Mahanaadu-Logo-PNG-Large

తెలంగాణ‌లో పుష్కలంగా పర్యాటక అవకాశాలు

-పర్యాట‌క‌ అభివృద్దికి నూత‌న ప‌ర్యాట‌క విధాన ముసాయిదా సిద్ధం
-ఎకో, టెంపుల్, మెడిక‌ల్ టూరిజం అభివృద్ధి
-ప‌ర్యాట‌క రంగ అభివృద్ధితో ఆర్థిక స్వ‌యం సంవృద్ధి, ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాలు
-సోమ‌శిల‌, రామప్ప, లక్నవరం, నాగార్జున సాగర్, అనంతగిరి హిల్స్ ను డెస్టినేష‌న్ వెడ్డింగ్ కేంద్రాలుగా తీర్చిదిద్దుతాం
-అనంత‌గిరిలో వెల్నెస్ టూరిజం రిసార్ట్‌ ఏర్పాటు
-బుద్ధ‌ గ‌యా త‌ర‌హాలో బుద్ధ‌వ‌నాన్ని తీర్చిదిద్దుతాం: మంత్రి జూప‌ల్లి కృష్ణారావు

హైద‌రాబాద్, జూలై 3: ప‌ర్యాట‌క కేంద్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్ది.. ఆర్థికంగా స్వ‌యం సంవృద్ది సాధించ‌డం.. ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాలు క‌ల్పించ‌డ‌మే ల‌క్ష్యంగా నూత‌న ప‌ర్యాట‌క విధాన ముసాయిదా రూపొందించామ‌ని ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు అన్నారు. డా. బీఆర్. అంబేడ్క‌ర్ స‌చివాల‌యంలోని మీడియా సెంట‌ర్ లో ప‌ర్యాట‌క రంగ అభివృద్ధి, సాంస్కృతిక శాఖ బ‌లోపేతంపై మంత్రి జూప‌ల్లి విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడారు.

గ‌డిచిన ప‌దేళ్ల‌లో ప‌ర్యాట‌క శాఖ ఉన్న‌ద‌నే విష‌యం మ‌రిచిపోయామ‌ని, ప‌ర్యాట‌క రంగ అభివృద్ధికి ఓ పాల‌సీ అంటు లేకుండా పోయింద‌ని, గ‌త ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించిద‌ని ద్వ‌జ‌మెత్తారు. ప‌ర్యాట‌క రంగం అస్త‌వ్య‌స్త‌మైంద‌ని, తారామ‌తి బ‌రాద‌రి, హ‌రిత హోటల్స్ నిర్వ‌హ‌ణ అద్వ‌న్నంగా త‌యారైంద‌ని, యుద్ద ప్రాతిపాదిక‌న ప‌ర్యాట‌కాన్ని అభివృద్ధి చేస్తామ‌ని, ఆరు నెల‌ల్లోనే పురోగ‌తి సాధిస్తామ‌ని ధీమా వ్య‌క్తం చేశారు. కేంద్ర ప్ర‌భుత్వం నుంచి నిధుల‌ను కూడా రాబ‌ట్ట‌డంలో గ‌త ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంద‌ని విమ‌ర్శించారు.

సీయం రేవంత్ రెడ్డి సారధ్యంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం .. ప‌ర్యాట‌క రంగానికి అధిక ప్రాధ్య‌న‌త‌ను ఇస్తుంద‌ని, ఎకో, టెంపుల్, మెడిక‌ల్ టూరిజంపై ప్ర‌ధానంగా దృష్టి సారించిన‌ట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి నూత‌న ప‌ర్యాటక విధాన ముసాయిదాను సిద్ధం చేశామ‌ని, సీయం రేవంత్ రెడ్డి స‌ల‌హాలు, సూచ‌న‌లకు అనుగుణంగా నిర్ణ‌యం తీసుకుంటామ‌ని తెలిపారు. త్వ‌ర‌లోనే కేంద్ర ప‌ర్యాట‌క, సాంస్కృతిక‌ శాఖ మంత్రిని క‌లిసి తెలంగాణ ప‌ర్యాట‌క అభివృద్దికి నిధులు కేటాయించాల‌ని కోర‌తామ‌ని తెలిపారు.

