Mahanaadu-Logo-PNG-Large

పోలీసుల అదుపులో కారంపూడి సర్పంచ్‌

పల్నాడు జిల్లా కారంపూడి : ఇటీవల కారంపూడిలో జరిగిన టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య గొడవల నేపథ్యంలో కారంపూడి సర్పంచ్‌ రామావత్‌ తేజానాయక్‌ పాత్ర ఉందని భావించిన పోలీసులు గత మంగళవారం అర్థరాత్రి దాటాక మూడు గంటల సమయంలో ఇంటికి వచ్చి తీసుకు వెళ్లినట్లు సర్పంచ్‌ కుటుంబసభ్యులు చెబుతున్నారు. రెండురోజుల నుంచి తేజానాయక్‌ స్థానిక పోలీసుస్టేషన్‌లోనే ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. వాస్తవంగా పేటసన్నేగండ్ల గ్రామం పోతురాజుగుట్టలో జరిగిన గొడవల లో ఒక వైసీపీ కార్యకర్తను మాచర్ల వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరామర్శించడా నికి వస్తున్నారని తెలిసి ప్రోటోకాల్‌లో భాగంగా అక్కడకు వెళ్లినట్లు తెలుస్తుంది.

ఆ సమయంలో స్థానిక సత్యన్నారాయణ డాక్టర్‌ ఆసుపత్రి దగ్గర టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరగడంతో తేజానాయక్‌ను పోలీసులు సీసీ ఫుటేజ్‌ ఆధారంగా అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇదిలా ఉండగా సర్పంచ్‌ కుటుంబసభ్యులు మీడియాతో మాట్లాడుతూ తేజానాయక్‌కు ఆరోగ్య పరిస్థితి సక్రమంగా లేదని, అయన బీపీ, షుగర్‌తో బాధపడుతూ ఇటీవలే గుండె సంబంధిత వ్యాధితో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారని తెలిపారు. జరిగిన గొడవతో ఎటువంటి సంబంధం లేదని, పోలీసు లు వాస్తవాలు గ్రహించాలని కోరారు.