2026 నాటికి పునరాభివృద్ధి పనులు పూర్తి
కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి రవ్‌నీత్ సింగ్
సికింద్రాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టు తరహాలో ప్రపంచ శ్రేణి ప్రమాణాలతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను ఆధునిక రైల్వే స్టేషన్‌గా తీర్చిదిద్దు తున్నామని కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి రవ్‌నీత్ సింగ్ పేర్కొన్నారు. సుమారు రూ. 700 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులను 2026 నాటికి పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఉన్నామని తెలిపారు. ఇప్పటి వరకు 27 శాతం పనులు పూర్తయ్యాయని చెప్పారు.
శనివారం దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్, తదితర రైల్వే అధికారులతో కలిసి రవ్‌నీత్ సింగ్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను సందర్శించి పునరాభివృద్ధి పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ, దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రూ. 5,000 కోట్లకు పైగా అంచనా వ్యయంతో 119 రైల్వే స్టేషన్లను అభివృద్థి చేస్తున్నట్టు తెలిపారు.
దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ మాట్లాడుతూ, హైదరాబాద్, కాచిగూడ రైల్వేే స్టషన్ల అభివృద్ధికి ప్రతిపాదనలు తుది దశలో ఉన్నాయని తెలిపారు. ఇదిలా ఉండగా..రైల్ నిలయంలో శనివారం కేంద్ర మంత్రి రవ్‌నీత్ సింగ్‌తో ఎంపీ ఈటల రాజేందర్ భేటీ అయ్యారు.