Mahanaadu-Logo-PNG-Large

కేసీఆర్‌కు ‘పవర్’ షాక్!

-ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోలుపై నోటీసు
-15లోగా వివరణ ఇవ్వాలని ఆదేశం
-25 మందికి నోటీసులు
-జస్టిస్ నర్శింహారెడ్డి వె ల్లడి

హైదరాబాద్: బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు కరెంట్ షాక్ తగిలింది. ఆయన హయాంలో జరిగిన ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోళ్ల కుంభకోణంపై విచారణకు సంబంధించి నోటీసులు జారీ చేసింది. 15 లోగా సమాధానం ఇవ్వాలని జస్టిస్ నర్శింహారెడ్డి ఆదేశించారు. ఇదే విచారణకు సంబంధించి 25 మందికి నోటీసులు ఇచ్చారు. కాగా తనకు జులై 30 వరకూ సమయం కావాలని కేసీఆర్ అభ్యర్థించారు.

మూడు అంశాల విచారణ కొనసాగుతోందని పవర్ కమిషన్ చీఫ్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నోటీసుల్లో పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ ప్లాంట్లపై విచారణ కొనసాగుతోందని అన్నారు. టెండర్ల ప్రక్రియ లేకుండా ఒప్పందాలు జరిగాయని, 25 మందికి నోటీసులు ఇచ్చామని నరసింహారెడ్డి పేర్కొన్నారు.

కాగా మాజీ సీఎం కేసీఆర్ మాత్రం ఇంకా సమాధానం ఇవ్వలేదని, సమయం కావాలని కోరారని వివరించారు. మాజీ సీఎండీ, ప్రస్తుత సీఎండీలతో సమావేశం అయ్యామని తెలిపారు. సోమవారం మాజీ సీఎండీ ప్రభాకర్ రావు, నాటి ప్రిన్సిపల్ సెక్రెటరీ సురేష్ చందాతో సమావేశం అయ్యామని నరసింహా రావు వివరించారు.

కాగా మూడు నిర్ణయాలు అప్పటి ప్రభుత్వం మాత్రమే తీసుకుందని పవర్ కమిషన్ చీఫ్ జస్టిస్ ఎల్ నరసింహా రెడ్డి పేర్కొన్నారు. జెన్‌కోకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ఎస్‌కే జోషి, అరవింద్ కుమార్‌లతో మంగళవారం సమావేశం అయ్యామని చెప్పారు. అరవింద్ కుమార్ అప్పుడే రేగ్యులేటరీ కమిషన్‌కు లేఖ రాశారని, అయితే పట్టించుకోలేదని అన్నారు.

రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందం జరిగినప్పుడు కేంద్రానికి అధికారం ఇవ్వాలని, అయితే రెండు రాష్ట్రాల ఒప్పందంతో ఛత్తీస్‌ఘడ్‌కు అధికారం ఇచ్చారని పేర్కొన్నారు. భారీగా నిధులు ఖర్చు చేసి పవర్ కొనుగోలు చేశారని, మొత్తం ప్రక్రియలో ఎంత నష్టం అనేది తేల్చాల్సి ఉందని నరసింహా రెడ్డి పేర్కొన్నారు.

భద్రాద్రిలో సబ్ క్రిటికల్ టెక్నాలజీని పెట్టారని, అంతటా సూపర్ క్రిటికల్ టెక్నాలజీ పెట్టారని నరసింహా రెడ్డి వివరించారు. యాదాద్రిలో నామినేషన్ బేస్‌లో ఇచ్చారని, ఇంకా పూర్తి కాలేదని అన్నారు.

ఆగస్టు వరకు ఒక లైన్ అందుబాటులోకి వస్తుందని అంటున్నారు కానీ రైల్వే‌లైన్ వెయ్యలేదని పేర్కొన్నారు. అధికారుల నుంచే కాకుండా ప్రముఖులు నుంచి కూడా సమాచారం తీసుకుంటున్నామని పేర్కొన్నారు.