స్థానిక సంస్థలకు రూ.1452 కోట్లు విడుదల

– స్థానిక సంస్థల బలోపేతమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
– సీఎం చంద్రబాబు సూచనల మేరకు నిధులు విడుదల
– గత ప్రభుత్వం స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తే.. మేం బలోపేతం చేస్తున్నాం
-ఆర్థిక శాఖామంత్రి పయ్యావుల కేశవ్

అమరావతి, మహానాడు: గ్రామాల అభివృద్ధితోనే దేశ అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి అని మహాత్మ గాంధీ ఆశయాలను పాటించే ప్రభుత్వం మాదని, స్థానిక సంస్థలను ఆర్థికంగా బలోపేతం చేయడం ద్వారా అభివృద్ధికి కూటమి ప్రభుత్వం బాటలు వేస్తోందని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ అన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఇంకా.. ఆయన మాట్లాడుతూ.. 15వ ఆర్థిక సంఘం నిధులను గత ప్రభుత్వం పక్కదారి పట్టించింది. ఇప్పుడున్న ప్రజా కూటమి ప్రభుత్వం ఆ నిధులను విడుదల చేస్తోంది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకే స్థానిక సంస్థలకు మరిన్ని నిధుల విడుదలకు నిర్ణయం తీసుకున్నాం.

గ్రామ పంచాయతీలకు రూ.998 కోట్లు, పట్టణ స్థానిక సంస్థలకు రూ.454 కోట్లు విడుదలకు నిర్ణయం తీసుకున్నాం. ఈ నిధులతో గ్రామ, వార్డు స్థాయిల్లో పనులను వేగవంతం చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఈ నిధుల విడుదలతో స్థానిక సంస్థలకు ఆర్థికంగా వెసులుబాటు కలిగే అవకాశం కలుగుతుంది. గత ప్రభుత్వం స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తే.. ప్రజా కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థల బలోపేతమే లక్ష్యంగా పని చేస్తోంది.