వ్యభిచార గృహం నుంచి పోలీసుల మామూలు

– సస్పెండ్ చేసిన హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్, ఆగస్ట్ 28: మధురానగర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ముగ్గురు కానిస్టేబుళ్లు నామోదర్, నాగరాజు, సతీష్‌లను వ్యభిచార గృహం నుంచి లంచాలు వసూలు చేయడంతో సస్పెండ్ చేసినట్లు హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.

ఇంజనీర్స్ కాలనీలోని రెయిన్ ఫ్యామిలీ సెలూన్ స్పాలో క్రాస్ మసాజ్ కింద గుట్టుగా సాగే వ్యభిచార గృహం నుంచి వీరు నెలవారీగా మామూలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. స్పా నుంచి లంచాలు వసూలు చేయడంతో పాటు అక్కడి యువతులతో ఖాకీలు తమ కామ కోరికలను తీర్చుకున్నట్లు వ్యభిచార గృహ నిర్వహకులైన నిందితులు బాలరాజు, రజిత వెల్లడించారు .ఈ వ్యవహారంలో హోం గార్డ్ రాజు కూడా పాలుపంచుకున్నట్లు నిర్ధారణ అయింది. పోలీసు శాఖకు చెందిన మోటారు ట్రాన్స్ పోర్ట్ ఆఫీసుకు అతనిని వెనక్కి పంపించారు.

సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలు, బాధితుల వాంగ్మూలాలు ఆధారంగా ముగ్గురు కానిస్టేబుళ్లు నామోదర్, నాగరాజు, సతీష్ లు, హోం గార్డ్ రాజు వ్యభిచార గృహ నిర్వహకులతో కలిసి మామూలు వసూలు చేసినట్లు నిర్ధారించారు. ఈ ఘటనలపై సీరియస్‌గా దృష్టి పెట్టిన సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, ముగ్గురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసి, హోం గార్డ్ రాజును మోటారు ట్రాన్స్ పోర్ట్ ఆఫీసుకు పంపారు. ఈ పరిణామం పోలీసు శాఖలో కలకలం రేపింది.