– మంత్రి లోకేష్
అమరావతి, మహానాడు: విలువలు, మానవత్వంతో కూడిన వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన మహా దార్శనికుడు రతన్ టాటా. దేశాభివృద్ధి, ప్రజా శ్రేయస్సు, ఉద్యోగుల సంక్షేమమే పరమావధిగా టాటా గ్రూప్ సంస్థలను దశాబ్దాలుగా అదే నిబద్ధతతో నిర్వహించిన పద్మవిభూషణ్ రతన్ టాటా సేవలు చిరస్మరణీయమని విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. టాటా గ్రూప్ ఉత్పాదనలు వాడని భారతీయులు ఉండరు. దేశంలో ఏ మూల ఏ విపత్తు సంభవించినా భారీ విరాళంతో స్పందించే మానవత్వపు హృదయం రతన్ టాటా జీ. నిజాయితీని, నిస్వార్ధపరత్వాన్ని టాటా బ్రాండ్‌గా చేసిన రతన్ టాటాకి మరణం లేదు. ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా జీవించే ఉంటారు. నమ్మకమైన టాటా ఉత్పత్తుల రూపంలో ప్రతి ఇంట్లోనూ మనందరినీ ప్రతిరోజూ చిరునవ్వుతో పలకరిస్తూనే ఉంటారు. రతన్ టాటా నిరుపమానమైన సేవలను స్మరిస్తూ, అశ్రు నివాళులు అర్పిస్తున్నానని మంత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
రతన్ టాటా మృతి దేశానికి తీరని లోటు: మంత్రి నారాయణ
పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా మృతి దేశానికి తీరని లోటని మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. కేవలం పారిశ్రామికవేత్త గా మాత్రమే కాకుండా ఉన్నతమైన విలువలు కలిగిన అదర్సవాది రతన్ టాటా. రతన్ టాటా జీవితం అందరికీ ఆదర్శం.
విద్య, వైద్యం వంటి రంగాల్లో రతన్ టాటా సేవలు అద్వితీయం. కేవలం మన దేశంలోనే కాకుండా 100 కు పైగా దేశాల్లో అనేక పరిశ్రమలు స్థాపించి అనేకమందికి ఉపాధి చూపించారు. రతన్ టాటా ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.