రేవంత్ రెడ్డిది నోరా మోరా?

వస్తవా? పోదామా… రేవంత్ రెడ్డి?
ప్లేసు, డేటు, టైము నువ్వే చెప్పు
ఏ జిల్లాకు పోదాం, ఏ నియోజకవర్గానికి పోదాం
పరిపాలనలో ఫ్లాప్.
తొండి చేయడంలో తోపు.. బూతులు మాట్లాడంలో టాపు
తప్పు అయ్యింది అని క్షమాపణ అడుగు
దమ్ముంటే రుణమాఫీ మీద శ్వేత పత్రం విడుదల చేయండి.
తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి హరీష్ రావు

హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరు దొంగతనం చేసిన దొంగనే దొంగ దొంగ అని బిగ్గరగా అరిచినట్లు ఉంది. రుణమాఫీ ఎగనామం పెట్టి ఫోజులు కొడుతున్నారు. పాక్షికంగా అమలు చేశారు తప్ప పూర్తిగా చేయలేదు. తప్పు అయ్యింది అని క్షమాపణ అడుగు. రాజీనామా చెయ్యి రేవంత్ రెడ్డి. నోరు పెద్దగా చేసుకొని మాట్లాడితే లాభం ఉండదు.

కాంగ్రెస్ రుణమాఫీ కథ ఎట్లుందంటే.. ఎనకటికి ఎవడో పంచపాండవులు అంటే మంచం కోళ్లవలె.. ముచ్చటగా ముగ్గురు అని చెప్పి రెండు వేళ్లు చూయించాడట. అట్లున్నది కాంగ్రెస్ రుణమాఫీ కథ. అసెంబ్లీ ఎన్నికల సమయంలో డిసెంబర్ 9 సోనియా గాంధీ పుట్టిన రోజు కానుకగా 40వేల కోట్ల రూపాయల రుణ మాఫీ ఏకకాలంలో చేస్తానని ఇదే నోటితో చెప్పిండు. ఏమైంది? డిసెంబర్ 9 మాట తప్పిండు.

ఇగ వట్టిగ డేట్లు చెబితే నమ్మరని పార్లమెంట్ ఎన్నికలు గట్టెక్కించుకోవడానికి, కనిపించిన దేవుడి మీదల్లా ఒట్లు పెట్టి, అదే నోటితో 31వేల కోట్లు ఆగస్టు 15 కల్లా చేస్తానన్నడు. బడ్జెట్ డాక్యుమెంట్ లో 26వేల కోట్లు అని పెట్టిండు. నేను అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రశ్నించిన. మొదట 40వేల కోట్లన్నవు, తర్వాత 31 వేల కోట్లన్నవు, బడ్జెట్ లోనేమో 26 వేల కోట్లు పెట్టినవ్ అని ప్రశ్నించిన. ఏ రైతులను తీసేస్తున్నవ్, ఎందుకు తీసేస్తున్నవ్ అని నిలదీశిన. రైతు రుణమాఫీ, రైతు భరోసా మీద చర్చ పెట్టాలని పట్టుపట్టిన. పెడతా అని చెప్పి ముఖం చాటేసి పారిపోయిండు.

మొన్న ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం నాడు రుణమాఫీ అయిపోయిందని ప్రకటించిండు. సరే చేసిండేమో అనుకొని లెక్కలు చూస్తే, కేవలం 17వేల కోట్లతో 22లక్షల మందికి చేసిండని లెక్క తేలింది. అసెంబ్లీ ఎన్నికలప్పుడు 40వేల కోట్లు చెప్పి, తీరా చేసింది ఎంతంటే 17వేల కోట్లు. అంటే 23వేల కోట్లు కోత పెట్టిండు.

క్యాబినెట్ మీటింగ్ నాడు, పార్లమెంట్ ఎన్నికల నాడు చెప్పిన 31వేల కోట్లతో పోలిస్తే 14వేల కోట్లు కోత పెట్టిండు.

బడ్జెట్ కేటాయింపుల్లో చెప్పిన 26 వేల కోట్లతో పోలిస్తే 9 వేల కోట్లు కోత పెట్టిండు.

పార్లమెంట్ ఎన్నికలపుడు రైతుల సంఖ్య 47 లక్షలు అని చెప్పిండు. మొత్తంగా మూడు విడతలకు 22 లక్షల మంది రైతులకు చేసిండు. అంటే చెప్పిన సంఖ్యకు సగం కూడా చేయలేదు. లెక్కచేస్తే 46శాతం మంది రైతులకే చేసినట్లు తేలుతున్నది. సుమారు 25లక్షల మంది రైతులకు ఎగనామం పెట్టినట్లు తన రికార్డులే చెబుతున్నాయి.ఈ పాటి పోటు పనికి సిగ్గులేకుండా తను తన వందిమాగదులు కలిసి రుణమాఫీ చేసినం అని చెప్పుకుంటూ చంకలు గుద్దుకుంటున్నరు.

