‘రామచంద్రుడి’కే కమల కిరీటం?

  • తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రామచందర్‌రావు?
  • ఆరెస్సెస్ ఓటు ఆయనకే
  • పార్టీకి సంఘవాసనలు కోసమేనా?
  • మళ్లీ సంఘ మూలాలకు బీజేపీ
  • అధ్యక్ష రేసులో ఈటల రాజేందర్, అర్వింద్, రఘునందన్
  • సంఘ్ మూలాలు ఉన్న వారివైపే ఆరెస్సెస్ చూపు
  • ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి నో చాన్స్?
  • అయినా ఈటల ఆశలు సజీవం
  • బీసీ కార్డుతో ఢిల్లీలో జోరుగా యత్నాలు

( మార్తి సుబ్రహ్మణ్యం)

తెలంగాణ బీజేపీ దళపతిగా ప్రముఖ న్యాయవాది, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచందర్‌రావు ఖరారయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి గంగాపురం కిషన్‌రెడ్డి తెలంగాణలో పార్టీకి ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నారు. పైగా ఆయన జమ్ము రాష్ట్ర ఇన్చార్జిమంత్రిగా వ్యవహరిస్తుండటంతో, రాష్ట్ర పార్టీపై ఎక్కువ దృష్టి సారించలేకపోతున్నారు. త్వరలో అక్కడ ఎన్నికలు జరుగుతుండటంతో, ఇక జమ్ములోనే పూర్తిస్థాయి దృష్టి సారించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కొత్త అధ్యక్షుడిని నియమించేందుకు జాతీయ పార్టీ నాయకత్వం కసరత్తు ప్రారంభించింది.

అయితే ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ దేశవ్యాప్తంగా ఆశించినన్ని స్థానాలు గెలవకపోవడంపై, బీజేపీ మార్గదర్శి ఆరెస్సెస్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వెలువడ్డాయి. బీజేపీ ఫక్తు రాజకీయపార్టీగా రూపాంతరం చెందుతున్న క్రమంలో.. సంఘ సిద్ధాంతాలకు ప్రాధాన్యం త గ్గిపోయిందని, వ్యక్తుల ప్రాబల్యం పెరిగి-సంఘ నిర్మాణం బలహీనమవుతుందని భావించిన సంఘ్ నాయకత్వం.. ఇకపై పార్టీని మళ్లీ మూలాలకు తీసుకువెళ్లాలని నిర్ణయించింది. వ్యక్తుల ప్రధాన్యం తగ్గించి-ఆర్గనైజేషన్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించిందట. ఆమేరకు ఇటీవల చత్తీస్‌గఢ్‌లో జరిగిన కీలక సమావేశంలో ఆ మేరకు తీర్మానించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

అందులో భాగంగా ఇకపై రాష్ట్రాలకు పార్టీ అధ్యక్షులను సంఘ్ మూలాలు ఉన్న వారినే నియమించాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని, జిల్లా పార్టీ అధ్యక్షులకే పరిమితం చేయాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. అయితే పార్టీలహీనంగా ఉండే ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలకు, అనివార్యంగా ఈ సూత్రం మినహాయింపు ఇచ్చినప్పటికీ, మిగిలిన రాష్ట్రాలకు మాత్రం సంఘమూలాలు ఉన్న వారికే రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాల సమాచారం.

ఎందుకంటే ఏపీలో సంఘ్ మూలాలున్న నేతలు కొందరు ఉన్నప్పటికీ, వారికి పెద్దగా బలం లేదు. ఎవరూ రాష్ట్ర అధ్యక్ష స్థాయి ఉన్న నేతలు కాదు. కాబట్టి పార్టీ విస్తరించాలంటే, అనివార్యంగా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పగ్గాలివ్వక తప్పని పరిస్థితి. మొదటినుంచీ బీజేపీలో ఉన్న సోమువీర్రాజుకు అధ్యక్ష పదవి ఇచ్చినప్పటికీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక జడ్పీటీసీని కూడా పార్టీ గెలవలేకపోయింది. దానితో ఆ ప్రయోగం విఫలమయినట్లు తేలిపోయింది.

