2019 కంటే ఎక్కువగా సైలెంట్‌ ఓటింగ్‌

అణిచివేత వర్సెస్‌ ఆత్మాభిమానం మధ్య ఎన్నికలు
బలంగా ప్రజల్లోకి ల్యాండ్‌ టైటిలింగ్‌ ప్రచారాస్త్రం
కూటమి పొత్తును నిలబెట్టిన ప్రజలు

అమరావతి : ఈసారి సామాన్య ఓటరు అసలు భయపడలేదు. సైలెంట్‌ ఓటింగ్‌ ఎక్కువగా ప్రభు త్వాలకు వ్యతిరేకంగా జరుగుతుంది. ప్రజలకు పాలకులు ఏమి చేసినా, చేయకపోయినా హింస, అణిచివేత, అహంకారాన్ని మాత్రం తట్టుకోలేరు. ఎంత గొప్పవాడైనా మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఈ ఎన్నికలు హింస, అణిచివేత, అహంకారం వర్సెస్‌ ఆత్మాభిమా నం మధ్య జరిగాయి. మాములుగా అయితే టీడీపీ పొత్తులో చేసిన కొన్ని ప్రయోగాల వల్ల చాలా బలహీనం కావాలి కానీ, ప్రజలు బలహీనం కానివ్వలేదు. ప్రతిపక్షాన్ని నిలబెట్టుకున్నారు. అలాగే ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ మీద న్యాయవాదులు నిరసనలు, నిరాహారదీక్షలు చేశారు కానీ, ఎవరూ పట్టించుకోలేదు.

అది వాళ్ల సమస్య మాత్రమే అనుకున్నారు. నిజంగా ఆ సమయంలోనే ప్రతిపక్షాలు రచ్చ చేసి ఉంటే ప్రభుత్వానికి సమస్య పరిష్కారం చేసుకోవడానికి అవకాశం ఇచ్చినట్లు అయ్యేది. లాస్ట్‌ మూమెంట్‌లో ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ను ప్రతిపక్షాలు ప్రచారాస్త్రంగా తీసుకోవడంతో ప్రజల్లోకి బలంగా వెళ్లింది. దానిని షార్ట్‌ అవుట్‌ చేసుకునే సమయం ప్రభుత్వానికి దొరకలేదు. ఈ అంశం కూడా ప్రజల మీద బాగా ప్రభావం చూపింది. ప్రజాస్వామ్యంలో హింసకు, అణిచివేతకు, అహంకారానికి తావు లేదు. కనుక పాలకులు ఎప్పుడూ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.