సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తత అవసరం

– టీడీపీ నేత డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి

దర్శి, మహానాడు: సీజనల్‌ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) దర్శి నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. రాజంపల్లి గ్రామంలోని ఉన్నత పాఠశాలలో గురువారం ఉపాధ్యాయ దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై, మాట్లాడారు. ముందుగా సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి, ఘన నివాళులర్పించారు. విద్యార్థులకు పుస్తకాలు, ప్యాడ్స్ పంపిణీ చేసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా లక్ష్మి మాట్లాడుతూ వరదలు, తుపానులు వంటి విపత్తుల సమయంలో అందరూ మానవత్వంతో బాధితులను ఆదుకోవాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా వర్షకాలంలో వచ్చే వ్యాధుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మంచినీరు వేడి చేసుకుని చల్లార్చుకుని తాగాలన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అందరికీ స్ఫూర్తి ప్రదాతగా నిలుస్తున్నారని, ఏడు పదులు వయసు దాటినా ప్రజల సంక్షేమానికి పాటుపడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, రాజంపల్లి గ్రామ, నియోజకవర్గం లోని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.