పవర్‌ స్టార్‌…

పాలనలోనూ పవర్‌ ఫుల్‌!

– డిప్యూటీ సీఎం బాధ్యతలు చేపట్టి నేటికి 100 రోజులు!
– 4 శాఖలతో పరిపాలనానైపుణ్యంలో ఆయన స్టైలే వేరు..
– సంతృప్తికరంగా పంచాయతీ, గ్రామీణం, అటవీశాఖల పనితీరు
– పల్లెల్లో పెద్ద ఎత్తున పథకాల పునరుద్ధరణ
– పల్స్‌ సర్వేద్వారా 82.51 లక్షల కుటుంబాలకు ఇంటికే మంచినీరు
– 8 నెలల వాటర్‌సప్లై కార్మికుల జీతాల విడుదల
– 100 రోజుల్లోనే 368 కి.మీ బీటీ రోడ్ల విస్తరణ, 19 వంతెనల నిర్మాణాలు
– ముందెన్నడూ లేనిరీతిలో స్వాతంత్య్ర సంబరాలకు పంచాయతీల వ్యయపరిమితి పెంపు
– ఒకేరోజు 13,326 గ్రామసభలతో ప్రపంచ రికార్డు
– విజయవంతమైన ప్లాంటేషన్‌ డ్రైవ్‌… 2,383 హెక్టార్లలో మొక్కలు
– కేంద్రం నుంచి ఏపీకి 11 కొత్త నగర వనాలు మంజూరు
– పవన్‌ నూరురోజుల నిజాయితీ పాలనకు ఇవే సాక్ష్యాలు ..
– సక్సెస్‌ఫుల్‌ వ్యూహాల్లో కల్యాణ్‌ ఒకే ఒక్కడంటున్న జాతీయమీడియా

అమరావతి, మహానాడు: పవర్‌స్టార్‌గా ప్రజల్లో ప్రత్యేకస్థానం సంపాదించుకున్న జనసేన అధినేత, పిఠాపురం నియోజకవర్గ శాసన సభ్యుడు కొణిదెల పవన్‌ కల్యాణ్‌ ఇప్పుడు పవర్‌ఫుల్‌ డిప్యూటీ సీఎంగా అందర్నీ ఆకర్షిస్తున్నారు. ప్రతీ ప్రభుత్వ కార్యాలయంలోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫొటో పక్కనే డిప్యూటీ సీఎంగా చిత్రపటం కనిపించడం జాతీయ మీడియాలోనూ ఇప్పుడు పవన్‌ పేరు మార్మోగుతోంది. ప్రస్తుతం దేశంలోనే ఇంత పవర్‌ఫుల్‌ డిప్యూటీ సీఎం వేరేవ్వరూ లేరు. రాజకీయాలకే పనికిరారన్న వ్యక్తి.. రాష్ట్ర రాజకీయాలన్నింటినీ మెలిపెట్టి మలుపు తిప్పేశారు.

రాజకీయాలంటే సినిమాలు కాదని ఎగతాళి చేసిన వారికి ముచ్చెమటలు పెట్టించి మూలన కూర్చునేలా చేశారు. జాతీయ రాజకీయాల్లోనూ ప్రాధాన్యత కలిగిన నాయకునిగా పవన్‌ కల్యాణ్‌ ఎదిగారు. డబుల్‌ ఇంజిన్‌ సర్కారంటే ఏమిటో అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఆయన ప్రత్యక్షంగా చూపిస్తున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవశాలిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా.. ప్రజాబలం కలిగిన నాయకుడిగా పవన్‌ రెండో ఇంజన్‌గా ఏపీ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు. డిప్యూటీ సీఎం పదవితో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ వంటి నాలుగు కీలక శాఖలు స్వీకరించిన పవన్‌ కల్యాణ్‌.. మంత్రిగా బాధ్యతలు చేపట్టి నేటితో 100 రోజులు పూర్తయ్యాయి.

