రెడ్‌ బుక్‌ కేసులు నిలబడవు

-రెడ్‌ బుక్‌ కేసులన్నీ అధికార అహంభావాన్ని తీర్చుకునేందుకే
-తల్లికి మాత్రమే వందనం.. పిల్లలకు ఎగనామం
-నాడు సినిమా టికెట్ల విషయంలో జగన్‌ని తప్పు బట్టారు
-ఇప్పుడు అదే జీఓను అనుసరిస్తున్నారు.. ఏమిటి మీ వైఖరి?
-వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి పేర్ని నాని

తాడేపల్లి: 2021లో రఘురామకృష్ణరాజును అరెస్టు చేసినప్పుడు హత్య చేయబోయారని, ఆ కుట్రలో జగన్‌మోహన్‌రెడ్డి మూడో ముద్దాయి అని ఇప్పుడు కేసు పెట్టారని మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. అప్పుడు రఘురామకృష్ణరాజు ఒకరోజు మాత్రమే జైల్లో ఉన్నారని.. ఆ తర్వాత బెయిల్‌ మీద బయటకొచ్చారని గుర్తు చేశారు.

ఆ సమయంలో తనను పోలీసులు కొట్టారంటూ రఘురామ కోర్టుకు తెలిపారని, దీనిపై హైకోర్టు సూచనల మేరకు గుంటూరు జీజీహెచ్‌ వైద్యుల బృందం పరీక్షించి దెబ్బలేమీ కొట్టలేదని రిపోర్టు ఇచ్చిందని తెలిపారు.
జైలు నుంచి విడుదలైన తర్వాత రఘురామ సికింద్రాబాద్‌ మిలటరీ ఆస్పత్రిలో చేరారని, వాళ్లు కూడా దెబ్బలేమీ లేవని రిపోర్టు ఇచ్చారన్నారు. దీనిపై సీబీఐ విచారణ చేయాలని కోరితే సుప్రీంకోర్టు నిరాకరించిందన్నారు.

మరి రఘురామకు దెబ్బలు లేవని చెప్పినా.. మూడేళ్ల తరవాత ఇప్పుడు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడం ఏమిటన్న పేర్ని నాని, ఇది తప్పుడు కేసు కాదా? అని ప్రశ్నించారు. అందుకే ఇది రెడ్‌ బుక్‌ కేసు అని అర్థం అవుతోందన్న ఆయన, అధికార అహంభావాన్ని తీర్చుకునేందుకే ఇలాంటి రెడ్‌ బుక్‌ కేసులు పెడుతున్నారని, అయితే అవేవీ నిలబడబోవని తేల్చి చెప్పారు.

రాష్ట్ర అప్పులు రూ.4 లక్షల కోట్ల వరకు ఉన్నాయని, కేంద్రం స్పష్టం చేసినా, ఇక్కడ బీజేపీ అధ్యక్షురాలు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా, రాష్ట్ర అప్పులు రూ.15 లక్షల కోట్లు అని చెప్పడం విడ్డూరంగా ఉందని చెప్పారు. ముంపు గ్రామాల ప్రజలను ఖాళీ చేయించకుండా, వారికి పునరావాసం కల్పించకుండా కాఫర్‌ డ్యామ్‌ ఎలా నిర్మించారని సూటిగా ప్రశ్నించారు.

డైవర్షన్‌ ఛానల్‌ ఇవ్వలేదని, స్పిల్‌ వే పూర్తి కాకుండానే, అప్పర్‌ కాఫర్‌ డ్యామ్, డయాఫ్రం వాల్, లోయర్‌ కాఫర్‌ డ్యామ్‌ పనులన్నీ మొదలు పెట్టారన్నారు. దీంతో పనులన్నీ అస్తవ్యస్తమయ్యాయని, ఫలితంగా భారీ వరదలకు డయాఫ్రం వాల్‌ కొట్టుకుపోయిందని చెప్పారు. కొత్తగా డయాఫ్రమ్‌ వాల్‌కు దాదాపు రూ.1200 కోట్లు ఖర్చవుతందని అంచనా కాగా.. ఆ నిధులు కేంద్రం నుంచి రావాల్సి ఉందని తెలిపారు. ఇలా మొత్తంగా పోలవరం ప్రాజెక్టు పనుల నాశనానికి చంద్రబాబే పూర్తి బాధ్యుడని తేల్చి చెప్పారు.