రేవంత్ రెడ్డిది నోరా మోరా? చెప్పెటోనికి చెవుడైనా వినేటోనికి వివేకం ఉంటది కదా?

మొదటి దఫా మేము లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తేనే 36లక్షల మంది రైతులకు 17వేల కోట్ల ప్రయోజనం చేకూరింది. మీరు రెండు లక్షల రుణమాఫీ చేస్తే రైతుల సంఖ్య పెరగాలె, డబ్బులు డబుల్ కావాలె. అటువంటిది రైతుల సంఖ్య దాదాపు 14లక్షలు ఎట్ల తగ్గింది? డబ్బు గదే 17 వేల కోట్లకు అటు ఇటుగా ఉన్నది.

ఎవర్ని మభ్యపెడుతున్నరు ఏమనుకుంటున్నరు? ఎవర్ని మోసం చేస్తున్నరు?

పట్టపగలు నట్టనడి బజార్ల నిట్టనిలువున రైతులను ముంచి పారేసినవ్.

నువ్వు నిజంగనే రైతు రుణమాఫీ అయ్యిందనుకుంటున్నవా? రేవంత్ రెడ్డి నేను మళ్లీ సవాల్ విసురుతున్నా. రైతులందరికి రుణమాఫీ అయ్యిందని దమ్ముంటే నిరూపించు.

ప్లేసు, డేటు, టైము నువ్వే చెప్పు. ఏ జిల్లాకు పోదాం, ఏ నియోజకవర్గానికి పోదాం, ఏ మండలానికి పోదాం, ఏ గ్రామానికి పోదాం. నీ నియోజకవర్గం లేదా నా నియోజకవర్గం.. ఎక్కడికైనా పోదాం. నేనంటన్నది కరెక్టో, నువ్వంటున్నది కరెక్టో ఖుల్లం ఖుల్లా తెలుస్తది. నీ ప్రకటనల డొల్లతనం కూడా బయట పడుతది. వస్తవా? పోదామా రేవంత్ రెడ్డి?

నేను నీలాగా మాట తప్పెటోడిని కాదు. కొడంగల్ లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పి, పార్టీలు మారి ముఖ్యమంత్రి అయిన చరిత్ర కాదు నాది.

తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చినోడిని, ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం పదవులు లెక్కపెట్టకుండా రాజీనామాలు చేసినోడిని. నువ్వు చంద్రబాబు చంకల జొర్రి రైఫిల్ పట్టుకున్న నాడు నేను ప్రజల కొరకు రాజీనామా చేసినవాడిని.

రుణమాఫీ చేసిన, రాజీనామా అని రంకెలేస్తున్నవ్ రేవంత్ రెడ్డి. నేను చాలా స్పష్టమైన సవాల్ విసిరిన. ఆగస్టు 15 లోపు రైతులందరికి 2లక్షల రుణమాఫీ చేసి, ఆరు గ్యారెంటీల్లోని 13హామీలను సంపూర్ణంగా నెరవేరిస్తే నేను రాజీనామాకు సిద్ధమని ప్రకటించిన. ప్రజలకు నువ్వు ఇచ్చిన హామీ నెరవేరితే చాలు.. పదవి ఉంటే ఎంత పోతే ఎంత అనుకున్నా.

ఆరు గ్యారెంటీల సంగతి పక్కన పెట్టు. కనీసం రుణమాఫీ మాటను కూడా నెరవేర్చుకోలేకపోయావు. అడ్డంగా దొరికిపోయావు. నేను అనుకున్నట్లుగానే రుణమాఫీ పేరిట రైతుల నెత్తిన కాంగ్రెస్ టోపి పెట్టినవ్. ఇది కవర్ చేసుకోవడానికి ముఖ్యమంత్రి పదవి స్థాయిని దిగజార్చుతూ రోత ప్రచారం మొదలు పెట్టినవ్.

మభ్యపెట్టి మతలబు చేసి ఎక్కువ రోజులు అందరిని నమ్మించలేవు. రైతన్నను దగా చేసిన నీ తీరును యావత్ ప్రజానీకం గమనిస్తున్నది.

అధికారంలోకి వచ్చేది మేమే. 2లక్షల రుణాలు తెచ్చుకొండి అని రెచ్చగొట్టినవ్.

తీరా అధికారంలోకి వచ్చి 8 నెలల గడిచాక రుణమాఫీకి గండి కొట్టినవ్. అధికారం దక్కించుకునేందుకు మోసం. దక్కిన అధికారాన్ని నిలుపుకునేందుకు మరో మోసం. నీ 8 నెలల ప్రయాణమంతా మోసాల చరిత్రనే రేవంత్ రెడ్డి.

