గుంతలు లేని రోడ్లే లక్ష్యం!

– మంత్రి కొలుసు పార్థసారథి

నూజివీడు, మహానాడు: ప్రజలు తమకు అందించిన అఖండ విజయాన్ని బాధ్యతగా స్వీకరించి పేద ప్రజల సంక్షేమానికి, రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తామని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. ఆదివారం చాట్రాయి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపన చేశారు. చాట్రాయి మండలం చాట్రాయి గ్రామంలో రూ.25 లక్షలు, చనుబండ గ్రామంలో రూ.50 లక్షలతో రోడ్లకు పనులు ప్రారంభించారు. చాట్రాయి గ్రామంలో రోడ్ల మరమ్మతులకు రూ. 30 లక్షల పనులు, చనుబండ గ్రామంలో గుంతలు లేని రోడ్డు నెట్ వర్క్ పనులను ప్రొక్లయిన్‌తో ప్రారంభించారు. అనంతరం చనుబండ గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడారు.

రాష్ట్ర వ్యాప్తంగా రూ. 820 కోట్ల రూపాయలతో ఆర్ అండ్ బి రహదారుల్లోని గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టినట్టు తెలిపారు. ఏలూరు జిల్లాలో 76 కోట్ల రూపాయలతో ఈ పనులు చేపడుతున్నామని, ఈ పనులన్నింటినీ సంక్రాంతి లోపు పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. జనవరి తర్వాత ముఖ్యమంత్రి రాష్ట్రంలో పర్యటించే సందర్భంలో ఎక్కడైనా గుంతలతో కూడిన రోడ్డు కనబడితే సంబంధిత అధికారులు సస్పెండ్ చేస్తామని ఇప్పటికే హెచ్చరించారన్నారు. నూజివీడు నియోజకవర్గంలో 20 కోట్ల రూపాయల విలువైన పనులు చేపడుతున్నామన్నారు.

ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పాలన అందించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయడు కృతనిశ్చయంతో ఉన్నారని, ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే అయిదు ప్రధాన అంశాలపై చంద్రబాబునాయుడు సంతకాలు చేశారని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో రూ,1600 వందల కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని, మెగా డిఎస్సీ కి నోటిఫికేషన్ ఇచ్చారని, పేదలకు పెన్షన్ ను 3 వేల నుండి 4 వేల రూపాయలకు పెంచడమే కాక మూడు నెలల బకాయిలను కూడా జులై, 1వ తేదీనే అందించారన్నారు. ప్రజలపాలిట శాపంగా మారిన ల్యాండ్ టైటిల్ యాక్ట్ ను వెంటనే రద్దు చేశామన్నారు.

యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంపొందించే దిశగా నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటుచేస్తామన్నారు. ఉచిత గ్యాస్ పంపిణీ దీపావళికి అందించామన్నారు. రాష్ట్రంలోని 61 లక్షల మంది వృద్ధులు, దివ్యాంగులకు ఒకటవ తేదీనే పెన్షన్ అందిస్తున్నామన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రంలో ఆర్ధిక విధ్వంసం చేసినప్పటికీ ఇచ్చిన ప్రతీ హామీని తప్పనిసరిగా నెరవేరుస్తామన్నారు. కార్యక్రమంలో ఆర్ అండ్ బి ఎస్ ఈ జాన్ మోషే, పలువురు ప్రజాప్రతినిధులు, పాల్గొన్నారు.