సాక్షి పత్రిక రోత రాతలను మానుకోవాలి

– ఎమ్మెల్యే గళ్ళా మాధవి

గుంటూరు, మహానాడు: విజయవాడ నగరంలో వరద సహాయక చర్యలను దగ్గరుండి, వేగవంతం చేస్తున్న చంద్రబాబు, లోకేష్ మీద జగన్ రెడ్డి మానస పత్రిక సాక్షిలో విషపు రాతలు రాయటాన్ని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు గళ్ళా మాధవి ఖండించారు. సోమవారం పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ… ఒక రాష్ట్రానికి విపత్తు కలిగినప్పుడు రాజకీయాలకు, ప్రాంతాలకు, సిద్ధాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో బాధితులకు అండగా నిలబడాలి తప్ప విమర్శించకూడదన్నారు. ఆదివారం నుంచి కలెక్టరేట్ ను సచివాలయంగా మార్చుకొని అధికారులతో సమీక్షా జరుపుతూ, బస్సులోనే బస చేసి వరద బాధితులకు అండగా నిలబడి, బోట్లు, హెలికాఫ్టర్ ద్వారా లక్షలాది భోజన, మెడిసిన్ ప్యాకెట్లను ప్రజలకు అందేటట్టు చూసిన చంద్రబాబు మీద బురద చల్లటానికి ప్రయత్నించటం సాక్షికి అలవాటేనని విమర్శించారు. అలాగే, మంత్రి లోకేష్ వరద బాధితులను వదిలేసి హైదరాబాద్ వెళ్ళినట్టు రాయడం ఏమిటని నిన్న లోకేష్ మంగళగిరిలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారని గుర్తుచేశారు. మీ యజమాని జగన్ రెడ్డి గతంలో విశాఖలో హుదూద్‌ తుపాను సంభవిస్తే “అవెంజర్స్” సినిమా చూసి సేద తీరారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుర్తు చేశారు. నేడు కూడా అదే మాదిరిగా వరద తగ్గిన సమయంలో తూతూ మంత్రం పర్యటించారని ఈ విషయం కూడా సాక్షిలో ప్రచురిస్తే బాగుంటుందని ఎమ్మెల్యే గళ్ళా మాధవి హితవు పలికారు.