Mahanaadu-Logo-PNG-Large

అవినీతిలో ఆరితేరిన రేవంత్‌రెడ్డి

తెలంగాణలో మళ్లీ వసూళ్ల రాజ్యం
హామీలపై కార్యాచరణ లేదు
బీజేపీ నేత ఈటెల రాజేందర్‌ ధ్వజం

మిర్యాలగూడ: రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం కొలువుతీరి దాదాపు ఆరు నెలలు గడుస్తున్నప్పటికీ ఇచ్చిన హామీలకు సంబంధించి ఎటువంటి కార్యాచరణ కూడా లేదని మెదక్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్‌ విమర్శించారు. ఎన్నికల ముందు గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ఓట్లు వేయరేమో అన్న భయంతో దేవుళ్ల మీద ప్రమాణం చేసి రెండు లక్షల రుణమాఫీ చేస్తానని అమలు చేయలేదు. మహిళలకు 2500, కళ్యాణ్‌ లక్ష్మితో పాటు తులం బంగారం, చదువుకునే ఆడపిల్లలకు స్కూటీలు, 4000 పింఛన్‌ ఏది అమలు కాకపోగా చివరికి మళ్లీ కరెంటు కోతల మొదలయ్యాయి. రియల్‌ ఎస్టేట్‌ మొత్తం కుప్పకూలిపోయింది. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి ఒక పర్మిషన్‌ కోసం పెట్టుకుంటే ఒక చదరపు అడు గుకు రూ.50 నుంచి రూ.70 ఇస్తే తప్ప పర్మిషన్‌ రాని దుస్థితి దాపరించిందని ధ్వజమెత్తారు.

లంచగొండి ప్రభుత్వం

మళ్లీ మామూళ్ల రాజ్యం మొదలైంది. డబ్బులు ఇస్తే తప్ప పనులు జరిగే పరిస్థితి లేదని వాపోతున్నారు. అతి తక్కువ కాలంలోనే అతి ఎక్కువ అవినీతికి పాల్పడ్డ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అని స్వయంగా మోదీ మాట్లాడే పరిస్థితి వచ్చింది. హోంమంత్రి కూడా రేవంత్‌ డబుల్‌ ఆర్‌ టాక్స్‌ వసూలు చేస్తున్నారని చెప్పే పరిస్థితి వచ్చింది అంటే ఈ ప్రభుత్వం ఎంత దుర్మార్గమైన ప్రభుత్వం, ఎంత లంచగొండి ప్రభుత్వం, ఎంత వేధింపులకు పాల్పడుతున్న ప్రభుత్వమో ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. నల్లగొండ, వరంగల్‌, ఖమ్మం జిల్లాలకు సంబం ధించిన పట్టభద్రుల ఎన్నిక జరగబోతోందని, ఎవరు మనవాడు, ఎవరు మంది వాడో, ఎవరు ప్రశ్నించగలడో, ఎవరు మన సమస్యలపై మాట్లాడగలరో ఆలో చించి బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌ రెడ్డిని గెలిపించాలని కోరారు.