– కేంద్ర, రాష్ట్రాల తాజా నిర్ణయం!
– జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు
ఢిల్లీ: డయాఫ్రం వాల్ నిర్మాణ పనులను పాత కాంట్రాక్టు సంస్థ మేఘాకే అప్పగించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాథమిక అభిప్రాయానికి వచ్చాయి. శుక్రవారం కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ తో సీఎం చంద్రబాబు జరిపిన భేటీలో దీనిపై చర్చించి ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది.
మేఘా సంస్థ 2022 నాటి ధరల ప్రకారమే 73వేల క్యూబిక్ మీటర్ల డయాఫ్రం వాల్ నిర్మాణానికి సిద్ధంగా ఉండడంతో ప్రభుత్వంపై అదనపు భారం పడదని, దీంతోపాటు కొత్తగా టెండర్లు పిలిచి కొత్తవారిని ఎంపిక చేసేందుకు పట్టే సమయాన్ని ఆదా చేయొచ్చని నిర్ణయించినట్లు సమాచారం. త్వరలో దీనిపై తుది నిర్ణయం తీసుకొని మేఘాకే పనులు అప్పగించే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు మార్గాలు, అందుకు కేంద్రప్రభుత్వ పరంగా కావాల్సిన సాయం గురించి చంద్రబాబు కేంద్రంతో చర్చించారు.
ఈ సమావేశంలో కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణంపై స్పష్టత వచ్చినట్లేనని ఈ సమావేశంలో పాల్గొన్న నాయకులు తెలిపారు.