సర్పంచ్ కొడుకు 100 ఎకరాలు కబ్జా!

• స్థలం కోసం ప్రాణాలు తీసేందుకు వైసీపీ నేతల కుట్ర
• తెలంగాణ మద్యం ఇంట్లో పెట్టి అమ్మనియ్యలేదని మహిళపై వైసీపీ నేతల దాడి
• కొడాలి నాని అండ, అక్రమ రిజర్వేషన్ తో సర్పంచ్ గా అధికారం చెలాయింపు
• బుర్రా మధుసూదన్ యాదవ్ అనుచరుల అక్రమ కేసులతో ఇబ్బందులు… టీడీపీ కార్యకర్తలు మొర

మంగళగిరి, మహానాడు: ప్రకాశం జిల్లా, పెద్దారవీడు మండలానికి చెందిన భూ బాధితులు పెద్ద ఎత్తున ఇక్కడి తెలుగుదేశం పార్టీ(టీడీపీ) కేంద్ర కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన గ్రీవెన్స్‌కు విచ్చేశారు. గొట్టం శ్రీనివాసరెడ్డి, వేసపోగు సాల్మన్ రాజు, వేసపోగు రామయ్య, దుగ్గెం దానియేలు, వేసపోగు పెద్దయ్యలతో పాటు పలువురు బాధితులు నేతలకు అర్జీ ఇస్తూ తమ పట్టా భూములతో పాటు.. పెద్దారవీడు గ్రామంలో దాదాపు వంద ఎకరాల భూమిని సర్పంచ్ కుమారుడు దుగ్గెం చిన్న భాస్కర్ కబ్జా చేశారని ఆరోపించారు.

అధికారులు చర్యలు తీసుకొని భూములను అతని కబ్జా నుండి విడిపించాలని మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసయాదవ్, ఎమ్మెల్సీ అశోక్ బాబులను వేడుకున్నారు. అర్జీని స్వీకరించి మంత్రి అచ్చెన్నాయుడు వెంటనే అధికారులకు ఫోన్ చేసి విచారించి బాధితులకు న్యాయం చేసేలా చూడాలని ఆదేశించారు. మరోవైపు పలువురు నాయకులు కార్యకర్తలు అర్జీలతో పోటెత్తగా వారి నుండి పల్లా శ్రీనివాస్ అర్జీలు స్వీకరించారు. గ్రీవెన్స్ కు వచ్చిన నంద్యాల ఎంపీ శబరి వారి పార్లమెంట్ ప్రజల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు.

• బడుగు బలహీన వర్గాలు, మైనార్టీలు దాదాపు 1250 మంది ఉండే తమ నాలుగు గ్రామాలను కనపర్తి పంచాయతీ నుండి విడదీసి కొత్త పంచాయతీ ఏర్పాటు చేసి అభివృద్ధికి సహకరించాలని గత 29 ఏళ్ళ నుండి డిమాండ్ చేస్తుంటే.. గత టీడీపీ ప్రభుత్వంలో జీఓ వచ్చే సమయంలో వైసీపీ నేతలు అడ్డుకున్నారని తోపుపాలెం, పల్లెపాలెం, గోవిందరాజులపట్టపుపాలెం, మేకల సోమయ్యవారి పట్టపు పాలెం నుండి వచ్చిన పీత చంద్రశేఖర్, నటరాజ్, ఏసురత్నం, తుపాకుల సుబ్రహ్మణ్యంలు వినతి ఇచ్చారు. ఎన్నికల్లో లబ్ధికోసం వారి స్వలాభం కోసం ఈ గ్రామాలు పంచాయతీగా ఏర్పడకుండా చేశారన్నారు. పేదలు ఉండే ఈ నాలుగు గ్రామాలను ఒక పంచాయతీగా ఏర్పాటు చేసి అభివృద్ధి చేయాలని వేడుకున్నారు.

• అనంతపురం జిల్లా కణేకల్లు మండలానికి చెందిన కురభ లాలుమోహన్ నేతల ముందు కన్నీటితో ఆవేదనను వ్యక్తం చేస్తూ.. 70 సంవత్సరాలుగా తమ గ్రామంలో టీడీపీ తరఫున ఎవరూ పోటీచేయలేదని.. 2021 లో తాను మొదటిసారిగా టీడీపీ తరఫున సర్పంచ్ గా పోటిచేస్తే.. అప్పటి నుండి తనపై కక్షగట్టి.. తన పొలంలో ధాన్యం దొంగిలించారని.. ఇంట్లో ఉన్న టాక్టర్లు ఎత్తుకెళ్లారని.. ఆడవారిపై దాడులు చేశారని… ధాన్యం కొని కొందరూ డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని.. వారిపై చర్యలకు పోలీసులు చూట్టూ అనేక సార్లు తిరిగినా పట్టించుకోలేదని… తనకు న్యాయం చేస్తారని ఆశించి కేంద్ర కార్యాలయానికి వచ్చానని నేతల ముందు వాపోయాడు.

• ప్రకాశం జిల్లా పామూరు మండలం దాదిరెడ్డి పాలెం గ్రామానికి చెందిన అబ్బూరి శేషయ్య, భూమిరెడ్డిపల్లికి చెందిన చావా హరికృష్ణలు విజ్ఞప్తి చేస్తూ నాటి వైసీపీ ఎమ్మెల్యే ప్రస్తుత మాజీ ఎమ్మెల్యే బుర్రా మధుసూధన్ యాదవ్ సహకరాంతో 40 సంవత్సరాల నుండి తమ సాగులో ఉన్న భూమిని 22 a నుండి తొలగించి అక్రమంగా ఇతరులకు కట్టబెట్టారని… దాన్ని నిలదీసినందుకు అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టారని.. దాన్ని విచారించి తమపై అక్రమ కేసులు తొలగించాలని వేడుకున్నారు.

• కొడాలి నాని అండతో రెవెన్యూ అధికారులను తప్పుదోవ పట్టించి ఎస్సీలకు కేటయించిన సర్పంచ్ కోసం క్రిస్టియన్ మాల బీసీ –సి కి చెందిన తప్పిట ధనలక్ష్మి ఎస్సీ మాలగా ధ్రువీకరణ పత్రం పొంది సర్టిఫికేట్ తెచ్చుకున్నారని.. ఆమె చదువుకున్న సర్టిఫికేట్ నందు క్రిస్టియన్ బిసి-సి గా ఉందని.. దీనిపై అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని.. ఎస్సీలకు కేటాయించిన రిజర్వేషన్ ను అక్రమంగా అనుభవిస్తున్న ధనలక్ష్మిపై చర్యలు తీసుకోవాలని కృష్ణా జిల్లా నందివాడ మండలం తమిరశ గ్రామానికి చెందిన వెంకట రమణమ్మ నేతలకు ఫిర్యాదు చేశారు.

• మాచవరం మండలం మోర్జంపాడు గ్రామనికి చెందిన మరియమ్మ నేతల ముందు వాపోతూ.. తాను ఒంటరి మహిళనని దాంతో వైసీపీ నేతలు తెలంగాణ మద్యం తెచ్చి తన ఇంట్లో పెట్టి అమ్ముకోవడానికి యత్నిస్తే.. దాన్ని ఖండించానని తన ఇంటి తలుపులు పగలగొట్టి.. ఇంట్లో వస్తువులు ధ్వంసం చేశారని.. వారిపై పోలీస్ స్టేషన్ లో కేసు పెడితే పోలీసులు పట్టించుకోకుండా తననే 10 రోజుల నుండి పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతున్నారని ఆమె నేతల ముందు కన్నీరుమున్నీరైయ్యారు.

• ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గం సీతానాగులవరం గ్రామానికి చెందిన బోయపాటి అంకమ్మ విజ్ఞప్తి చేస్తూ.. నరసింహాపురం రెవెన్యూపరిధిలో తమకు అనువంశం ద్వారా వచ్చిన భూమిని ప్రభుత్వ ఉద్యోగి అయిన బారతుల వెంకట శ్రీనివాస శాస్త్రి అక్రమించుకున్నారని.. అతని ఆక్రమణ నుండి తమ భూమిని విడిపించి న్యాయం చేయాలని వేడుకున్నారు.

• పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం కండ్లకుంట గ్రామ పరిధిలో తమ భూమి 3.52 సెంట్లు కేశబోయిన అంజికి కౌలుకు ఇస్తే.. భూమి కౌలు ఇవ్వకుండా తమపైనే దౌర్జన్యానికి దిగారని.. పిన్నెల్లి వెంకటరెడ్డి చేత కొట్టించారని. గత ప్రభుత్వంలో ప్రాణాలు తీస్తారన్న భయంతో సొంత ఊరును వీడిచి పెట్టి మార్కాపురంలో బతుకుతున్నామని.. తమకు న్యాయం చేయాలని బాధితురాలు పిన్నెబోయిన రవణమ్మ వాపోయారు.

• కేంద్ర రాష్ట్రాల భాస్వామ్యంతో నిర్వహిస్తున్న వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ లో ఒప్పంద ప్రాతిపదికన నియమించబడిన తమకు గత 6 నెలల నుండి జీతాలు రావడంలేదని దాంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఏటీఎంఏ సిబ్బంది వారి సమస్యను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. జీతాల సమస్యను త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని మంత్రి వారికి హామీ ఇచ్చారు.

• స్మాల్ స్కేల్ గార్మెంట్ మేనిఫ్యాక్చర్ యూనిట్లను ఏర్పాటు చేసి.. స్టిచ్చింగ్ మిషన్, పవర్ కటింగ్ మిషన్, పవర్ ఖాజా మిషన్, పవర్ బటన్ మిషన్ లు అందించి.. గవర్నమెంట్ పిల్లలకు అందించే యూనిఫామ్ ను కుట్టేందుకు తమకు అవకాశం కల్పించాలని గార్మెంట్స్ మేనిఫెక్షర్ అసోసియేషన్ మహిళా సభ్యులు పలువురు మంత్రిని అర్జీకి ఇచ్చి అభ్యర్థించారు.

• ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆర్ ఏఆర్ఎస్ లు, కేవీకేలు సుమారు 3000 మంది కాంట్రాక్టు లేబర్స్ 15 ఏళ్ళపైబడి నుండి పనిచేస్తున్నామని.. తమకు ఎటువంటి పని భద్రత లేదని.. అతి తక్కువ కూలీతో పనిచేస్తున్నామని.. తమకు పని భద్రత కల్పించి వేతనం పెంచాలని వారు వేడుకున్నారు.

• గత పదిసంవత్సరాలుగా ఏపీఎస్‌ఎస్‌ఏఏటీ-ఆర్డీ సంస్థ లో డీఆర్‌పీలుగా ఎస్‌ పనిచేస్తున్న తమను ఉద్దేశపూర్వకంగా గత ప్రభుత్వంలో తొలగించారని… ఏపీఎస్‌ఎస్‌ఏఏటీ-ఆర్డీ డైరెక్టర్ గా ఉన్న జగదీష్ కుమార్ తమను ఉద్యోగాల్లో చేరకుండా అడ్డుకుంటున్నారని.. దయచేసి తమను ఉద్యోగాల్లో చేరేలా చర్యలు తీసుకోవాలని వారు మంత్రికి అర్జీని అందించారు.

తమ వారతసత్వ భూమిని అన్ లైన్ లో ప్రభుత్వ భూమిగా మార్చారిని కొందరు.. అన్ని పత్రాలు ఉన్నా పాసుపుస్తకాలు మంజూరు చేయడంలేదని మరికొందరు నేతలకు ఫిర్యాదు చేశారు. ఉద్యోగాలు ఇప్పిస్తానని హేమంత్ సుందర్ అనే వ్యక్తి మోసం చేశాడని కోలా రాజు నేతల ముందు ఆవేదన వ్యక్తం చేశారు.

మాచర్ల మండలం గాదెవారిపల్లి సబ్ స్టేషన్ లో పనిచేస్తున్న తనను ఉద్యోగం నుండి తొలగిస్తామని కొంత మంది నేతలు బెదిరిస్తున్నారని ఆవుల మంద వెంకటకాశిరావు వాపోయాడు. తనకు ఉద్యోగ భరోసా కల్పించాలని వేడుకున్నాడు. తన భూమిని కొట్టేసేందుకు వైసీపీ నేతలు తనను చంపాలని చూస్తున్నారని నూర్జహాన్ అనే వ్యక్తి గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారు.