దాశరథి రంగాచార్యకి రేవంత్ రెడ్డి నివాళి

ఢిల్లీ: సాహితీవేత్త, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు స్వర్గీయ దాశరథి రంగాచార్య జయంతి సందర్భంగా ఆ బహుభాషా కోవిదుడికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళి అర్పించారు. ఢిల్లీలోని అధికారిక నివాసంలో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి ముఖ్యమంత్రి గారు దాశరథి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.

తెలంగాణ సాయుధ పోరాటంలో స్వయంగా పాల్గొనడమే కాకుండా నాటి పరిస్థితులపై అనేక రచనలతో దాశరథి రంగాచార్య తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశారని ముఖ్యమంత్రి గుర్తుచేసుకున్నారు. వేదాలను తెలుగులోకి అనువదించడం వంటి విప్లవాత్మక చర్యలతో దాశరథి రంగాచార్య చరిత్రలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.