మాటల్లో.. చేతల్లో ప్రజాకర్షణగా పవన్‌ స్టైల్ః

రాజకీయ దిగ్గజం.. పరిపాలన అనుభవం ఉన్న నారా చంద్రబాబు వద్ద నేర్చుకోవాలనే తపన నాకుంది. అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని గట్టెక్కించగల సత్తా ఒక్క చంద్రబాబుకే ఉంది. వారి స్ఫూర్తిగా నేను గ్రామీణాభివృద్ధికి కృషి చేసి రాష్ట్రాన్ని అన్ని విధాలుగా మార్పులు చేయడమే నా లక్ష్యం.. అని మైసూరావారిపల్లె గ్రామ సభలో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు. అన్నం పెట్టే రైతు బాగుంటే అన్నీ బాగుంటాయని, గ్రామాలు పచ్చగా ఉంటే మనమంతా హాయిగా ఉంటామని వారి నోట విన్నాం. బూతులు తిట్టే ప్రభుత్వం కాకుండా గోతులు పూడ్చే ప్రభుత్వం ప్రజలు ఎన్నుకున్నారని .. ఆ దిశగా పరిపాలనాపరంగా రాష్ట్రంలో సమూల మార్పు కోసం గడచిన వందరోజుల పాలనాకాలంలో పవన్‌ కల్యాణ్‌ పనిచేసి మాటలు, చేతల్లోనూ నిరూపించుకున్నారు.

ధ్వంసమైన వ్యవస్థల్ని బతికిస్తూ.

గత వైసీపీ ప్రభుత్వం వ్యవస్థలన్నింటినీ పూర్తిస్థాయిలో ధ్వంసం చేసింది. అలాంటి వ్యవస్థలన్నింటినీ మళ్ళీ బతికించి బలోపేతం చేసేందుకు పవన్‌ కల్యాణ్‌ పూనుకున్నారు. తనకు అప్పగించిన శాఖల ద్వారా గ్రామాల స్థాయి నుంచే మార్పులు జరగాలని ఆయన ఆశిస్తూ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన శాఖలపరంగా సమీక్షల్లోనూ ఐఏఎస్, ఐపీఎస్‌లతో కొన్ని అంశాలపై లోతుగా విశ్లేషిస్తున్నారు. 2047 కల్లా భారతదేశం సూపర్‌ పవర్‌ అవ్వాలంటే వికసిత్‌ ఆంధ్రప్రదేశ్‌ను మనం తీర్చిదిద్దుకోవాలని కలెక్టర్లకు పవన్‌ కల్యాణ్‌ పదేపదే చెబుతున్నారు.

చరిత్ర సృష్టించిన గ్రామసభలు

దేశంలో ముందెన్నడూ ఎరుగని విధంగా రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజు ఒకేసారి 13,326 గ్రామ సభలు నిర్వహించి రూ.4,500 కోట్ల జాతీయ ఉపాధి హామీ పనులకు తీర్మానాలు చేయించి చరిత్ర సృష్టించారు. ఇందుకు వరల్డ్‌ రికార్డ్సు యూనియన్‌ వారు స్వయంగా ఇక్కడకొచ్చి డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కి సర్టిఫికేట్, అవార్డును అందించడం గర్వించదగ్గ విషయం. 10 వేల గ్రామ పంచాయతీల్లో ప్రారంభించిన ఘన వ్యర్థాల నిర్వహణ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. స్వచ్ఛభారత్‌ మిషన్, ఇతర పథకాల కింద నిర్మించిన వ్యక్తిగత మరుగుదొడ్లను ఓడిఎఫ్‌ ప్లస్‌ కింద నిర్వహిస్తున్నారు.

పల్స్‌ సర్వే ద్వారా ఇంటింటి కుళాయి నీరు

రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో ఇంటింటికీ కుళాయిల ద్వారా స్వచ్ఛమైన మంచినీటిని పంపిణీ చేసే లక్ష్యంగా పల్స్‌సర్వే నిర్వహించారు. అన్నిచోట్లా కలిపి మొత్తం 82.51 లక్షల కుటుంబాల సర్వే నేపథ్యంలో కుళాయి కనెక్షన్‌ ఉన్న కుటుంబాలు 49.17 లక్షలు అని తేలగా.. లబ్ధిదారులు ఉనికిలో లేని(అనధికార) కనెక్షన్‌లు కూడా ఉన్నట్టు గుర్తించారు. ఈ సర్వే ద్వారా మొత్తం 24.72 లక్షల కుటుంబాలకు వారి ఇళ్లకే కుళాయిల ఏర్పాటు ద్వారా స్వచ్ఛమైన మంచినీటిని అందించే పనులు చేపట్టి పూర్తిచేశారు.