ప్ర‌భుత్వ – ప్రైవేట్ భాగ‌స్వామ్యంలో ప‌ర్యాట‌క ప్ర‌దేశాల‌ను అభివృద్ధి చేసి.. మౌలిక వ‌స‌తులు క‌ల్పించ‌డం ద్వారా ఆదాయం పొందే మార్గాల‌ను అన్వేషిస్తున్నామ‌ని అన్నారు. తెలంగాణ ప్రకృతి రమణీయమైన ప్రదేశాలు, చారిత్రక వారసత్వ సంపదకు నెలవుగా ఉంద‌ని, ఎన్నో వ‌న‌రులు ఉన్నప్ప‌టికి అనుకున్న స్థాయిలో ప‌ర్యాట‌కాన్ని అభివృద్ధి చేయ‌లేక‌పోయామ‌ని, వ‌న‌రులు లేని సింగాపూర్, దుబాయ్, ఆఫ్రికా లాంటి దేశాలు… త‌మ ప్ర‌దాన ఆదాయ వ‌న‌రుగా ప‌ర్యాట‌క రంగాన్ని మ‌లుచుకున్నాయ‌ని పేర్కొన్నారు.

తెలంగాణ‌ను ప‌ర్యాట‌కాన్ని అంత‌ర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్ది… లోక‌ల్ టు గ్లోబ‌ల్ టూరిస్ట్ ల‌ను ఆక‌ర్శించేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలిపారు. కృష్ణాన‌దీ బ్యాక్ వాట‌ర్స్ లో సోమ‌శిల‌ను డెస్టినేష‌న్ వెడ్డింగ్, స‌హ‌స ప‌ర్యాట‌కానికి అనువైన ప్ర‌దేశంగా గుర్తించామ‌ని, డెస్టినేష‌న్ వెడ్డింగ్ ను ప్ర‌మోట్ చేయ‌డానికి.. రామప్ప, లక్నవరం, నాగార్జున సాగర్, అనంతగిరి హిల్స్ వంటి ముఖ్య‌మైన ప్ర‌దేశాలను అభివృద్ధి చేస్తామ‌ని వెల్ల‌డించారు.

అనంత‌గిరిలో వెల్నెస్ టూరిజం రిసార్ట్‌ ఏర్పాటుకు కృషి చేస్తున్నామ‌ని చెప్పారు. మ‌న సంస్కృతి, సాంప్ర‌దాయాలను మేళ‌వించి వివాహ వేడుక‌లు నిర్వ‌హించేలా చూస్తామ‌న్నారు. నాగ‌ర్జున సాగ‌ర్ లోని బుద్ధ‌వ‌నాన్ని.. బుద్ద గ‌యా త‌ర‌హాలో అంత‌ర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్ది తూర్పు, ద‌క్షిణ దేశాల పర్యాట‌కుల‌ను అక‌ట్టుకునేలా వ‌స‌తులు క‌ల్పిస్తామ‌ని అన్నారు.

గ‌త ప్ర‌భుత్వంలో ప్ర‌తిష్టాత్మ‌క NITHM ప్ర‌తిష్ట మ‌స‌క బారిందని, గ‌తంలో 800 పైగా స్ట్రెంత్ ఉంటే.. ఇప్పుడు 200కు ప‌డిపోయిందని… దీనికి పూర్వ వైభ‌వం తీసుకువ‌స్తామ‌ని అన్నారు.

సంస్కృతి అంటే కేవ‌లం క‌ళ‌లు, క‌ళాకారులు మాత్ర‌మే కాద‌ని అది మ‌న జీవ‌న విధానాన్ని ప్ర‌తిబింభిస్తుంద‌ని, పురాత‌న క‌ళ‌ల‌ను ఒక గొడుగు క్రింద‌కు తెచ్చి.. పేరిణి లాంటి నృత్య రూపాల‌ను మ‌రింత ప్రోత్స‌హిస్తామ‌ని అన్నారు. ప‌ర్యాట‌క ప్ర‌దేశాలు, షాపింగ్ మాల్స్ లో ప్లాష్ మాబ్స్ నిర్వ‌హిస్తున్నామ‌ని వెల్ల‌డించారు.

ద‌శ‌ర‌థి కృష్ణమాచార్యులు శ‌త‌జ‌యంతి ఉత్స‌వాలు, కాళోజీ నారాయ‌ణ రావు జ‌యంతి వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హిస్తామ‌ని ఈ సంద‌ర్భంగా చెప్పారు.

ఈ స‌మావేశంలో ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రి వాణి ప్ర‌సాద్, ప‌ర్యాట‌క అభివృద్ధి సంస్థ మేనెజింగ్ డెరెక్ట‌ర్ ప్ర‌కాష్ రెడ్డి, ప‌ర్యాట‌క శాఖ డైరెక్ట‌ర్ ఇలా త్రిపాఠి పాల్గొన్నారు.