పార్టీ బలోపేతానికి మరింత కష్టపడతా.
కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ
ఢిల్లీ: పార్టీలో కష్టపడి పనిచేసే కార్యకర్తకు అవకాశాలు ఉంటాయని చెప్పేందుకు తానే ఉదాహరణ అని నరసాపురం ఎంపీ, కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ తెలిపారు. కేంద్రమంత్రిగా అవకాశం రావడం సంతోషకరంగా ఉందన్నారు. ఇది ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న బీజేపీ కార్యకర్తలకు దక్కిన గౌరవమని పేర్కొన్నారు. ప్రోత్సహించిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు చెబుతున్నానని, పార్టీ బలోపేతానికి మరింత కష్టపడతానని వ్యాఖ్యానించారు.
పార్టీ కార్యాలయంలో సంబరాలు
మోదీ భారత ప్రధాని ప్రమాణ స్వీకార సమయంలో విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయం దగ్గర బాణసంచా కాలుస్తూ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. కేంద్రమంత్రిగా చోటు దక్కించుకున్న నరసాపురం ఎంపీ శ్రీనివాస్ వర్మకు శుభాకాంక్షలు తెలిపారు.