మంచినీటి పథకాల నిర్మాణాలు

భారీవర్షాల నేపథ్యంలో 13 జిల్లాల్లో పలుచోట్ల మంచి నీటి పథకాలు తీవ్రంగా దెబ్బతిన్నట్టు గుర్తించారు. 835 ఆవాసాలకు ఉపయోగపడే 790 గ్రామ నీటిపథకాలు, 193 భారీ నీటి పథకాలను పునరుద్ధరణ జరిగింది. రూ.54.48 లక్షల వ్యయంతో 6 జిల్లాల్లో (కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, గుంటూరు, ఏలూరు) వరద బాధితులకు 30.39 లక్షల మంచి నీటి బాటిళ్లు అందించారు. ఆయా జిల్లాల్లో వరద బాధితులను ఆదుకునేందుకు వాటర్‌ ట్యాంకర్లను ఏర్పాటు చేయడమే కాకుండా రూ.16.28 కోట్లతో తాత్కాలిక పునరుద్ధరణ పనులు, రూ. 527.23 కోట్లతో శాశ్వత నీటి ఎద్దడి నివారణ పనులు చేపట్టాలని అంచనాలు రూపొందించి నిధులు మంజూరు చేశారు.

530 కార్మికులకు పెండింగ్‌ జీతాలిప్పించిన పవన్

అనంతపురం జిల్లాలో శ్రీ సత్యసాయి వాటర్‌ సప్లై ప్రాజెక్టు కింద పనిచేసే 536 మందికి గత ప్రభుత్వం జీతాలు విడుదల చేయకుండా పెండింగ్‌ పెట్టింది. ఈ నేపథ్యంలో వారంతా నేరుగా డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ను కలిసి తమకు 8 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని.. మంచి నీటి పంపిణీ కష్టంగా ఉందని మొరపెట్టుకున్నారు. వారి ఫిర్యాదులపై అప్పటికప్పుడు స్పందించిన ఆయన ప్రభుత్వ అధికారులతో మాట్లాడారు. కార్మికులకు అందాల్సిన రూ.30 కోట్ల జీతాలను అప్పటికప్పుడు విడుదల చేయించారు.

శరవేగంగా రోడ్లు, వంతెనల నిర్మాణాలు

గ్రామాల అభివృద్ధి ప్రధానంగా రోడ్ల విస్తరణతోనే కనిపిస్తోందని.. గత ప్రభుత్వం మాదిరిగా ఏమాత్రం పట్టించుకోకుండా గుంతల రోడ్లు కనిపించరాదని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ చాలా సందర్భాల్లో అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి గ్రామ సడక్‌ యోజన ద్వారా ఏపీ రూరల్, నాబార్డు సాయంతో 157 చోట్ల పనులు పూర్తి చేసి 368.05 కిలోమీటర్ల మేర బీటీ రోడ్లను వేయించారు. అదేవిధంగా పీఎంజీఎస్‌వై పథకం కింద 6 రోడ్లు, 12 వంతెనల పనులు సైతం ప్రస్తుతం కొనసాగుతూ ఉన్నాయి.

పెరిగిన పంచాయతీ సర్పంచుల ఆత్మగౌరవం

డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ చేతికి గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖలు రావడంతో పంచాయతీల సర్పంచులకు ఎక్కడాలేని ధైర్యం వచ్చింది. గత ప్రభుత్వంలో సర్పంచులకు ఏమాత్రం విలువనివ్వకపోవడం .. తాము కేవలం ఉత్సవ విగ్రహాలుగానే మిగిలిపోయామని వాపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అలాంటిది, పవన్‌ కల్యాణ్‌ మంత్రి కాగానే పంచాయతీ సర్పంచుల అధికారాలకు పూర్వం వైభవం కలిగించారు. 15వ ఆర్థిక సంఘం గ్రాంట్లు విడుదల చేయడంతో పాటు స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవ సంబరాలను ప్రతీ పంచాయతీలో జరుపుకొనేందుకు మునుపటి వ్యయపరిమితిని అనూహ్యంగా పెంచుతూ సంచలనాత్మక నిర్ణయానికి పవన్‌ కల్యాణ్‌ శ్రీకారం చుట్టారు.

42 లక్షల కుటుంబాలకు చేతినిండా ఉపాధి పనులు

గత ప్రభుత్వం ఉపాధి హామీ పథకం నిధులను సైతం దారిమళ్లించిన వైనం తెలిసిందే. అదే కూటమి ప్రభుత్వం వచ్చాక గ్రామాల్లో కూలీజనాలకు చేతినిండా పని దొరుకుతోంది. పవన్‌ కల్యాణ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా సుమారు 42.01 లక్షల కుటుంబాలకు చెందిన 66.20 లక్షల మంది వేతనార్థులకు రూ.17.26 కోట్ల రోజుల వేతన ఉపాధిని అందించారు. 70,046 మంది వికలాంగులకు , 1,04,352 కుటుంబాలకు 100 రోజుల వేతన ఉపాధిని కల్పించారు.

