Mahanaadu-Logo-PNG-Large

రోజుకో అత్యాచారం.. ఇదేనా మార్పు?

– మంత్రి సీతక్కను నిలదీసిన మహిళా నేతలు

హైదరాబాద్‌, మహానాడు: మహిళా భద్రతకు అభయమివ్వని ‘హస్తా’నికి అధికారమెందుకని, రోజుకో అత్యాచారం, గంటకో అఘాయిత్యం.. ఇదేనా మార్పు? అని మంత్రి సీతక్క ను అడ్డగించి, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి, ఇతర మహిళలు నిలదీశారు.

తెలంగాణ రాష్ట్రంలో ఆసిఫాబాద్ జిల్లాకి సంబంధించిన ఆదివాసీ ఆడబిడ్డపై గత నెల 31 న జరిగిన అత్యాచారం, హత్యయత్నం జరిగిందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. గాంధీ ఆస్పత్రిలో ఉన్న బాధిత మహిళను పరామర్శించడానికి శిల్పారెడ్డితోపాటు పలువురు మహిళలు గురువారం వెళ్ళి, బాధిత కుటుంబంతో మాట్లాడి, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

మహిళపై జరిగింది హత్యాచారమే అని కుటుంబ సభ్యులు మీడియా సాక్షిగా చెప్పినా మంత్రి సీతక్క ఈ కేసుని పక్కతోవ పట్టించే తీరును నిరసిస్తూ మహిళకి న్యాయం జరగాలని వారు గాంధీ ఆస్పత్రి ముందు బైటాయించారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన మంత్రి సీతక్కని వారంతా నిలదీశారు. ఈ కేసును కమ్యూనల్ ఇష్యూ గా చిత్రికరించవద్దని సూటిగా మంత్రిని శిల్పారెడ్డి హెచ్చరించారు. వెంటనే నిందితుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, అత్యాచార, హత్యయత్నం కేసులు పెట్టాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో రాష్ట్ర మహిళా మోర్చా తరుపున తీవ్ర ఆందోళన చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.