– అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని గౌరవించడం లేదు
– ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు
ఉండి, మహానాడు: కులరహితమైన క్రైస్తవ మతంలో కొనసాగుతూ, తాము దళితులమని చెప్పుకునేవారు నిజమైన క్రైస్తవులు కాదని, అలాగే అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఆచరించని వారు కూడా అంబేద్కర్ వారసులు కాదని ఉండి శాసన సభ్యుడు రఘురామకృష్ణం రాజు అన్నారు. ఏ రాజకీయ నాయకుడు కూడా ఇంత ధైర్యంగా ఈ మాటలను చెప్పరని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. అంబేద్కర్ అంటే తనకు అపారమైన గౌరవం ఉందని, ఆయన రాసిన రాజ్యాంగాన్ని అనుసరించమని మాత్రమే చెబుతున్నానని వెల్లడించారు.
నిజమైన క్రైస్తవులైతే వారికి కులం ఉండదని, బీసీ(సి) గా పరిగణించబడతారని, అటువంటప్పుడు ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు కోసం వారు ఎలా ఫిర్యాదు చేస్తారన్నారు. అటు పూర్తిగా క్రైస్తవ మతాన్ని ఆచరించకుండా, ఇటు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అనుసరించకుండా కొంతమంది త్రిశంకు స్వర్గంలో ఉంటున్నారన్నారు . రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఏ ఒక్కరి సొంతం కాదని, యావత్ దేశ ప్రజల సొంతమని అన్నారు. ఎస్సీ, ఎస్టి అట్రాసిటీ చట్టం కింద ఫిర్యాదు చేయగానే, ఫిర్యాదుదారులకు పాతిక వేల రూపాయలను ఇస్తారన్నారు. గతంలో నాపై అర్హత లేని వారే ఎక్కువగా ఈ చట్టం కింద కేసు నమోదు కోసం ఫిర్యాదు చేశారన్నారు.
హవ్వ… మందకృష్ణ, నేను జగన్మోహన్ రెడ్డి కోవర్టా?
ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడిన మందకృష్ణ మాదిగ, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిన తప్పులను ఎత్తి చూపి , వైకాపా ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెట్టిన నేను జగన్మోహన్ రెడ్డి కోవర్టునని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందని రఘురామ కృష్ణంరాజు విమర్శించారు. నేను జగన్మోహన్ రెడ్డికి కోవర్ట్ నని పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. మందకృష్ణ మాదిగ ను ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి అక్కున చేర్చుకున్నారా ? అని ప్రశ్నించారు.
ఎస్సీ వర్గీకరణకు మద్దతు ప్రకటించారా అని నిలదీశారు. కోర్టు తీర్పు వర్గీకరణకు అనుకూలంగా వస్తే, అందులో రాజకీయ నాయకులకు ఏమిటి సంబంధమన్నారు. మందకృష్ణ మాదిగ నాకు మంచి మిత్రులు. మాదిగల కోసం పోరాడిన ఆశాజ్యోతి. మరి ఎలా మందకృష్ణ మాదిగ ను జగన్మోహన్ రెడ్డి కోవర్ట్ అని ఎలా అంటారని ధ్వజమెత్తారు. నిన్న ఒకరు మాట్లాడగానే మంగళవారం సాక్షి దినపత్రికలో పెద్ద కథనాన్ని ప్రచురించారు. రఘురామ కృష్ణంరాజుకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలని సాక్షి దినపత్రిక వార్తా కథనాన్ని ప్రచురించడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
తణుకులో ఐదు మంది న్యాయవాదులు, మరోచోట పదిమంది కూడా పాల్గొనక పోయినప్పటికీ , రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టినట్టుగా సాక్షి దినపత్రికలో హాస్యాస్పదంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డికి నేను కోవర్ట్ అయితే అతనిపైనే తాను కేసు ఎందుకు పెడతానని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. లాకప్ లో తనని చిత్రహింసలకు గురిచేసిన కేసు లో జగన్మోహన్ రెడ్డి A3 గా ఉన్నారని గుర్తు చేశారు. ఈ మాట్లాడే వారు ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి పై కేసును పెట్టారా? అని నిలదీశారు. ఇప్పటికైనా ఈ మాట్లాడే వారు తమకు ఉన్న విలువను తీసుకోవద్దని, గౌరవాన్ని కాపాడుకోవాలని సూచించారు. నన్ను జగన్మోహన్ రెడ్డి కోవర్ట్ అని పేర్కొనడం చూస్తే, చక్కిలిగింతలు పెట్టి నవ్వేసుకున్నట్టుగా ఉందన్నారు.
సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను కూడా జగన్మోహన్ రెడ్డి కోవర్ట్ అని అంటారేమోనని ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డికి కోవర్ట్ అంటే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకులు అన్నట్టే కదా అని ఆయన సెటైర్ వేశారు. పవన్ కల్యాణ్‌తో పాటు ఆయన పార్టీ తరపున పోటీ చేసిన వారిని ఓడిస్తామని సవాళ్లు చేసిన ఒక వ్యక్తి , కనీసం వారి షర్ట్ బటన్లను కూడా ఊడబీక లేకపోయారన్నారు. జనసేన తరఫున చాలా మంది 50 వేలకు పైగా మెజారిటీతో గెలిచారని, ఇక ఏకంగా పవన్ 75 వేల మెజారిటీతో గెలిచారని గుర్తు చేశారు.
క్రైస్తవ మతంలోకి మారిన వారికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద ఫిర్యాదు చేసే అర్హత లేదు
దళితులు ఎవరైతే క్రైస్తవ మతంలోకి మారుతారో వారికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు కోసం ఫిర్యాదు చేసే అర్హత లేదని రఘురామకృష్ణం రాజు తెలిపారు. క్రైస్తవ, ఇస్లాం మతాలలో కులం అనేది ఉండదని, కులరహితమైన క్రైస్తవ మతంలో కొనసాగే వారు దళితులుగా ఎలా పరిగణింపబడుతారని ప్రశ్నించారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోనే మతం మారిన వారికి బీసీ- సీ సర్టిఫికెట్ ను జారీ చేయనున్నట్టు గా స్పష్టంగా పేర్కొనట్టు తెలిపారు. రాజమండ్రి మాజీ ఎంపీ హర్ష కుమార్ ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్నారని, రాజ్యాంగంలో ఉన్నదే నేను చెబుతున్నానని, ఈ విషయం హర్ష కుమార్ కు కూడా తెలిసి ఉంటుందన్నారు. రాజ్యాంగంలో ఉన్నది చెబితే బెదిరిస్తారా? రాజ్యాంగాన్ని గౌరవించమని చెప్పడమే నేరమా?? అని ప్రశ్నించిన ఆయన, నాపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తారా?, లేకపోతే ఊరుకోమని హెచ్చరికలు చేస్తారా?? అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
అసలు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం గురించి చాలామందికి తెలియదని పేర్కొన్నారు. అంబేద్కర్ గురించి నేను ఎంతో గొప్పగా ఎప్పుడూ మాట్లాడుతానని, ఏలూరుపాడులో జరిగిన సంఘటనకు అంబేద్కర్ ను అవమానించానని పేర్కొనడానికి అసలు సంబంధం ఏమిటనీ ప్రశ్నించారు. నాగేంద్ర స్వామి దేవాలయానికి అడ్డుగా ఉన్న ఫ్లెక్సీ కర్రను తొలగించి, ఫ్లెక్సీ ని భద్రంగా పక్కన పెట్టడం ద్వారా, అంబేద్కర్ ను ఎలా అవమానించినట్లు అవుతుందని నిలదీశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు కూడా ఉన్నప్పటికీ వక్రీకరించి మాట్లాడడం సిగ్గుచేటని విమర్శించారు. అదే పని పోలీసుల చేత చేయించవచ్చు కదా? అని కొంతమంది పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజా ప్రతినిధి అంటే పబ్లిక్ సర్వెంట్ కదా? అని రఘురామ కృష్ణంరాజు నిలదీశారు.
సమాజంలో ఏదైనా జరిగినప్పుడు సరిదిద్దాల్సి వస్తే, సరిదిద్దకపోతే అది తప్పు అవుతుందని అన్నారు. అయినా చిత్తూర్, కర్నూలు జిల్లాలలో ఫిర్యాదు చేసి, నాపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. అసలు ఈ సంఘటన తో ఎటువంటి సంబంధం లేకుండా ఫిర్యాదు చేసే వారికి ఫిర్యాదు చేసే అర్హత ఉందా అని ప్రశ్నించారు. అంబేద్కర్ కొందరివాడు కాదని, అందరివాడు అని గుర్తు చేశారు. రాజ్యాంగ నిర్మాతగా ఆయన్ని మేము ఎంతో గౌరవిస్తామన్నారు.