అటవీశాఖ ద్వారా హడలెత్తించిన నిర్ణయాలు

అటవీ శాఖ ద్వారా వన్యప్రాణుల సంరక్షణతో పాటు సామాజికవన సంరక్షణ బాధ్యతలను డిప్యూటీ సీఎం సమర్ధంగా నిర్వహిస్తున్నారు. అంతరాష్ట్రాల సహకారంతో కర్ణాటక, ఆంధ్రా సరిహద్దు సమస్యల వివాదాలను ఆయన పరిష్కరించారు. కుమ్మీ ఎనుగుల తరలింపు, పట్టుకోవడం, గ్రామాల్లో చొరబడినప్పుడు వాటిని కట్టడి చేయడం వంటి వ్యవహారాల్లో రెండు రాష్ట్రాల సమన్వయంతో శిక్షణ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఎకో టూరిజం, ఐటీ జ్ఞానబదిలీల్లో పక్క రాష్ట్రాల సహకారం అవసరమని సమన్వయ సమావేశాలు తరచూ జరపాలన్నారు. ముఖ్యంగా ఎర్రచందనం, ఇతర అటవీ సంపదను అక్రమంగా నరికివేసి తరలింపు చేసే మాఫియాకు అడ్డుకట్ట వేసేందుకు పటిష్టప్రణాళిక రూపొందించారు.

గడచిన 100 రోజుల కాలంలో 87 ఎర్రచందనం కేసులు నమోదయ్యాయి. ఫలితంగా 30 మెట్రిక్‌ టన్నుల ఎర్రచందనం, 65 వాహనాలను స్వాధీనం చేసుకుని 187 మందిని అరెస్టు చేశారు. గతంలో మాదిరిగా విచ్చలవిడి ఎర్రచందనం చెట్ల నరికివేత పూర్తిగా కట్టడిలోకి వచ్చింది. మిస్టీ ప్రాజెక్టు ద్వారా మడ అడవుల విస్తీర్ణం పెంపునకు ప్రణాళికను తయారుచేసి పనులు ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఏపీకి 11 కొత్త నగర వనాలు మంజూరు అయ్యాయి. దాదాపు రూ. 22 కోట్ల ఆర్థిక వ్యయంతో చేపట్టే నగర వనాల కార్యక్రమం పట్టణ హరిత ప్రదేశాల అభివృద్ధికి తోడ్పడనుంది.

ప్రజాసేవలో ఆయనొక కూలి…

సమాజానికి మంచి చేయాలనే తపన. ప్రజలకు మేలు కలగాలనే ఆలోచన డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ది. అధికారం చేతుల్లోకి వచ్చిందని ఏమాత్రం విర్రవీగని వైనంతో.. గతంలో మాదిరిగా ఆవేశాన్ని కూడా పూర్తిగా తగ్గించి సంయమన వైఖరితో పరిపాలనను నెట్టుకొస్తున్నారు. గత ప్రభుత్వాల తప్పిదాలపై.. ప్రస్తుత కూటమి ప్రభుత్వ విధానాల కొనసాగింపు తదితర అంశాల్లో పవన్‌ కల్యాణ్‌ వ్యవహరిస్తోన్న తీరు ప్రజలను విపరీతంగా ఆకర్షిస్తోంది. తానొక సామాన్యుడి మాదిరిగానే ఇటీవల వరద బాధితులను ఆదుకునేందుకు ఒకేసారి రూ.6 కోట్ల విరాళం అందివ్వడం.. యువత, గ్రామీణ జనంకు అందుబాటులో ఉపాధి దక్కాలంటే నైపుణ్య సర్వే చేయాలని సూచించడం వంటి ఆలోచనలు మేధావుల్ని సైతం ఆశ్చర్యపరుస్తున్నాయి. మొత్తానికి ప్రజాసేవలో నేనొక కూలీని మాత్రమే అని అంటున్న పవన్‌ కల్యాణ్‌ దేశం గర్వించదగ్గ నేతగా విశ్లేషకుల అభిప్రాయం.