ఆ ప్రకారంగా.. తెలంగాణలో కూడా అదే సూత్రం ప్రకారం, సంఘ మూలాలున్న నేతకే రాష్ట్ర అధ్యక్ష బాధ్యత కట్టబెట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ లెక్కన ప్రస్తుతం తెలంగాణ బీజేపీ అధ్యక్ష రేసులో ఉన్న ఎంపీలు ఈటల రాజేందర్, ధర్మపురి
అర్వింద్, రఘునందన్‌రావు ఎవరూ స్వతహాగా బీజేపీకి చెందిన వారు కాదు. వీరెవరికీ సంఘ మూలాలు లేవు. సంఘ్‌తో ఎలాంటి అనుబంధం లేదు. రాజకీయంగా మాత్రమే వీరికి బీజేపీలో గుర్తింపు లభించింది.

ఈ క్రమంలో సీనియర్ నేత, సంఘ్ మూలాలు ఉన్న రామచందర్‌రావుకే , అధ్యక్ష పదవికి ఎక్కువ అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆయన ఏబీవీపీ నుంచి చురుకుగా పనిచేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో విద్యార్ధి ఉద్యమాల్లో క్రియాశీల పాత్ర పోషించిన రామచందర్‌రావు, అనేకసార్లు పోలీసులతో ఘర్షణ పడి తీవ్రగాయాలపాలైన సందర్భాలున్నాయి. ఆతర్వాత బీజేపీలో కీలకనేతగా ఎదిగారు. ఎన్డీయే-1లో ఆయన రాష్ట్ర లీగల్ సెల్ కన్వీనర్‌గా ప్రముఖపాత్ర పోషించారు. ఉమ్మడి రాష్ట్రంలో సంచలన కేసులను వాదించిన రామచందర్‌రావు, విభజిత తెలంగాణ రాష్ట్రంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించారు.

తాజాగా అధ్యక్ష ఎంపిక కసరత్తు నేపథ్యంలో ఆరెస్సెస్ పెద్దలు, రామచందర్‌రావు వైపే మొగ్గుచూపుత్నునట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సంఘ సిద్ధాంతాలు తెలిసిన రామచందర్ రావుకు, వ్యూహకర్త- వివాదరహితుడన్న పేరు ఉంది. ప్రస్తుత సమాచారం ప్రకారం.. బీజేపీ అధ్యక్ష పదవి ఆయనకే దక్కవచ్చంటున్నారు.

అయితే మల్కాజిగిరి ఎంపి ఈటల రాజేందర్ కూడా, అధ్యక్ష పదవి కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. మిగిలిన ఇద్దరు ఎంపీలు మధ్యలో ఆశలు వదులుకున్నప్పటికీ, ఈటల మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీసీ కార్డు ఆయనకు అక్కరకువస్తుందని, తెలంగాణలో అతిపెద్ద బీసీ సామాజికవర్గమైన ముదిరాజ్ వర్గానికి చెందిన ఈటలకు అధ్యక్ష పదవి ఇస్తే, ఆ సామాజికవర్గం గంపగుత్తగా బీజేపీ వైపు మొగ్గుచూపుతారన్న వాదన వినిపిస్తోంది.

ఈ విషయంలో అంతిమనిర్ణయం ఆరెస్సెస్‌దే కాబట్టి, ఈటల ఆశలు నెరవేరతాయో లేదో చూడాలి. కాగా తెలంగాణ అధ్యక్ష పదవిని ఇప్పుడే భర్తీ చేస్తారా? లేక డిసెంబర్ వరకూ వేచిచూస్తారా అన్నదానిపై స్పష్టత కనిపించడం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.