రూ.850 కోట్ల విలువైన రేడియోధార్మిక పదార్ధం స్వాధీనం

– నలుగురు నిందితుల అరెస్ట్‌

బీహార్ : బీహార్‌ పోలీసులు నలుగురు సభ్యుల స్మగ్లింగ్ ముఠా గుట్టును రట్టు చేశారు. నిందితుల నుంచి 50 గ్రాముల రేడియోధార్మిక పదార్ధం ‘కాలిఫోర్నియం’ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేశారు. ఈ పదార్థం ధర గ్రాముకు రూ.17 కోట్లుగా అంచనా ఏశారు. అంటే రూ.850 కోట్ల సరుకు ఇది. అణువిద్యుత్ ప్లాంట్ల నుంచి క్యాన్సర్ చికిత్స వరకు అన్నింటిలోనూ దీన్ని వినియోగిస్తారు. గోపాల్గంజ్ ఎస్పీ స్వర్ణా ప్రభాత్ ఈ మెటల్ రికవరీని ధ్రువీకరించారు.

నిందితులు మోటారు సైకిల్ పై ప్రయాణిస్తుండగా వారి వద్ద నాలుగు మొబైల్ ఫోన్లు, 50 గ్రాముల కాలిఫోర్నియా ఉన్నట్టు గుర్తించి, పట్టుకున్నామని తెలిపారు. స్మగ్లర్లు ఈ విలువైన పదార్థాన్ని విక్రయించడానికి చాలా నెలలుగా ప్రయత్నిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లోని ఖుషినగర్ జిల్లాలోని తమ్కుహి రాజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పర్సౌని బుజుర్గ్ గ్రామానికి చెందిన ఛోటే లాల్ ప్రసాద్ (40), కౌశల్య చౌక్లో నివాసం ఉంటున్న చందన్ గుప్తా (40), గోపాల్ గంజ్ లోని నగర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో నివాసం ఉంటున్న చందన్ రామ్, గోపాలంజుకు చెందిన కుషహర్ మథియాను అరెస్టు చేశారు.