రాజకీయాలలో పవన్ కల్యాణ్ రేర్
రాజకీయాలలో జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, నాలాంటి వ్యక్తులు అరుదని పేర్కొన్న రఘురామకృష్ణం రాజు, మేము రాజకీయాలకు ఎందుకొచ్చమో తెలియదన్నారు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడమే మా నైజం అని పేర్కొన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని గౌరవించడం అంటే, అంబేద్కర్ ను గౌరవించినట్లననే చెప్పారు. రాజ్యాంగాన్ని తూచ తప్పకుండా పాటించాలని సత్ సత్సంకల్పం నాకు ఉందన్న ఆయన, మత మార్పిడి అనంతరం కూడా తమని దళితులుగా కొనసాగించాలంటూ వీలైతే చట్టాన్ని మార్చాలని మళ్లీ అడగమని సూచించారు. గతంలో మీరు ఇదే విషయమై న్యాయ స్థానాన్ని ఆశ్రయించగా, కేంద్ర ప్రభుత్వం కుదరదని తెగేసి చెప్పిందన్నారు. మేం మతం మారినప్పుడు దళితులం కాకుండా పోతామా అని ప్రశ్నించగా, కులరహిత మతంలో కొనసాగుతూ, కులాన్ని ఆచరిస్తామంటే కుదరదన్నారు. దానికి రాజ్యాంగ సవరణ చేయాలని గుర్తు చేశారు.
పనికి మాలిన వాళ్ల ప్రచారాన్ని విజ్ఞానవంతులని చెప్పుకునే వారు సమర్థించడం హాస్యాస్పదం
ఏలూరుపాడు లో జరిగిన సంఘటనలో నిజాలను కప్పిపెట్టి ఇటీవల కొంతమంది అసహ్యంగా అబద్దాలను ఆడుతున్నారని రఘురామ కృష్ణంరాజు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు . పనికిమాలిన వాళ్ళు చేస్తున్న అబద్ధపు ప్రచారాన్ని, సమాజంలో విజ్ఞానవంతులుగా చెప్పుకునేవారు దున్నపోతు ఈనిందంటే, దూడను కట్టేయమన్నట్లుగా నమ్మడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
ఒక మాజీ ఎంపీ, నన్ను ఏక వచనంతో అరే విగ్గు అని సంబోధించడం సిగ్గుచేటన్న ఆయన , నేను అంతకంటే అసహ్యంగా అనగలనని కానీ సంస్కారం అడ్డు వస్తుందన్నారు. కొంతమందికి రాజ్యాంగం రక్షణ కల్పించిందని, క్రైస్తవ మతంలో కొనసాగుతున్నప్పటికీ రక్షణ లేకపోయినా, రక్షణ కవచాన్ని ఉపయోగించుకుంటున్నారు. కుల ధ్రువీకరణ పత్రాలు రద్దయ్యే వరకు ఇలాగే మాట్లాడుతారన్నారు. ఏలూరుపాడు లో సిఐఎస్ చర్చి వ్యవస్థాపకులలో ఒకరైన వ్యక్తి, ఏలూరుపాడు లో ఇద్దరు పనికిమాలిన వాళ్లు చేసిన పనికి సహకరించినందుకు వీడియో ద్వారా సారీ చెప్పి స్టేట్మెంట్ విడుదల చేశారన్నారు.
జర్నలిస్టు సాయి కూడా అక్కడ జరిగిన సంఘటన గురించి తన ఛానల్ లో పేర్కొనడమే కాకుండా వీడియో కూడా, ప్రదర్శించారని తెలిపారు. నాగేంద్ర స్వామి దేవాలయానికి అడ్డంగా ఉన్న ఫ్లెక్సీ ని మాత్రమే భక్తుల కోరిక మేరకు తాను తొలగించడం జరిగిందని పేర్కొన్న రఘురామ కృష్ణంరాజు , మీ దేవుడు జోలికి మేం రామని, మా దేవుడు జోలికి మీరు రావద్దని కోరారు. ఏలూరుపాడు లో జరిగిన సంఘటన గురించి పచ్చి అబద్దాలను ప్రచారం చేస్తున్నప్పటికీ, నేడో, రేపో నిజాలను తెలుసుకుంటారు లే అని ఊరుకుంటుంటే, అదే పనిగా అబద్దాలను మాట్లాడుతున్నారని మండిపడ్డారు..
లడ్డూ కల్తీపై పచ్చి నిజాలను బయట పెట్టిన ముఖ్యమంత్రి
తిరుమల శ్రీవారి లడ్డూలో జరిగిన కల్తీని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బయట పెట్టడమే కాకుండా ప్రక్షాళనకు చర్యలు తీసుకున్నారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ప్రస్తుతం లడ్డు పూర్తిగా స్వచ్ఛమైనదని పేర్కొన్నారు. ఈ కూటమి ప్రభుత్వంలో, ఎటువంటి తప్పిదాలకు చోటు ఉండదని ఆయన భరోసానిచ్చారు. లడ్డు కల్తీ అయినందుకు, దేవాలయ సంప్రోక్షణ కార్యక్రమాలను నిర్వహించాలని టీటీడీ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ 11 రోజుల దీక్షను ఒక సాధువులా, మునిలా చేపట్టారని పేర్కొన్నారు.
