వైద్యురాలి హత్యోదంతంపై వెల్లువెత్తిన నిరసన

విశాఖపట్నం, మహానాడు: కోల్ కత్తాలోని జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం ఘటన పట్ల నిరసన వ్యక్తం చేస్తూ 95 వార్డు పరిధి పురుషోత్తపురంలోని హెచ్ బి కాలనీ కంఫర్ట్ హోమ్స్ నివాసితులు సోమవారం సంఘీభావంగా ఉద్యమించారు. మహిళ వైద్యులకు కల్పించాల్సిన రక్షణ చర్యలపై దృష్టి పెట్టాలని… ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని నివాసితులు సంక్షేమ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు వి.రామకృష్ణ, ఎం.సత్యనారాయణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సెంట్రల్ పార్క్ లో కొవ్వొత్తులతో నివాళులర్పించి అనంతరం రహదారి మీదుగా ర్యాలీ సాగించారు. ఈసీ సభ్యులు ఎమ్మెస్ శ్రీనివాస్, ఎల్.సూర్య భాస్కర్ ప్రభృతులు వెంట రాగా అసంఖ్యాకంగా చిన్నారులు, మహిళలు, కాలనీ పెద్దలు పాల్గొని అత్యాచారాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ప్లకార్డులు, నినాదాలతో హోరెత్తించారు.