బానిసత్వం పోయింది..స్వాతంత్రం వచ్చింది

-సెబ్ విభాగం రద్దు హర్షణీయం
-ఎక్సైజ్ శాఖ పునరుద్ధరణ సాహసోపేత నిర్ణయం
-ప్రభుత్వ ఆదాయం పెంచుతాం…
-గంజాయి కట్టడికి శ్రమిస్తాం
-ముఖ్యమంత్రికి, మంత్రివర్గానికి ధన్యవాదాలు
-ఆంధ్రప్రదేశ్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ఉద్యోగుల జేఏసీ నాయకులు

విజయవాడ : గత ప్రభుత్వ స్వార్థ ప్రయోజనాల కోసం ఎక్సైజ్ శాఖ ఉద్యోగులను, రాష్ట్ర ప్రయోజనాలను బలిపెట్టి ఏర్పాటుచేసిన సెబ్ విభాగం రద్దు, ఎక్సైజ్ శాఖ పునర్ధరణ చేస్తూ కూటమి ప్రభుత్వం మంత్రివర్గ సమావేశంలో చేసిన తీర్మానం హర్షణీయమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ ఉద్యోగుల జేఏసీ నాయకులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

గాంధీ నగర్ లోని ఏపీ ఎన్జీజీవో అసోసియేషన్ భవనం లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర జనరల్ సెక్రటరీ బి. నరసింహులు మాట్లాడుతూ ఎక్సైజ్ శాఖ ఉద్యోగుల ఆకాంక్షలను మన్నించి ఈ విభాగాన్ని రద్దు చేసేందుకు ప్రజాస్వామ్యబద్ధంగా నిర్ణయాన్ని ప్రకటించిన నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ లకు ధన్యవాదాలు తెలిపారు. గత ప్రభుత్వం తమ వ్యక్తిగత స్వార్థం కోసం ఎక్సైజ్ శాఖను కోరలు లేని పాములా మార్చిందన్నారు.

దాని ఫలితమే ఐదేళ్లలో రాష్ట్రంలో విచ్చలవిడిగా గంజాయి వినియోగం పెరగడానికి కారణమైందని వివరించారు. సాధారణంగా ఏదైనా ఒక కొత్త విభాగాన్ని ఏర్పాటు చేయడం లేదా ఉన్న విభాగాలను విభజించడం వంటి చర్యలు తీసుకునే ముందు ప్రభుత్వం ఆయా విభాగాల ఉద్యోగులతో, మంత్రివర్గంతో చర్చించడం ప్రజాస్వామ్య దేశంలో సాధారణంగా జరిగేదన్నారు. కానీ గత ప్రభుత్వం ఒక రాచరికపు పోకడలతో ఎవరితోనూ చర్చించకుండా స్వార్థమే పరమావధిగా తీసుకున్న నిర్ణయాలతో రాష్ట్రంలో నేరాల శాతం పెరిగిందని గణాంకాలతో వివరించారు.

గత ప్రభుత్వ పాలన కాలంలో గంజాయితోపాటు ఇతర మత్తు పదార్థాలు కూడా విస్తృత స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి రావడం వల్ల ఎన్నో కుటుంబాలు నష్టపోయాయన్నారు. గత ప్రభుత్వ పాలనా కాలంలో ఎంతోమంది సమర్ధులైన అధికారులను నిమిత్తమాత్రులుగా మార్చి పాలకులు వారి అనుయూయులను కీలకమైన స్థానాల్లో కూర్చోబెట్టి ఇష్టానుసారంగా శాఖను నిర్వీర్యం చేశారన్నారు. ఎక్సైజ్ శాఖ పునరుద్ధరణ వల్ల రాష్ట్రానికి ఆదాయం కూడా పెరుగుతుందన్నారు.

2014-19 మధ్య కాలంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఆదాయం, 2019-24 మధ్య కాలంలో ఉన్న ఆదాయ గణాంకాలను బేరీజు వేసుకుంటే గత ప్రభుత్వ పాలనలో ప్రభుత్వానికి ఆదాయం తగ్గి కొంతమంది వ్యక్తులకు ఆదాయం పెరిగిన విషయం రాష్ట్ర ప్రజలు గమనించారని చెప్పారు. సెబ్ విభాగం ఏర్పాటు చేయడం వల్ల జరుగుతున్న నష్టాలను గత ప్రభుత్వానికి తాము ఎన్నోసార్లు తెలియజేసేందుకు ప్రయత్నించామన్నారు. కానీ స్వార్థపూరితమైన ఆలోచనలతో ఉన్న ప్రభుత్వ పాలకులు తమ విజ్ఞప్తిని మన్నించలేదన్నారు.