బిఆర్ఎస్ పార్టీ తొమ్మిదన్నరేండ్ల కాలంలో 70వేల కోట్లు రైతు బంధు కింద, 30వేల కోట్లు రుణమాఫీ కింద మొత్తం లక్ష కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసింది. నువ్వు మాత్రం ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టి, అధికారంలోకి వచ్చాక ఉసూరుమనిపించినవ్. రైతులకు రైతు భరోసా అన్నవ్, రైతు కూలీలకు అన్నవు, కౌలు దారులకు అన్నవ్ అందరికి ఎగనామం పెట్టినవ్.

రైతు బంధు పైసలు ఎగ్గొట్టి, ఆ పైసలు ఇటు డైవర్ట్ చేసి తూతూ మంత్రంగా రుణమాఫీ చేసి డప్పు కొట్టుకుంటున్నవ్, డబ్బా వాయిస్తున్నవ్. రైతు బంధు డబ్బులు డైవర్ట్ చేసినవ్. ఆగస్టు 6న తెలంగాణ భవన్ లో రుణమాఫీ కాల్ సెంటర్ ఏర్పాటు చేసినం. ఫోన్ కాల్స్, వాట్సప్ ద్వారా గడిచిన 10, 11 రోజుల్లో లక్ష 16 వేల ఫిర్యాదులు వచ్చినయ్. రుణమాఫీ కాలేదు న్యాయం చేయండని రైతులు ఆవేదన చెందుతున్నరు.

ఊళ్లల్లకు పోతే రైతన్నలు కన్నీళ్లు పెట్టుకుంటున్నరు. రుణమాఫీ కోసం అగ్రికల్చర్ ఆఫీస్, బ్యాంకుల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నరు. అధికారుల కాళ్ల వేళ్ల మీద పడి వేడుకుంటున్నరు. ఓపిక నశించి బ్యాంకుల ముందు నిరసన తెలుపుతున్నరు.

ఇదంతా అబద్దమా రేవంత్ రెడ్డి. రోజూ పత్రికల్లో, టీవీల్లో వస్తున్నవే కదా. రైతుల ఆవేదన ఈ ప్రభుత్వానికి ఎందుకు కనిపించడం లేదు.

ఒకవైపు రైతు బంధు రాక, మరోవైపు మీరు రుణమాఫీ చెయ్యక రాష్ట్రంలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం కళ్లు, చెవులు, నోరు లేనట్లు వ్యవహరిస్తున్నది. దమ్ముంటే రుణమాఫీ మీద శ్వేత పత్రం విడుదల చేయండి. రైతులు ఎందరు? అప్పు ఎవరికి ఉంది. ఎంత డబ్బు ఖాతాల్లో జమ అయ్యింది బయట పెట్టండి.

ఒక్క విషయంలో మాత్రం నిన్ను ఒప్పుకోవాలి రేవంత్ రెడ్డి. పరిపాలనలో ఫ్లాప్.

తొండి చేయడంలో తోపు. బూతులు మాట్లాడంలో టాపు. ఇందులో ఎవరికి అనుమానం లేదు.రుణమాఫీ చేయలేక చేతులెత్తేసినందుకు నువ్వు రాజీనామా చేయాల్సింది పోయి, సిగ్గులేక చోర్ ఉల్టా కొత్వాల్ కో డాంట అన్నట్లు నన్ను రాజీనామా చేయమంటున్నారు. రుణమాఫీ లో కోత మాటలేమో రోత. ఇది నీ వైఖరి.

బూతులు తిడితే రుణమాఫీ అయిపోతుందా? ఖాతాల్లో డబ్బులు పడతాయా?

తొండి చేసుకుంట మొండిగ మాట్లాడుతున్నవ్.

రంకెలేస్తే అంకెలు మారిపోవు. అబద్దాలు నిజమైపోవు. మమ్మల్ని తిట్లు తిడుతవ్ కావొచ్చు, కానీ దేవుడి మీద పెట్టిన ఒట్లు ఎట్ల మర్చిపోతవు. రేవంత్ రెడ్డి ఏమన్నడు. ఎన్ని దేవాలయాల మీద ఒట్లు వేసిండు? యాదగిరి గుట్ట లక్ష్మినర్సింహా స్వామి సాక్షిగా.. రామప్ప దేవాలయం శివుడి సాక్షిగా, సమ్మక్క సారలమ్మ సాక్షిగా, వెయ్యి స్తంభాల గుడి సాక్షిగా.. జోగులాంబ సాక్షిగా.. బాసర సరస్వతి మందిరం సాక్షిగా..

