-చీమకుర్తి హరిహర క్షేత్రంలో ఘనంగా ఆషాడ గోరింటాకు పండుగ
-ప్రత్యేక పూజల్లో మాజీ మంత్రి శిద్దా రాఘవరావు దంపతులు
చీమకుర్తి, మహానాడు :
ఆషాడ మాసం సందర్భంగా చీమకుర్తి శ్రీ హరిహర క్షేత్రంలో గోరింటాకు పండగ శనివారం వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలను రాష్ట్ర మాజీమంత్రి శిద్దా రాఘవరావు, సతీమణి శిద్దా లక్ష్మీ పద్మావతి, శిద్దా సుధీర్ కుమార్ నేతృత్వంలో నిర్వహించారు. గోరింటాకు పండుగలో అమ్మవారిని శాకంబరీ దేవిగా అలంకరించారు. నేటి తరాలకు హిందూ సాంప్రదాయాలను గుర్తు చేస్తూ లక్ష్మీ పద్మావతి ఈ వేడుకలు జరిపారు. హిందూ పండుగ విశిష్టతను, సంప్రదాయాలను చాటి చెప్పారు. శాకంబరీ దేవిగా దర్శనమిచ్చిన అమ్మవారిని దర్శించుకునేందుకు చీమకుర్తి, దర్శి, మార్కాపురం, ఒంగోలు తదితర ప్రాంతాల నుండి భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం శ్రీ హరిహర క్షేత్రంలో వేంచేసివున్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి పంచామృత అభిషేకాలు, విశేష కుంకుమ అర్చన, విశేష పూల అలంకారాలు నిర్వహించారు.
ప్రత్యేక పూజల్లో మాజీమంత్రి శిద్దా రాఘవరావు దంపతులు
ఆషాడ గోరింటాకు పండుగ సందర్భంగా మాజీ మంత్రి శిద్దా రాఘవరావు, శిద్దా లక్ష్మీ పద్మావతి దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ రకాల కూరగాయలతో, అమ్మవారికి ఇష్టకరమైన పదార్ధాలతో పాటు శిద్దా లక్ష్మీ పద్మావతి, సువాసినిలతో కలిసి గోరింటాకు రుబ్బి అమ్మవారికి చీర, రవికె, గాజులు, పసుపు, కుంకుమ, పండ్లు 108 రకాల పదార్థాలు అమ్మవారికి సమర్పించారు. అనంతరం అమ్మవారి మహా హారతి వైభవంగా నిర్వహించారు. వాసవి అమ్మవారి కీర్తనలు, కోలాటం, భజనలు చేశారు. జై వాసవి నినాదంతో హరిహర క్షేత్రం భక్త జనసంద్రంగా మారింది. పూజ కార్యక్రమం అనంతరం శిద్దా లక్ష్మీ పద్మావతి ముత్తైదువులకు పసుపు కుంకుమ, గాజులు, ప్రసాదాలు అందజేశారు.
ఈ వేడుకలలో శిద్దా పాండురంగారావు దంపతులు, శిద్దా వెంకటేశ్వర్లు, శిద్దా పెద్ద బాబు,శిద్దా సుధాకర్ దంపతులు, శిద్దా సాయిబాబు దంపతులు, శిద్దా ప్రసాద్, శిద్దా బాలాజీ దంపతులు, శిద్దా జయశ్రీ,శిద్దా పుష్పాలత,శిద్దా జయభారతి, ఆర్యవైశ్య మహిళా అధ్యక్షురాలు సువర్ణ,పల్లపోతు పద్మ, అరుణ, ఆర్యవైశ్య వాసవి మహిళా సభ్యులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శిద్దా వెంకటేశ్వర్లు వెంకట సుబ్బమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తులకు అన్న ప్రసాదాలు, ఉచిత బస్ సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఆలయ అర్చకులు సుబ్రహ్మణ్యం శర్మ,హరి కుమారాచార్యులు, హరి కృష్ణ శర్మ తదితరులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.