జేఏసీ చైర్మన్ ఎస్. వి. వి. బాబ్జీరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన నెలల వ్యవధిలోనే ఎక్సైజ్ శాఖ ఉద్యోగుల అభీష్టానికి అనుగుణంగా నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం శాఖ ఉద్యోగుల సమస్యలను కూడా పరిష్కరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. స్వాతంత్రానంతరం ఎన్నో ప్రభుత్వాలు ఏర్పడినప్పటికీ, ఇంత నిరంకుశంగా పరిపాలించిన దాఖలాలు చరిత్రలో లేవన్నారు. ప్రధానంగా సెబ్ విభాగం ఏర్పడిన తర్వాత తమ శాఖలో పదోన్నతులు కూడా నిలిపివేయడం గత ప్రభుత్వ అనైతిక విధానాలకు పరాకాష్ట అన్నారు.

సెబ్ విభాగం ఏర్పాటు చేసిన గత ప్రభుత్వం ఈ విభాగానికి ఎటువంటి హక్కులు లేకుండా కేవలం నిందితులను బంధించి సమీపంలోని పోలీస్ స్టేషన్ లకు అప్పగించాలనే నిబంధనను అమలు చేయడం తప్ప ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం కూడా లేకుండా శాఖను ఒక నైరాస్యంలోకి నెట్టివేసిందన్నారు.

కో చైర్మన్ మార్పు కోటయ్య మాట్లాడుతూ బానిస సంకెళ్లు పోయి స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో బాధ్యతలు నిర్వహించేందుకు అవకాశం కల్పించిన ప్రభుత్వ పెద్దలందరికీ శాఖ ఉద్యోగుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. మధ్యయుగం కాలంలో 14వ ఫ్రెంచ్ రాజు లూయిస్ అనే చక్రవర్తి నేనే రాజ్యం, చెప్పిందే శాసనం అనే తరహాలో పరిపాలించినట్లే గత ప్రభుత్వ పాలన ఉందన్నారు.

కానీ అటువంటి అవకాశం స్వాతంత్రం తరువాత దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేదన్నారు. తన స్వార్థం కోసం ఆనాటి చక్రవర్తులు సంప్రదింపులు లేకుండా ఒక చట్టాన్ని తీసుకువచ్చి ప్రజలను వేధించినట్లే గత ప్రభుత్వం కూడా దశాబ్దాల తరబడి ఉన్న ప్రభుత్వ విభాగాలను అడ్డుపెట్టుకొని తమ స్వార్ధ ప్రయోజనాలను కాపాడుకోవడం సాధ్యం కాదని ఆయా విభాగాలను నిర్వీర్యం చేయడం లేదా వాటిని విభజించి తమ ప్రయోజనాలను నెరవేర్చుకున్నాయని తెలిపారు.

తమకు సంబంధం లేని, ఇసుక, మట్కా వంటి నేరాలనరికట్టాలని గత ప్రభుత్వం తమను ఎంతో వేధించిందన్నారు. గత ఐదేళ్లలో తాము బానిసల్లా బతికామన్నారు. సెబ్ విభాగం రద్దు చేసిన తర్వాత తాము స్వేచ్ఛాయుత ఉద్యోగ జీవితం లోకి వచ్చినట్లుగా ఉందన్నారు.

రానున్న రోజుల్లో ఎక్సైజ్ శాఖ ద్వారా రాష్ట్రానికి ఆదాయం పెంపొందించడం, మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టడమే లక్ష్యంగా ఎక్సైజ్ శాఖ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా బాధ్యతలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. సమావేశంలో వైస్ చైర్మన్లు వి.వి.వి.ఎస్.ఎన్. వర్మ, రేణుక, పి. రామచంద్రరావు రాష్ట్రస్థాయి నాయకులు పాల్గొన్నారు