Mahanaadu-Logo-PNG-Large

ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌పై సాక్షి అవాస్తవాల ప్రచారం

-2019 జూలైలో ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ బిల్లు
-నవంబరులో నీతి ఆయోగ్‌ కొన్ని మార్గదర్శకాలిచ్చింది
-నవంబరులో పరీక్షలైతే జూలైలోనే పాసయ్యాయా జగన్‌రెడ్డి
-లోపాలున్నాయని మూడుసార్లు కేంద్రం వెనక్కు పంపలేదా?
-పయ్యావుల మంచిదని చెప్పిన తర్వాత మూడుసార్లు మార్చారు
-ఈటీవీలో సునీల్‌కుమార్‌ ఇంటర్వ్యూను వక్రీకరించడం దారుణం
-ఆయన మీ ప్రభుత్వ సలహాదారుడని ఎందుకు సాక్షి ప్రచురించలేదు
-ఈటీవీ ఇంటర్వ్యూతో రామోజీ, చంద్రబాబుకు ఏమిటి సంబంధం?
-రామోజీకి వై.ఎస్‌.భారతిరెడ్డి బహిరంగ క్షమాపణలు చెప్పాలి
-తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి

మంగళగిరి: ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌పై ఈటీవీకి ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సునీల్‌కుమార్‌ గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ చట్టాన్ని ఈటీవీ అద్భుతమని చెప్పిందన్నట్లు అవాస్తవాలను అవినీతి సాక్షి పత్రిక ప్రచురించడంపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి మండిపడ్డారు. సోమవారం మంగళగిరి టీడీపీ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి మూడు సార్లు కేంద్రం ఆమోదానికి పంపించింది వైసీపీ ప్రభుత్వ మేనని చెప్పిన ఆయన ఆ ఇంటర్వ్యూకు సంబంధించి ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ చట్టం అద్భుతమంటూ ఈటీవీలో స్టోరీ వేశారని అవినీతి సాక్షి పత్రికలో ప్రచురించడాన్ని తప్పుపట్టారు. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌పై ఈటీవీ ప్రతిధ్వనిలో వచ్చిన స్టోరీని మీరు చూశారా? నేడు ఈటీవీ అద్భుతమంటే జనాలు నమ్ముతారు, ఈటీవీ అంటే జనాలకు విశ్వాసం ఉందని మీరు తెలుసుకున్నారు. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ విషయంలో జగన్‌రెడ్డి భేష్‌ అని అనిపించుకోవడం కోసం ఈటీవీ, రామోజీరావు ఫొటోలు వేసుకొని వాడుకునే పరిస్థితికి సాక్షి, వైఎస్‌ భారతిరెడ్డి దిగజారారు. ఈటీవీ ప్రతిధ్వనిలో ల్యాండ్‌ టైటిలింగ్‌పై వేసిన స్టోరీ వెబ్‌ లింక్‌ పనిచేయడం లేదు. ఈటీవీ భయపడిపోయిందని సొంత ఊహాగానాలిస్తున్నారు. మీ ముందే నేను లింక్‌ ఓపెన్‌ చేసి చూపిస్తున్నా… భారతమ్మా..! కొంచెం మీ ఫోన్‌లో కూడా లింక్‌ ఓపెన్‌ చేసి చూసుకోండి. వాస్తవా లు చెప్పడం నేర్చుకోండి అని ధ్వజమెత్తారు.

సునీల్‌కుమార్‌ మీ ప్రభుత్వ సలహాదారుడేగా…
ప్రతిధ్వనిలో తెలంగాణ అడ్వకేట్‌ సునీల్‌కుమార్‌తో ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టంపై ఇంటర్వ్యూ తీసుకున్నారు. తెలంగాణ ధరణి పోర్టల్‌ వ్యవహారంలో అతను కూడా ప్రమేయుడే. ఇప్పుడు ఆ సునీల్‌కుమార్‌ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సలహాదారుడు. ప్రతిధ్వనిలో ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టంపై ఇంటర్వ్యూ ఇచ్చిన సునీల్‌కుమార్‌ మా ప్రభుత్వ సలహాదారుడని ఎందుకు సాక్షి పత్రికలో వేయలేదు? మేము చాలా నిజాయితీ వార్తలు వేస్తాం, నిబద్ధతతో నిజాలను తెలియజేస్తామని భారతిరెడ్డి కహానీలు చెబుతున్నారు. అంత నిజాయితీ గల పత్రిక అయితే సునీల్‌కుమార్‌ గురించి కూడా సాక్షి పత్రికలో వేయాలి కదా? ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌పై ఉన్న అనుమానాలను సునీల్‌కుమార్‌ ఈటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకున్నారు. సునీల్‌కుమార్‌ చెప్పినవి నిజమని, ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ అద్భుతమని ఈటీవీ అన్నదని డబ్బాలు కొట్టుకుంటున్నారు. ఇంటర్వ్యూకు, అద్భుతానికి తేడా కూడా సాక్షి పత్రికకు తెలియడం లేదు. ప్రజల సొమ్ముతో సాక్షి పత్రికలో పనిచేసే ఒక్కొక్కరికి లక్షల జీతాలు దారపోస్తున్నారు కానీ, ఏమి రాస్తున్నారో అర్థం కూడా కావడం లేదు. కొమ్మినేని సలహా తీసుకుని రాస్తున్నారేమో. అందుకే పచ్చి అబద్ధాలాడుతున్నారు.

