సజ్జలపై మాజీ మంత్రి డొక్కా సంచలన వ్యాఖ్యలు

నా ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగింది..విచారణ జరిపించాలి
కులాలు, ప్రాంతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టారు
ఓటర్లు సరైన సమయంలో బుద్ధిచెప్పారని వెల్లడి

గుంటూరు: మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్‌ వైకాపా నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. తన ఫోన్‌ను ట్యాప్‌ చేయిం చారని, దీనిపై విచారణ జరపించాలని డిమాండ్‌ చేశారు. బుధవారం గుం టూరులోని జన చైతన్య వేదిక హాలులో ఎన్నికల ఫలితాల విశ్లేషణపై జనచైతన్య వేదిక నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అధ్యక్షత వహించారు. డొక్కా ప్రసంగిస్తూ ప్రత్యర్థులను తిట్టాలని, వారితో ఘర్షణ పడాలని సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వారు బోధించే వారని తెలిపారు. ఆయన నేతృత్వంలో నా ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగిందని, వీటిపై విచారణ జరిపించాలని కోరారు. ఘర్షణ లను ప్రేరేపించడం, ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడం, ప్రత్యర్థులను వెంటాడి, వేటాడటాన్ని ప్రజలు గమనించి సరైన సమయంలో సరైన తీర్పును ఇచ్చారని పేర్కొన్నారు. వైకాపా ప్రభుత్వం కులాలు, ప్రాంతాల మధ్య విద్వేషాల ను రెచ్చగొట్టడాన్ని ఓటర్లు తిరస్కరించారని తెలిపారు.

వ్యవస్థలను ధ్వంసం చేశారు

జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ వైకాపా పాలనలో జరిగిన అరాచకాలను, అవినీతిని ఓటర్లు తిరస్కరించారన్నారు. పోలీస్‌ వ్యవస్థను ఉపయోగించి ప్రత్యర్థులపై కేసులు పెట్టడం భావ వ్యక్తీకరణకు అవకాశం ఇవ్వకపోవడం, 13.5 లక్షల కోట్లతో ఆంధ్రప్రదేశ్‌ను అప్పుల ఊబిలోకి నెట్టడంపై ఆంధ్రప్రదేశ్‌ ఓటర్లు ఆగ్రహించారని పేర్కొన్నారు. నీటిపారుదల ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం, మూడు రాజధానులు పేరిట మూడు ముక్కలాట ఆడటం, పెట్టుబడులను ఆకర్షించకపోవడం, పరిశ్ర మలను ప్రోత్సహించకపోవడం, ఉపాధి, ఉద్యోగ కల్పనకు కృషి చేయకపోవడం, వ్యవస్థలను ధ్వంసం చేయటం లాంటి చర్యలను నిరసిస్తూ ఓటర్లు తీర్పు చెప్పారని పేర్కొన్నారు.

ప్రజా సమస్యలను గాలికొదిలారు

ఎమ్మెల్సీ కె.ఎస్‌.లక్ష్మణరావు ప్రసంగిస్తూ ముఖ్యమంత్రి ప్రజాప్రతినిధులకు, ప్రజలకు అందుబాటులో లేకపోవడం, సచివాలయానికి, కేవలం మంత్రివర్గ సమావేశానికి మాత్రమే హాజరుకావటం, ప్రజల సమస్యలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం మంత్రులకు ఇవ్వకపోవడం, స్థానిక సంస్థలకు నిధులు కేటాయించకపోవడం లాంటి లోపాలతో వైకాపా ఘోరంగా ఓటమి పాలైందన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ పూర్వ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ ఎన్‌.రంగయ్య ప్రసంగిస్తూ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కొద్ది సీట్ల మెజారిటీతో అధికారంలోకి రావటం, టీడీపీ భాగస్వామ్యంగా ఉండటం వల్ల ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి నూతన ప్రభుత్వం కృషి చేయాలన్నారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దుకోవడానికి రాజధాని, పోలవరం ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులను సమకూర్చుకోవచ్చని తెలి పారు. ప్రముఖ న్యాయవాది నర్రా శ్రీనివాసులు మాట్లాడుతూ ఐదేళ్ల వైకాపా పాలనలో అరాచకం పెరిగిందని, దాడులు పెరిగాయని, వేలాది పోలీసు కేసులు పెట్టి ప్రత్యర్థులను హింసించారని వీటి ఫలితమే నేటి ప్రజా తీర్పు అని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్‌ డి.ఎ.ఆర్‌. సుబ్రహ్మణ్యం, దీక్షిత ఫౌండేషన్‌ కన్వీనర్‌ ఎడ్డవల్లి కృష్ణ, మానవత పూర్వ కార్యదర్శి రమణబాబు, జన విజ్ఞాన వేదిక నేత గోరంట్ల వెంకటరావు పాల్గొన్నారు.