టీ20 ప్రపంచకప్ సూపర్-8 మ్యాచ్‌లో ఆతిథ్య వెస్టిండీస్‌పై దక్షిణాఫ్రికా విజయం సాధించింది. డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 17 ఓవర్లలో 123 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన సఫారీలు సెమీస్‌కు దూసుకెళ్లారు. సౌతాఫ్రికా టాస్ గెలిచి, కరేబియన్ జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. దాంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 135 రన్స్‌కే పరిమితమైంది. రోస్టర్ చేజ్ అర్ధశతకం (52) తో ఒంటరి పోరాటం చేశాడు. ఓపెనర్ కైల్ మేయర్స్ 35 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. సఫారీ బౌలర్లలో షంసీ 3 వికెట్లు తీసి విండీస్‌ను దెబ్బతీశాడు. అలాగే జాన్సెన్, మార్క్రమ్, రబాడ, కేశవ్ మహరాజ్ తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం 136 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన సఫారీలు 2 ఓవర్లు ముగిసేసరికి 15 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డారు. ఈ క్రమంలో వర్షం రావడంతో మ్యాచ్‌ను 17 ఓవర్లకు కుదించారు. అలాగే దక్షిణాఫ్రికా టార్గెట్‌ను 123గా నిర్ణయించారు. వర్షం తర్వాత మ్యాచ్ ప్రారంభమైన కొద్దిసేపటికే కెప్టెన్ మార్క్రమ్ (18) ఔట్ అయ్యాడు.
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన క్లాసెన్ (22), స్టబ్స్ (29) కొద్దిసేపు విండీస్ బౌలర్లను నిలువరించారు. క్రీజులో కుదురుకున్నట్లు కనిపించిన క్లాసెన్ ఔట్ కావడం, ఆ వెంటనే డేవిడ్ మిల్లర్ (4) కూడా పెవిలియన్ చేరడంతో సఫారీల మళ్లీ కకష్టాల్లో పడ్డారు. 100 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన దశలో లోయర్ ఆర్డర్ ఆటగాడు జాన్సెన్ బ్యాట్ ఝుళిపించడంతో దక్షిణాఫ్రికా గట్టేక్కింది.
ఆఖరి ఓవర్లో 5 పరుగులు కావాల్సి ఉండగా.. మెక్కీ వేసిన తొలి బంతికే జాన్సెన్ సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించాడు. 3 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. ఈ విజయంతో సఫారీలు సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లారు. 3 వికెట్లు తీసి విండీస్ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చిన స్పిన్నర్ షంసీకి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
ఇక గ్రూప్-2 నుంచి ఇప్పటికే ఇంగ్లండ్ సెమీస్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకోగా, ఇప్పుడు రెండో జట్టుగా దక్షిణాఫ్రికా నిలిచింది. మూడో స్థానంలో ఉన్న కరేబియన్ జట్టు, నాలుగో స్థానంలో ఉన్న అమెరికా ఇంటిదారి పట్టాయి.