స్వయం సహాయక సంఘాలు ఆదాయం పెంచుకోవాలి

– డీఆర్డీఏ పీడీ హరిహరనాథ్‌

గుంటూరు, మహానాడు: జిల్లాలోని 295 స్వయం సహాయక సంఘాలకు లఖ్ పతి దీదీ పథకం కింద బ్యాంకు రుణాలకు సంబంధించి రూ.38,06,00,000 చెక్కును కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, డీఆర్డీఏ పీడీ హరిహరనాథ్‌ ఆదివారం పంపిణీ చేశారు. చిరువ్యాపారాల ద్వారా జీవనోపాధులు మెరుగుపర్చుకున్న స్వయం సహాయక సంఘాల సభ్యులకు, అర్హత ఉన్న వారిని గుర్తించి లఖ్ పత్ దీదీ పథకం లబ్ధిని అందించిన సీఆర్పీలకు ప్రసంశ పత్రాలను అందించారు.

ఈ సందర్భంగా డీఆర్డీఏ పీడీ హరిహరనాథ్‌ మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయం సహాయక సంఘాల సభ్యులు సంవత్సరానికి కనీసం రూ. లక్ష ఆదాయం సంపాదించే లక్ష్యంతో ఈ పథకం ద్వారా వ్యాపారుల ఏర్పాటుకు రుణాలు అందిస్తున్నారన్నారు.

జిల్లాలో ఈ పథకానికి దాదాపు 52,442 మంది స్వయం సహాయ సంఘాల సభ్యులను లక్ష్యంగా నిర్దేశించామని, ఇప్పటికే వీరిలో 38,155 మందికి రుణాలు మంజూరుకు గుర్తించామని తెలిపారు. అంతకుముందు మహారాష్ట్ర లోని జలగామ్ లో జరిగిన లఖ్ పతి దీదీ పథకం సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్న కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం ను కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో కలెక్టర్, తూర్పు నియోజకవర్గ శాసనసభ్యుడు మహ్మద్ నసీర్ అహ్మద్ వీక్షించారు. ​కార్యక్రమంలో జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు శారమ్మ, డీఆర్డీఏ అధికారులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు పాల్గొన్నారు.