వేలమంది బలగాలతో పల్నాడుకు భద్రత

హింసను ప్రేరేపిస్తే పీడీ యాక్ట్‌ నమోదు
కఠినంగా 144 సెక్షన్‌ అమలు
పోలీసు కవాతులో ఎస్పీ మల్లికాగార్గ్‌

సత్తెనపల్లి: పట్టణంలో సీఆర్‌పీఎఫ్‌ బలగాలతో ఎస్పీ మల్లికాగార్గ్‌ కవాతు నిర్వహిం చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల వేళ పలనాడు జిల్లాలో చోటుచేసు కున్న హింస నేపథ్యంలో ప్రజల ఆస్తులు ధ్వంసం అయ్యాయని, శాంతిభద్రతలు అదుపుతప్పాయని అటువంటి చర్యలు పునరావృతం కాకుండా జూన్‌ 1 నుంచి జూన్‌ 5 వరకు పల్నాడు జిల్లాలో 144 సెక్షన్‌ కఠినంగా అమలుచేస్తున్నామని తెలిపారు. ప్రజలందరూ తప్పక సహకరించాలని కోరారు. ఎన్నికల ఫలితాల వేళ రోడ్‌షోలు, బాణసంచా కాల్చడం లాంటివి నిషేధించామని ఎవరైనా అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వేల మంది బలగాలతో పల్నాడు ప్రాంతం మొత్తాన్ని డేగ కంటితో కాపలా కాస్తున్నామని, ఎవరైనా హింసను ప్రేరేపిస్తే పీడీ యాక్ట్‌ ఓపెన్‌ చేస్తామని తెలిపారు. ఎన్నికల కౌంటింగ్‌ సజావుగా సాగేలా చూసి పల్నాడు గౌరవాన్ని నిలబెడదామని సూచించారు. అనంతరం బైండోవర్‌ కేసులు, రౌడీషీట్లు ఉన్నవాళ్లు, లోకల్‌ రాజకీయ నాయకులను పిలిచి కౌన్సెలింగ్‌ ఇచ్చారు.