వినతులతో టీడీపీ కార్యాలయానికి పోటెత్తిన అర్జీదారులు

• ప్రతి సమస్యను ఓపిగ్గా విన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు
• సమస్యలపై సంబంధిత ఎమ్మెల్యేలు, అధికారులకు ఫోన్ చేసి పరిష్కారానికి ఆదేశం
• భూ సమస్యలు, నిరుద్యోగ సమస్యలు, అక్రమ కేసులపై అధికంగా వినతులు
• ఫీజు రీయింబర్స్ మెంట్ సమస్యలు, పింఛన్ సమస్యలపై పలువురు నుండి వినతులు స్వీకరణ
• పార్టీకోసం పనిచేసిన నేతలు నామినేటెడ్ పదవుల కోసం వినతుల సమర్పణ
• ఇంకా వైసీపీకి తొత్తులుగా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలకు నేతలు విన్నపం
• వందల మంది అర్జీదారులు రాయలసీమ నుండి టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడికి వినతి

మంగళగిరి: ప్రజా సమస్యల పరిష్కారంలో భాగంగా టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు ఆదేశానుసారం మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో నేడు కూడా ప్రజల నుండి వినతుల స్వీకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ వినతుల స్వీకరణ కార్యక్రమానికి అర్జీదారులు పోటెత్తారు.

టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు నేరుగా వారి నుండి వినతులను స్వీకరించారు. వెంటనే పరిష్కరించదగిన వినతులపై సంబంధిత అధికారులకు ఫోన్ చేసి అర్జీదారుల సమస్యను తెలియజేసి ఆ సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు.
ముఖ్యంగా భూ కబ్జాలు, అక్రమ కేసులు, నిరుద్యోగ సమస్యలు, ఫీజు రీయింబర్స్ మెంట్ సమస్యలు, పింఛన్ సమస్యలు, ఇళ్ల సమస్యలు, వైసీపీ హయాంలో అక్రమంగా ఆపేసిన బిల్లులు, వైసీపీ పాలనలో తొలగించిన ఉద్యోగాలు, ఇంకా వైసీపీకి తొత్తులుగా పనిచేస్తున్న అధికారుల సమస్యలపై అర్జీలు పోటెత్తాయి. పలువురు వైద్య సహాయార్థం సీఎం రిలీఫ్ ఫండ్ ను అభ్యర్థించగా.. పార్టీ కోసం పనిచేసిన నాయకులు నామినేటెడ్ పదువుల ఆశిస్తూ పల్లా శ్రీనివాసరావుకు వినతులు అందించారు.

అర్జీదారుల్లో రాయలసీమ నుండి వందల మంది వచ్చి వారి సమస్యలపై వినతులు అందించారు.

• నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గానికి చెందిన కాటసాని వెంకట రమణారెడ్డి తన భూసమస్యలను టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా వద్దకు తీసుకు వచ్చారు. తాము ముగ్గురు అన్నదమ్ములమని… తన సోదరుల భూమిని ఆన్ లైన్ లో ఎక్కించి తన భూమిని ఆన్ లైన్ చేయకుండా అధికారులు ఇబ్బంది పెడుతున్నారని సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. వెంటనే పల్లా శ్రీనివాసరావు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే, మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడి సమస్యను వివరించి పరిష్కరించాలని కోరారు.

• పుట్టపర్తి నియోజకవర్గం దొనకోట మండలం, సుబ్బరాయుపల్లె నుండి వచ్చిన వెంకటలక్ష్మీ తనకు ఎవరూ లేరని ఉండటానికి ఇళ్లు కూడా లేదని కూలీ నాలి చేసుకుంటూ బ్రతుకుతున్న తానకు సాయం చేయాలని అభ్యర్థించింది. వెంటనే స్పందించిన పల్లా శ్రీనివాసరావు పుట్టపర్తి ఎమ్మెల్యేకు కాల్ చేసి ఆ మహిళకు ఒంటరి మహిళా పింఛన్ తోపాటు ఇళ్లు కట్టుకోవడానికి ప్రభుత్వం నుండి సాయం చేయాలని ఆదేశించారు

• కడప జిల్లా పోరుమామిళ్ల మండలం నుండి వచ్చిన షేక్ లియాజ్ తమ భూ సమస్యను పల్లా శ్రీనివాసరావు దృష్టికి తీసుకెళ్లారు. వైసీపీ వైస్ఎంపీపీ ప్రోద్బలంతో అప్పటి ఎస్సై మల్లికార్జున రెడ్డి తమపై అక్రమ కేసులు పెట్టి వేధించారని వాటిని పరిష్కరించాలని కోరారు.