కొమురవెళ్లి మల్లన్న సాక్షిగా.. జూబ్లీహిల్స్ పెద్దమ్మ సాక్షిగా.. కురుమూర్తి సాక్షిగా..

సిద్దుల గుట్ట సాక్షిగా.. అనంతగిరి కొండల్లో ఉన్న పద్మనాభుడి సాక్షిగా..

పాలమూరు ప్రజల సాక్షిగా, జహంగీర్ పీర్ దర్గా సాక్షిగా… సేవాలాల్ సాక్షిగా, బావూజీ సాక్షిగా… మెదక్ చర్చ్ సాక్షిగా… ఏడు పాయల దుర్గమ్మ సాక్షిగా.. అంటూ గుడి, చర్చి, మసీద్ సాక్షిగా ఒట్లు వేసి రుణమాఫీ అమలు చేస్తానని మాట తప్పిండు.
హిందూ , ముస్లిం, క్రిస్టియన్లు నమ్ముకున్న దేవుళ్లను కూడా రేవంత్ మోసం చేసిండు. రైతులనే కాదు, దైవ ద్రోహానికి పాల్పడ్డడు. పాలకుడిగా నువ్వు పాపం మూటగట్టుకున్నవు. రాష్ట్రానికి ఎక్కడ లత్తగొడుతదో అని ప్రజలు భయపడుతున్నరు. రైతులకు తీరని ద్రోహం చేసినవ్, దేవుళ్లకు తీవ్రమైన అపచారం చేసినవ్. దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి మాట తప్పిన పాపం ఊరికే పోదు అది రాష్ట్రానికి చుట్టుకుంటుంది. ఊర్లల్ల అదే భయ పడుతున్నారు. దేవుళ్ళ మీద నిజమైన భక్తి ఉన్న ప్రతి వ్యక్తి నువ్వు చేసిన పాపం చూసి భయ పడుతున్నాడు.

నువ్వా ప్రాయశ్చిత్తం చేసుకోవు.

నీ పాపం ప్రజలకు శాపం కావద్దని నేను తీర్థ యాత్రకు బయలుదేరుతా. మా పార్టీ సీనియర్ నాయకులు కూడా వస్తారు. ముక్కోటి దేవతల్ని, అల్లా, జీసస్ లను వేడుకుంటా.ఈ పాపాత్ముడు చేసిన తప్పుకు ప్రజలకు కీడు చేయొద్దని వే డుకుంటా. ప్రైమరీ స్కూల్ పిల్లలు కూడా రుణమాఫీ అయ్యిందా లేదా చెబుతరు.

ఎంత మంది ఉండే, ఎంత మందికి వచ్చింది సింపుల్. అది చెప్పలేక, సిగ్గ్గులేదని, జాతి అని మాట్లాడుతారు.

సీఎం ఇలా మాట్లడచ్చునా? మేము ఇంతకంటే ఎక్కువ మాట్లాడతాం. ప్రశ్నిస్తే చావాలని మాట్లాడుతున్నారు. నీ గాడ్ ఫాదర్స్ కి భయపడలేదు. నీ తాటాకు చప్పుళ్లకు బయపడం మిస్టర్ రేవంత్ రెడ్డి. రుణమాఫీ విషయంలో మాట తప్పావ్ ఫెయిల్ అయ్యావు. రుణమాఫీ రైతులందరికి చేసే దాకా, రైతు భరోసా ఇచ్చేదాకా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డిని వదిలిపెట్టేది లేదు. బీఆర్ఎస్ పక్షాన పోరాటం చేస్తాం. మరో రైతాంగ ఉద్యమానికి శ్రీకారం చుడతాం. పార్టీ తరుపున త్వరలో కార్యాచరణ ప్రకటిస్తాం. రైతుల తరుపున పోరాటం చేస్తం.

ఇలా దాడులు చేస్తే పెట్టుబడులు వస్తాయా?

పాక్షికంగా జరిగిన రుణమాఫీ మా పోరాటం వల్లే. మేము చేసిన సవాల్ వల్లే. రైతుల తరుపున రుణమాఫీ చెయ్యాలని ప్రశ్నిస్తే గుండాలతో దాడులకు పురమాయించారు.
ఇలా దాడులు చేస్తే పెట్టుబడులు వస్తాయా? అమెరికా పోయింది పెట్టుబడులకా లేక, దాడుల గురించి నేర్చుకోడానికా? ప్రజలు గమనిస్తున్నారు. దాడులు కొత్తకాదు.
దాడులకు భయపడం రైతుల తరుపున పోరాటం చేస్తం. పదేళ్లు అధికారంలో ఉన్నాము. ఇలా ఎప్పుడూ దాడులకు పాల్పడలేదు. దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటివి జరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయి.