లోకేష్ చొరవతో పాఠశాల పునఃప్రారంభం 

వినుకొండ (నూజెండ్ల), మహానాడు : విద్యార్థులు లేరన్న సాకుతో గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి కమ్మవారిపాలెం ప్రభుత్వ పాఠశాలను మూసివేశారు. దీంతో గ్రామంలోని విద్యార్థులు పాఠశాల లేక  సుదూర ప్రాంతాలకు వెళ్లి చదువుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో టీడీపీ గ్రామ నాయకులు గంగినేని రాధాకృష్ణ (బాబు), మేదరమెట్ల శ్రీనివాసరావు, పాస్టర్ ప్రభుదాస్ లు స్థానిక శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు సహకారంతో విద్య, ఐటీ శాఖ మాత్యులు నారా లోకేష్ ని కలిసి పాఠశాలను పునరుద్ధరించాలని కోరారు. దీనిపై స్పందించిన మంత్రి లోకేష్ వెంటనే కమ్మవారిపాలెం ప్రభుత్వ పాఠశాలను తిరిగి ప్రారంభించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పేద మధ్యతరగతి ప్రజలకు చదువుల సరస్వతిని దరి చేర్చేందుకు లోకేష్ చూపిన చొరవపట్ల గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.