Mahanaadu-Logo-PNG-Large

ఉమ్మడి గుంటూరు నుంచి మంత్రుల రేసులో సీనియర్లు

సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఆశలు
కేబినెట్‌లో అదృష్టం ఎవరికి దక్కేనో..

(వాసిరెడ్డి రవిచంద్ర)

ఉద్దండుల జిల్లా గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీకి మరోసారి తిరుగులేని విజయాన్ని అందించింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో మొత్తం 17 అసెంబ్లీ నియోజకవర్గాలలో 16 చోట్ల టీడీపీ, ఒకచోట జనసేన విజయడంకా మోగించాయి. ఇక ఎన్నికలు ముగిసి విజయాల ప్రక్రియ ముగిశాక గెలిచిన సీనియర్‌ నేతలు, సామాజిక సమీకరణాల నేపథ్యంలో అనేకమంది సీనియర్లు మంత్రి పదవుల కోసం క్యూ కట్టారు. ప్రముఖ నేతలు ఉన్న ఈ జిల్లాలో ఈసారి మంత్రి వర్గంలో ఎవరికి స్థానం లభిస్తుంది అనేది చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా సీనియర్‌ నేత కాపు సామాజికవర్గానికి చెందిన కన్నా లక్ష్మీనారా యణ పేరు ఇందులో ప్రముఖంగా వినిపిస్తోంది. ఇక ఆయనతోపాటు ఎస్సీ సామాజికవర్గానికి చెందిన మనో సీనియర్‌ నాయకుడు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, రాజధాని ప్రాంతానికి చెందిన మరో సీనియర్‌ నాయకులు తెనాలి శ్రావణ్‌కుమార్‌ పేర్లు కూడా ప్రముఖంగానే మంత్రుల రేసులో వినిపిస్తున్నాయి.

ఇక ముస్లిం మైనార్టీలకు కోటాలో యువనేత నజీర్‌ మహమ్మద్‌ కూడా ఈ లిస్ట్‌ లో ఉన్నారు. అదేవిధంగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన సీనియర్‌ నేత, వినుకొండ ఎమ్మెల్యే జి.వి.ఆంజనేయులు, గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, మాచర్లలో ఎదురొడ్డి పోరాడి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై గెలిచిన జూలకంటి బ్రహ్మారెడ్డి, చిలకలూరిపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు, ఇంకా బీసీ సామాజికవర్గానికి చెందిన నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్‌ బాబు, రేపల్లె సీనియర్‌ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌, పొనూర్ను ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఇలా చాంతాడంత మంది ఉన్నారు. వీరంతా గుంటూరు జిల్లా నుంచి నూతనంగా ఏర్పడే చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో మంత్రి వర్గంలో చోటు కోసం ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు పార్టీ వర్గాలలో చర్చ నడుస్తుంది. అయితే సీనియర్‌ నేత కన్నా లక్ష్మీ నారాయణ, జి.వి.ఆంజనేయులు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. రాజకీయ చాణుక్యుడు చంద్రబాబు, యువనేతగా పార్టీని నడిపిస్తున్న లోకేష్‌ రానున్న కేబినెట్‌లో గుంటూరు నుంచి ఎవరికి స్థానం కల్పిస్తారు అన్నది క్లిష్టంగా మారిం ది. చంద్రబాబు ఈనెల 9న ప్రమాణ స్వీకారం రోజునే కొందరు మంత్రుల పేర్లు కూడా ప్రకటిస్తారని వార్తలు వస్తున్న నేపథ్యంలో మరి ఎవరికి ఈ అదృష్టం దక్కుతుందో కొంచెం వేచి చూడాల్సిందే.