మరోవైపు పోలవరం ప్రాజెక్టు పనుల్లో తాము 72 శాతం పనులు పూర్తి చేశామని చంద్రబాబు చెప్పుకుంటున్నారన్న పేర్ని నాని.. అదే నిజమైతే.. మిగిలిన 28 శాతం పనులు ఎప్పుడు పూర్తి చేస్తారనేది ఆయన ఎందుకు చెప్పలేకపోతున్నారని నిలదీశారు. నిజానికి పోలవరం ప్రాజెక్టులో ముఖ్యమైన డ్యామ్, స్పిల్‌ వే, నీటి డైవర్షన్, కాఫర్‌ డ్యామ్‌ పనులు తామే పూర్తి చేశామని పేర్ని నాని వెల్లడించారు.

తల్లికి వందనం పథకానికి సంబంధించి జారీ చేసిన జీఓ:29లో ప్రభుత్వం ఒక కొత్త విషయాన్ని స్పష్టం చేసిందని పేర్ని నాని గుర్తు చేశారు. కుటుంబంలో ఎందరు పిల్లలున్నా, ప్రతి ఒక్కరికీ రూ.15 వేల చొప్పున ఇస్తామని, ఎన్నికల ముందు చెప్పిన చంద్రబాబు, ఇప్పుడు, కుటుంబంలో తల్లికి మాత్రమే రూ.15 వేలు ఇస్తామంటూ, ఆ జీఓలో స్పష్టం చేశారని తెలిపారు. అంటే, చంద్రబాబు హయాంలో.. ‘తల్లికి మాత్రమే వందనం.. పిల్లలందరికీ పంగనామం’ అని నాని వ్యాఖ్యానించారు.

తాము ఇసుక ఉచితంగా సరఫరా చేస్తున్నామంటూ.. ప్రభుత్వం అట్టహాసంగా కార్యక్రమం మొదలు పెట్టిందన్న పేర్ని నాని, పేరుకే అది ఉచితం అని.. వాస్తవానికి అది బాదుడే బాదుడని ఆయన వెల్లడించారు. ఉచిత ఇసుక అంటే.. నదికి వెళ్లి ఎవరు కావాలంటే వాళ్లు ఉచితంగా తీసుకెళ్లాలని అర్థం అన్నారు.

కానీ, సీనరేజ్, రవాణా ఛార్జీల పేరుతో ఇసుక సరఫరాలో ముక్కు పిండి వసూలు చేస్తున్నారని నాని ఆక్షేపించారు. టన్ను ఇసుక ధర రూ.290 నుంచి రూ.1330 వరకు నిర్ధారించినట్లు, స్వయంగా గనుల శాఖ మంత్రి ప్రకటించారని గుర్తు చేశారు. అందుకే.. ‘నేతి బీరకాయలో నెయ్యి ఉండదు. ఫ్రీ శాండ్‌లో ఉచితం ఉండదు’.. అని నాని వ్యాఖ్యానించారు.

చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకార కుటుంబాలను ఆదుకోవడం కోసం తమ ప్రభుత్వం రూ.10 వేలు ఇస్తే, వారికి తాము ఇప్పుడు రూ.20 వేలు ఇస్తామని ఆర్భాటంగా ప్రకటించిన చంద్రబాబు.. ఇప్పుడు ఆ పథకాం ఊసే ఎత్తడం లేదని పేర్ని నాని గుర్తు చేశారు.

సినిమా టికెట్లకు సంబంధించి నాడు గత ప్రభుత్వం జారీ చేసిన జీఓను తప్పు బట్టిన టీడీపీ నేతలు, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక, అదే జీఓ అమలు చేస్తున్నారని పేర్ని నాని తెలిపారు.

‘సినిమా రేట్లు పెట్టడానికి నువ్వు ఎవరు? సినిమా వాళ్లంతా మీ కాళ్ల వద్దకు రావాలా? జగన్‌.. అని నాడు దుయ్యబట్టారని మాజీ మంత్రి గుర్తు చేశారు. కానీ ఇప్పుడు అదే జీఓ ప్రకారం సినిమా టికెట్ల రేటు పెంచారని చెప్పారు. నాడు జారీ చేసిన జీఓ సరైంది కాదని భావిస్తే, దాన్ని ఎందుకు రద్దు చేయలేదని నిలదీశారు.