ఆ ఇంటర్వ్యూతో రామోజీ, చంద్రబాబుకు సంబంధం ఏమిటి?
ఇప్పటికైనా ప్రతిధ్వనిలో వచ్చిన ఇంటర్వ్యూను చూడండి. ఒకవేళ లింక్‌ ఓపెన్‌ కావడం లేదని సాకులు చెబితే నేను మీకు లింక్‌ పంపిస్తా ఒకసారి చూసి నిజాలు తెలుసుకోండి. రామోజీరావు అంటే భలే ప్రేమ అనుకుంట. ఊ అంటే రామోజీరావు, చంద్రబాబు ఫొటో వేస్తారు. ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సునీల్‌కుమా ర్‌ ఇచ్చిన ఇంటర్వ్యూకు రామోజీరావు, చంద్రబాబులకు ఏమైనా సంబంధముందా? పోనీ సాక్షి పత్రికలాగా విలువలు లేకుండా ఈనాడు పత్రికలో భారతిరెడ్డి ఫొటోలు వేస్తున్నారా? అని ప్రశ్నించారు.

జగన్‌ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌…
ఏపి ప్రభుత్వ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ కాదు అది వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌కు ఏపీ ప్రభుత్వానికి ఏమి సంబంధం లేదు. ఇది బీజేపీ, మోదీ తీసుకువచ్చిన యాక్ట్‌ అని నిస్సిగ్గుగా చెప్పుకుంటున్నారు. కానీ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ను ఫ్రేమ్‌ చేసింది ఎవరు? దాని రూల్స్‌ రాసిందెవరు? జగన్‌ రెడ్డి ఏమైనా ఇంట్లో కూర్చొని రాశాడా లేదా? మేధావులను కూర్చోపెట్టుకుని రాశారా? 2019 జూలైలో మొట్టమొదటిసారి ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ బిల్లును ఇంప్లిమెంట్‌ చేసింది రాష్ట్ర ప్రభుత్వం కాదా? 2019 నవంబరులో యాక్ట్‌ ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ఎలా రూపొందించవచ్చని నీతి అయోగ్‌ మార్గదర్శకాలిచ్చింది నిజం కాదా? ఒక్క బిల్లును మూడుసార్లు కేంద్రానికి పంపిస్తే మూడుసార్లు తిప్పి పంపించింది. వెనక్కి ఎందుకు వచ్చిందని మాకు ఇంతవరకు కారణాలు చెప్పలేదు. కనీసం సాక్షి పత్రికలో అయినా రేపు మూడు సార్లు బిల్లు ఎందుకు వెనక్కి వచ్చిందనే కారణాలు చెప్పాలి. అప్పుడు కావాలంటే పక్కనే చంద్రబాబు, రామోజీరావు ఫొటోలు వేసుకోండి.

మూడుసార్లు వెనక్కు పంపిందంటే వ్యతిరేకమనేగా…
ఒకే బిల్లును మూడు సార్లు వెనక్కి పంపించిందంటే ఆ బిల్లులో విపరీతమైన తప్పులు ఉండబట్టే చేసి ఉంటుంది. రైతులు, భూయజమానులు, ప్రజలందరికీ ఆ బిల్లు వ్యతిరేకంగా ఉంది. ప్రజలందరూ ఇబ్బందు లు పడుతారనే కేంద్రం ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ బిల్లును మూడు సార్లు వెనక్కి పంపించింది. ఒకే బిల్లును మూడు సార్లు వెనక్కి పంపుతే నాలుగో సారి కూడా వెనక్కి పంపించడానికి రాజ్యాంగం ఒప్పుకోదు. మూడు సార్లు మాత్రమే వెనక్కి పంపించగలం. నాలుగోసారి ఖచ్చితంగా ఆ బిల్లును ఆమోదించాల్సిందే. అందుకే కష్టంగా ఉన్నా, ఇష్టం లేకపోయినా రాజ్యాంగాన్ని గౌరవించాలి కాబట్టి కేంద్ర ప్రభుత్వం ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ బిల్లును ఆమోదించింది’’ అని అన్నారు.

ఈటీవీ, రామోజీకి భారతిరెడ్డి క్షమాపణ చెప్పాలి
అన్నదాత కార్యక్రమంలో జరిగిన ఈటీవీ ఇంటర్వ్యూను వక్రీకరించినందుకు ఈటీవీకి, ఈటీవీ యాజమాన్యా నికి, రామోజీరావుకు ప్రజలను మోసం చేస్తున్న సాక్షి పత్రిక క్షమాపణలు చెప్పాలి. నిజాలే ఉంటాయని చెప్పుకుంటూ తిరుగుతున్న భారతిరెడ్డి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి. ప్రభుత్వంపై ఒళ్లు మండి జగన్‌ రెడ్డిపై ఎవరో రాయి వేస్తే సాక్షి పత్రికకి చంద్రబాబు హంతకుడు. జగన్‌ రెడ్డి బాబాయిని చంపితే చంద్రబాబే హంతకుడు. చివరికి వాళ్ల ఇంట్లో ఎవరికైనా అనారోగ్యం వచ్చినా చంద్రబాబు హంతకుడు. జగన్‌ రెడ్డి ఇంట్లో అక్క, అన్న చెల్లెలు, వదినమ్మలు కొట్టుకుంటే చంద్రబాబే చేయించాడు. అంతా చంద్రబాబు చంద్రబాబే. జగన్‌ రెడ్డి, భారతిరెడ్డి మాట్లాడుకునేటప్పుడు ఇంకేమి మాట్లాడుకోరేమో..అక్కడ కూడా అంతా చంద్రబాబేనేమో అని ఎద్దేవా చేశారు.

పయ్యావుల మంచిదని చెప్పారు..తర్వాత మార్పులెందుకు చేశారు
ల్యాండ్‌ టైటిలింగ్‌ బిల్లు ఆశయాలు గొప్పవని పయ్యావుల కేశవ్‌ అన్నారు. అందులో తప్పేముంది. కానీ ఆ ఆశయాలను నాశనం చేసింది వైసీపీనే. అప్పటి నుంచి మూడు సార్లు బిల్లులో మార్పులు చేశారు. ఇప్పుడేమో పయ్యావుల కేశవ్‌ చెప్పాడని ప్రజలను మభ్య పెట్టాలని చేస్తున్నారు. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ అమలు చేయాలంటే అందులో సవరణలు చేసి అమలు చేయండి. అందులో చాలా లోపాలున్నాయి, మార్పులు చేయాలనే ఏ రాష్ట్రం కూడా దాని జోలికి పోలేదు. సెప్టెంబరులో నీతి అయోగ్‌ పరీక్షలు పెడితే(ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌కు మార్గదర్శకాలిచ్చింది) జూలైలోనే పరీక్షలు రాసి(ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ బిల్లు ప్రవేశపెట్టింది) నేను పాస్‌ అయిపోయా అని సంబరపడితే ఎలా? ఇదే పిచ్చితనం జగన్‌ రెడ్డి.

రిటైర్డ్‌ అధికారే బాధితుడినని చెప్పారు…
పయ్యావుల కేశవ్‌ చెప్పినప్పటి నుంచి నేటికి మూడు సవరణలు చేశారు. సెక్షన్‌ 15-జడ్జీతో ట్రిబ్యునల్‌, ప్రత్యేక హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు, వంటివి ఎన్నో 2019లో బిల్లులో చెప్పి 2023కి వచ్చేసరికి అవి బిల్లులో తొలగించారు. ఈ బిల్లును ప్రవేశపెట్టే ముందు ప్రతిపక్ష నేతలను, మేధావులను, రైతులతో సమీక్ష చేసి సలహాలేమైనా తీసుకున్నారా? 25 ఏళ్లు ఏపీ ప్రభుత్వంలో పనిచేసిన పి.వి.రమేష్‌ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ బాధితుడినని ఎక్స్‌లో ట్వీట్‌ చేశారు. భయంకరమైన ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ను అమలు చేయాలని వైసీపీ ప్రభుత్వం చూస్తుందని ప్రజలు గమనించాలి. అబద్ధాన్ని నిజం చేయాలని ప్రయత్నం చేస్తున్న వైసీపీ గురించి ప్రజలకు నిజం తెలపాల్సిన అవసరం మాపై ఉంది. ఇడుపులపాయి జగన్‌ రెడ్డికి చెందిన భూమి నాదని నేను అమ్ముకోవచ్చు అలాంటి చట్టమిది. ఈ భూమి నాదని ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ ద్వారా నేను ఫిర్యాదు చేసానని జగన్‌ రెడ్డికి తెలియకపోతే రెండేళ్ల తర్వాత ఆ భూములను నావైపోతాయి. ఇంత దుర్మార్గమైన చట్టం ఇది. అందుకే ప్రజలను అప్రమత్తం చేస్తున్నామని తెలిపారు.