబు నాయుడు వల్లే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని కృష్ణప్రసాద్ అన్నారు. చంద్రబాబు నాయుడు స్టేట్స్ మెన్ అని వ్యాస్ కితాబు ఇచ్చారు. జాతీయ ఉపాధి హామీ పథకం నిధులు 11 లక్షల రూపాయలతో నిర్మించనున్న రహదారి పనులకు నాయకులు శంకుస్థాపన చేశారు. నేతలను స్థానిక నాయకులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి బూరగడ్డ కిషన్ తేజ, జడ్పిటిసి అర్జ వెంకట నగేష్, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ గుడిసెవ రామారావు, తదితరులు పాల్గొన్నారు.