ఇంటి పైకప్పు కూలి మృతి చెందిన మహిళ కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారం

– ఎమ్మెల్యే గళ్ళ మాధవి చొరవ ఫలితం

గుంటూరు, మహానాడు: గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఇటీవల భారీ వర్షాలతో ఇంటి పై కప్పు కూలి మృతి చెందిన మహిళ కుటుంబానికి ఎన్డీయే ప్రభుత్వ పరిహారం అందించింది. ఎమ్మెల్యే గళ్ళ మాధవి చొరవతో బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల మంజూరు అయింది. బాధితురాలి ఇంటికి స్వయంగా వెళ్లి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే పరిహారం అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జగన్ రెడ్డి ప్రకటించిన విధంగా 1 కోటి రూపాయల విరాళాన్ని వరద బాధితులకు అందించి తమను విమర్శిస్తే బాగుంటుందని హితవు పలికారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు 18వ డివిజన్ లోని అడపా బజార్ లో అడపా సూరమ్మ అనే మహిళ ఇంటి పై కప్పు కూలి మృతి చెందింది.

వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న ఎమ్మెల్యే దృష్టికి ఈ విషయం వెళ్ళగా, వెంటనే స్పందించిన ఎమ్మెల్యే సత్వర చర్యలు తీసుకోని, ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సినదిగా ప్రభుత్వ దృష్టికి తీసుకొని వెళ్ళారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రూ.5 లక్షలు మంజూరు చేసింది. ఆపద సమయంలో తమ కుటుంబానికి న్యాయం చేయటానికి కృషి చేసి రూ.5లక్షలు మంజూరు చేయించిన ఎమ్మెల్యే గళ్ళ మాధవికి, ప్రభుత్వానికి బాధిత కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.