– ఎమ్మెల్యే గళ్ళా మాధవి
గుంటూరు, మహానాడు: పశ్చిమ నియోజకవర్గం 24వ డివిజన్ లో ఉన్న యస్.కే.బి.యం స్కూల్ ను ఎమ్మెల్యే గళ్ళా మాధవి సందర్శించారు. స్వచ్ఛభారత మిషన్ కార్యక్రమంలో భాగంగా స్కూల్ ఆవరణలో ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి మొక్క నాటారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ బూని పర్యావరణ హితం కోసం మొక్కలు నాటాలని ఎమ్మెల్యే గళ్ళా మాధవి పిలుపునిచ్చారు. తొలుత స్కూల్ ఆవరణ, పాఠశాల గదులను పరిశీలించారు.
పాఠశాలను శుభ్రంగా ఉంచుకోవాలని, విద్యార్థులు పరిసరాల పరిశుభ్రత కోసం శ్రమదానం చేసి పరిశుభ్రత కోసం బాటలు వేయాలని ఎమ్మెల్యే కోరారు. అదేవిధంగా గతంలో కురిసిన భారీ వర్షాలకు పాఠశాల ప్రహరీ పీకల వాగుకు అనుకొని ఉండటం వల్ల, వాగు ప్రవాహానికి కూలిపోయినదని దీనివల్ల విద్యార్థులకు ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఎమ్మెల్యే అన్నారు. వెంటనే నిర్మించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.