• తంబళ్లపల్లె నుండి 100 మంది టీడీపీ నాయకులు కార్యకర్తలు కేంద్ర కార్యాలయానికి వచ్చి… తమ సమస్యను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడికి విన్నవించారు. తమ నియోజకవర్గానికి ఇంఛార్జ్ ను నియమించాలని .. ఇంకా పెద్దిరెడ్డి ధ్వారకానాథ్ రెడ్డి, వైసీపీ నేతల కనుసన్నల్లో పనిచేస్తున్న అధికారులు సీఐ, ఎస్సై, MDO, MRO, సచివాలయ ఉద్యోగులను బదిలీ చేయాలని కోరారు.

• విదేశాల్లో డాక్టర్ చదువులు చదువుతూ.. కరోనా సమయంలో ఇండియాకు వచ్చిన తాము ఇంటర్నెషిప్ సమస్యను ఎదుర్కొంటున్నామని. తమ సమస్యను పరిష్కరించాలని పలువురు డాక్టర్లు కోరారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లి పరిష్కరిస్తానని వారికి హామీ ఇచ్చారు.

• తిరుపతి జిల్లా ఓజిలిలో ఎస్టీలు నిర్మించుకుంటున్న ఇళ్లను వైసీపీ నేతలు అడ్డుకున్నారని ఆ సమస్య కోర్టులో ఉందని సమస్యను పరిష్కరించి నిరుపేద ఎస్టీలను ఆదుకోవాలని అక్కడి నుండి వచ్చిన అర్జీదారులు టీడీపీ రాష్ట్ర అధ్యక్షునికి విజ్ఞప్తి చేశారు

• కేరళలో ఇంటర్ చదివిన కారణంగా… ఏపీలో ఇంజనీరింగ్ చదవాలనుకుంటున్న తనకు ఫీజు రియంబర్స్ మెంట్ రావడంలేదని కదిరికి చెందిన అమృత వాణి తన సమస్యను పల్లా శ్రీనివాసరావు దృష్టికి తీసుకు వచ్చారు. ఆ సమస్య పరిష్కారానికి తాను కృషి చేస్తానని ఆమెకు పల్లా హామీ ఇచ్చారు.

• 1998 డీఎస్పీ క్వాలిఫైడ్ అయిన పలువురు అభ్యర్థులు తమ సమస్యను టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు దృష్టికి తీసుకెళ్లారు. క్వాలిఫైడ్ అయిన అభ్యర్థులకు అన్యాయం జరిగిందని.. వేంటనే నియామకాలు చేపట్టి వారికి న్యాయం చేయాలని వారు కోరారు.

• 2018 లో పశుసఖీలుగా నియమితులై.. పాడి రైతులకు పశు వైద్యాధికారులకు అనుసంధాన కర్తలుగా పనిచేసిన ఉద్యోగులు 6,400 మందిని వైసీపీ అధికారంలోకి రాగానే తొలగించారని… అందులో ఎస్సీ, ఎస్టీలే అధికంగా ఉన్నారని తూర్పుగోదావరి నుండి వచ్చిన నల్లూరి పుష్పావతి, పల్లింట్ల కోటసత్యవతి పలువురు బాధితులు పల్లా ముందు వాపోయారు. వారిని వెంటనే యధావిధిగా కొనసాగించాలని కోరారు.

• కృష్ణా జిల్లా నాగాయలంక మండలం నంగెడ్డ గ్రామానికి చెందిన మరళీకృష్ణ తమ స్థలాన్ని పంచాయతీ సెక్రటరీతో కుమ్మక్కై ఆ ఊరిలో పలువురు ఆక్రమించుకుంటున్నారని.. తమ స్థల ఆక్రమణపై ప్రశ్నిస్తే.. దాడులకు వస్తున్నారని తమ సమస్యను పరిష్కరించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

• నాగవంశం కమ్యునిటీకి చెందిన తాము బీసీ Dలో ఉన్నామని తమను బీసీ A లోకి మార్చాలని ఆ కమ్యునిటీకి చెందిన రాబిల్లి పైడి రాజు పల్లా శ్రీనివాసరావుకు విజ్ఞప్తి చేశారు.

వినతులు స్వీకరించిన పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. అర్జీదారులు సమస్యలన్నీ పరిష్కరిస్తామని.. అధికంగా భూ సమస్యలు, నిరుద్యోగ సమస్యలు, అక్రమ కేసుల గురించి వినతులు వచ్చాయని… నిరుద్యోగ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తుందని.. స్కిల్ సెన్సెస్ నిర్వహించి పరిశ్రమలతో పాటు ఉపాధి కల్పనకు పెద్దపీట వేస్తామన్నారు.. భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ను తీసుకు రాబోతున్నామని తద్వార భూ సమస్యలు త్వరగా పరిస్కారం అవుతాయని తెలిపారు.