7 నెలలుగా ఆగిపోయిన జీతం విడుదల

* ఉప ముఖ్యమంత్రి దృష్టికి రాగానే సమస్య తక్షణ పరిష్కారం
* రూ.30 కోట్ల బకాయిలు విడుదల
* శ్రీ సత్యసాయి వాటర్ సప్లై స్కీంలో 536 మంది కార్మికుల్లో ఆనందం

అనంతపురం, మహానాడు: ఉమ్మడి అనంతపురం జిల్లాలో శ్రీ సత్యసాయి వాటర్ సప్లై ప్రాజెక్టు బోర్డు ద్వారా గ్రామీణ ప్రాంతాలకు మంచినీరు అందించే పథకం సాగుతోంది. ఇందులో పని చేసే 536 మంది కార్మికులకు ఏడు నెలలుగా జీతాలు అందటం లేదు. 536 మంది కార్మికుల సమస్య రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ దృష్టికి రాగానే పరిష్కారం లభించింది. రెండు రోజులుగా సమ్మె చేస్తున్నారు. ఇందులో పని చేస్తున్న 536 మంది కార్మికుల ఏడు నెలల జీతాలు బకాయిలు చెల్లింపుపై పవన్ కల్యాణ్‌ ఆర్థిక శాఖ అధికారులతో మాట్లాడారు.

బకాయిలకి సంబంధించి రూ.30 కోట్లు బడ్జెట్ రిలీజ్ ఇవ్వాలని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆర్థిక శాఖ కార్యదర్శి బి.ఆర్.ఓ ఇచ్చారు. ఇందుకు అనుగుణంగా పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి జీవో విడుదల చేశారు. రూ.30 కోట్లను వేతనాల కోసం విడుదల చేసేందుకు ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది. కార్మికుల వేతన బకాయిల సమస్యపై సత్వరమే స్పందించిన ఆర్థిక, పంచాయతీరాజ్, ఆర్.డబ్ల్యూ.ఎస్. అధికారులకు ఉప ముఖ్యమంత్రి అభినందనించారు. ప్రభుత్వ విభాగాలు సానుకూల దృక్పథంతో పని చేసేలా దిశానిర్దేశం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలిపారు.