శ్యాండ్, ల్యాండ్, వైన్ కాదేదీ దోపిడీ కనర్హం

వైసీపీ నాయకుల పాపం పండింది 
అప్రూవర్ లుగా మారి నిజాలను బయట పెట్టాలి  
దోచుకున్నదంతా కక్కిస్తాం 
మీడియా సమావేశంలో మాజీ మంత్రి కె.ఎస్ జవహర్ 

మంగళగిరి, మహానాడు :  అగ్గిపుల్ల, సబ్బుబిల్ల, కుక్కపిల్ల కాదేది కవితకు అనర్హం అని శ్రీశ్రీ చెప్పినట్లు.. నేడు జగన్ రెడ్డి, వైసీపీ నేతల దోపిడీకి కాదేది అనర్హం… దేన్నీ వదలకుండా దోచుకున్నారని  మాజీ మంత్రి కె.ఎస్ జవహర్ మండిపడ్డారు. నేడు దోచుకున్న ఫైళ్లు దొరక్కుండా దగ్ధం చేస్తున్నారని.. ఫైళ్లు దగ్ధం చేసినంత మాత్రాన పండిన పాపాల నుండి తప్పించుకోలేరని ఆయన తెలిపారు. మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

కె.ఎస్ జవహర్ మాట్లాడుతూ..

ఏ నేరస్తుడైనా ఏదో ఒక చోట దొరకాల్సిందే. కరకట్టపై ఫైళ్లు దగ్ధం చేశారు. వీళ్లు ఎన్ని దగ్ధం చేసినా వైసీపీ నేతల పాపాల చిట్టా అంతా టీడీపీ వద్ద ఉంది. దొంగలతో పాటు అధికారులు కూడా భాగస్వాములు కావడం సిగ్గుచేటు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారి సమీర్ శర్మ డ్రైవర్ నాగరాజుకు ఫైళ్లు దగ్ధం చేయమని చెప్పడం దారుణం. వీరిపై వెంటనే కేసులు పెట్టి కటకటాల్లో వేయాలి.

ఒకప్పుడు వాసుదేవరెడ్డి బేవరేజెస్, ఎక్సైజ్ లో అక్రమంగా కోట్లు కొల్లగొట్టారు.. ఇప్పుడు లెక్కేస్తుంటే అక్రమాల లెక్కలు తేలడం లేదు. ఐఏఎస్ అధికారులుగా ఉండి జగన్ రెడ్డి ఆలీబాబా 40 దొంగలకు సహకరిస్తూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఫైళ్లను అమరావతిలో దగ్ధం చేశారు, కరకట్టపై దగ్ధం చేశారు. ప్రజలు అప్రమత్తమై పట్టుకుంటే కొన్ని దొరికాయి.ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ కు సంబంధించి వాసుదేవరెడ్డిని, కరకట్టపై ఫైళ్లను దగ్ధం చేయించిన సమీర్ శర్మలపై థార్డ్ డిగ్రీలను ప్రయోగించి నిజాలను బయటకు తీయాలి.

వీరి వెనుక ఎవరు ఉన్నా వదిలిపెట్టేది లేదు… వారి పాపాల చిట్టాను బయటకు తీయాలి. కాగితాలు చించినంత మాత్రనా వారి పాపాలు ఎక్కడికి పోవు. చిత్రగుప్తుడి దగ్గర ఉన్న పాపాల చిట్టాకంటే వైసీపీ నేతల పాపాలు ఎక్కువగా ఉన్నాయి. వారి పాపాలన్ని బయట పెడతాం. అన్నిటిపై విచారణ జరుగుతుంది. తప్పకుండా శిక్ష అనుభవించాల్సిందే. అవినీతిపై చంద్రబాబు యుద్దం మొదలెట్టారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక జేపీ ఇన్ఫ్రాస్టర్ దాదాపు రూ. 800 కోట్లు కట్టకుండానే కట్టామని చెప్పి మోసం చేశారు.

జగన్ రెడ్డి ఏవిధంగా దోపిడీ దారులను ప్రోత్సహించారో ఇదే ఉదాహరణ. రూ. 800 కోట్లు ప్రభుత్వానికి కట్టేదాక జేపీ, జేపీ ఇన్ఫ్రా స్ట్రక్చర్ ను వదిలిపెట్టం. ఇక పాపాల పెద్దిరెడ్డి గనులనే మాయం చేశాడు… నేడు ఫైళ్లు ఒక లెక్కా. వాటిని మాయం చేయడానికి యత్నిస్తున్నాడు. పెద్దిరెడ్డి అక్రమాలకు సంబంధించి ఎవరైతే అధికారులు సహకరించారో వారు అప్రూవర్ గా మారాలి. అలాగే వాసుదేవరెడ్డి, సమీర్ శర్మలు అప్రూవర్ గా మారి ప్రభుత్వానికి నిజం చెప్పాలి. దోచుకున్నదంతా ప్రజలకు పంచాల్సిన అవసరం ఉంది.

వైద్యఆరోగ్యశాఖ, గ్రూప్ 1 లో అనేక అవకతవకలు జరిగాయి. వాటిని బయటపెట్టాల్సిన అవసరం ఉంది. నాడు నేడు పేరుతో దోచుకున్నారు. గతంలో స్కూల్ విద్యార్థుల కోసం ఉంచిన సైకిళ్లను ఏం చేశారో తెలియదు. రోడ్లు వేయకుండా వేసినట్లు చూపి బిల్లులు తీసుకున్నారు. పోలవరంను ముంచారు, అమరావతిలలో మట్టి, ఇసుక, కంకరను కూడా వదలకుండా దోచుకెళ్లారు. వారిని వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలి.

జగన్ రెడ్డి సత్యహరిశ్చంద్రుడని  చెప్పుకుంటాడు. నేడు ఫైళ్ల దగ్ధంపై జగన్ రెడ్డి బయటకు వచ్చి మాట్లాడి సత్యశీలతను నిరూపించుకోవాలి. జగన్ తన అనునాంగులు ఏవిధంగా దోచుకున్నారో… తానే చెప్పాలి. నెల్లూరులో కోర్టుల్లో ఉన్న కాగితాలను కూడా కాకాణి  తగలబెట్టించాడు. వైసీపీ నేతల పాపాలు పండాయి. ప్రజా కోర్టులో తీర్పు ఇచ్చారు. అలాగే న్యాయస్థానంలో కూడా తీర్పు జరిగి వైసీపీ నేతలు కటకటాల్లోకి వెళితే తప్పా వారు చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం జరగదు.

నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తులకు అధికారులు సహకరించి ఫైళ్లను దగ్ధం చేస్తే మూల్యం చెల్లించుకుంటారు. ప్రతి డిపార్ట్ మెంట్ లో ఉన్న ఫైళ్లను భద్రపరచాలి. ఏ కాయితం బయటకు వెళ్లడానికి వీళ్లేదు. అక్రమంగా దోచుకుని నేడు ఫైళ్లను దగ్ధం చేస్తే వారి పాపం పోతుందనుకుంటున్నారేమో. ఇకనైనా అధికారులు ఏ ఫైళ్లు దగ్ధం చేశారో చెప్పి, ప్రజలకు మేలు చేయాలని హితవు పలికారు.