గతంలో తాను కూడా సనాతన స్వదేశీ సేన అనే సంస్థను స్థాపించినట్టు వెల్లడించారు. ఢిల్లీలో ఉన్న తాను, రాష్ట్రంలోని అన్ని దేవాలయాలను సందర్శించాలని భావించానని తెలిపారు. కానీ జగన్ మోహన్ రెడ్డి తనకు రాష్ట్ర బహిష్కరణ విధించడం వల్ల, రాష్ట్రంలోని దేవాలయాలను సందర్శించలేకపోయానని చెప్పారు. సనాతన ధర్మంపై అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని పవన్ కల్యాణ్ పేర్కొనడం అభినందనీయమన్నారు.
పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ పార్టీ అధినేతగా, ఈ విధంగా మాట్లాడడం చాలా కష్టమని పేర్కొన్నారు. ఒక విధంగా చెప్పాలంటే రాజకీయంగా తన బారియర్స్ దాటి ఆయన మాట్లాడారని, దానికి హ్యాట్సాఫ్ చెబుతున్నట్లుగా పేర్కొన్నారు. గతంలో పార్లమెంట్లో నేను కూడా హిందూ బోర్డు ఏర్పాటు చేయాలని కోరానని తెలిపారు. ముస్లింలకు వక్ఫ్ బోర్డు, క్రిస్టియన్లకు బోర్లు ఉన్నట్లుగానే హిందువులకు బోర్డు ఉండాలని మాట్లాడిన ఏకైక ఎంపీ తానేనని పేర్కొన్నారు. హిందువుల ఆస్తులను తీసుకుంటున్నారని, ఎందుకు తీసుకోవాలని పార్లమెంటు వేదికగా ప్రశ్నించానన్నారు. ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులను కలిసి వివరాలన్నీ అందజేశానని తెలిపారు. ఒక రాజకీయ పార్టీ అధినేత అయిన పవన్ కళ్యాణ్ తాను విశ్వసించే మతం గురించి మాట్లాడు తూనే, ఇతర మతాలను గౌరవించారని రఘురామకృష్ణం రాజు తెలిపారు.
విజయ పాల్ కు జైలు యోగం
లాకప్ లో నన్ను చిత్రహింసలకు గురి చేసిన కేసులో ఇన్వెస్టిగేషన్ అధికారిగా ఉన్న అప్పటి ఎస్పీ , ప్రస్తుత రిటైర్డ్ పోలీస్ అధికారి విజయ్ పాల్ కు జైలు యోగం ఖాయమని రఘురామకృష్ణంరాజు తెలిపారు. విజయ్ పాల్ దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటీషన్ ను కోర్టు కొట్టి వేసిందన్నారు . ముందస్తు బెయిల్ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విజయ్ పాల్, మూడుసార్లు వాయిదా కోరారని చెప్పారు.
ముందస్తు బెయిల్ కోసం విజయ్ పాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ లూత్ర, ఇంప్లీడ్ పిటిషన్ ద్వారా ఉమేష్ చంద్ర నా తరఫున అద్భుతంగా వాదనలను వినిపించారన్నారు. న్యాయస్థానం ఈరోజు విజయ్ పాల్ కు ముందస్తు బెయిల్ ఇవ్వడం కుదరదని స్పష్టంగా తేల్చి చెప్పిందన్నారు. ఈ కేసు ముందుకు వెళ్లడం లేదని కొంతమంది పేర్కొంటున్నారని, విజయ్ పాల్ బెయిల్ పిటిషన్ వేసినందు వాళ్లే కేసు ఆలస్యం అయ్యిందన్నారు. బెయిల్ పిటిషన్ పై కోర్టు తీర్పు ఇచ్చేవరకు, విజయ్ పాల్ ను అరెస్టు చేయడానికి వీలు లేదన్నారు.
నన్ను హైదరాబాద్ నుంచి ఎత్తుకు వెళ్లి బయటి వ్యక్తులను పిలిపించి కొట్టించిన వ్యక్తి విజయ్ పాల్ అని పేర్కొన్నారు. వెదవ పనులన్నీ చేసిన విజయ్ పాల్ లేకుండా కేసు ముందుకు వెళ్లడం కష్టం అని పేర్కొన్న రఘురామకృష్ణంరాజు, అందుకే ఇంత ఆలస్యం జరిగిందన్నారు. ఇక ఇప్పుడు కేసు విచారణ వేగవంతం అవుతుందని పేర్కొన్న ఆయన, రేపో, మాపో విజయ్ పాల్ పోలీసులకు దొరికేస్తాడన్నారు. కేసు వేగాన్ని పుంజుకుంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
బోత్ ఆర్ సేమ్… జత్వాని, నా కేసు ఒకటే
సినీ నటి కాదంబరీ జత్వాని, నా కేసు ఒకటేనని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. కాకపోతే ఆమె మహిళ అని నేను పురుషుడినని పేర్కొన్నారు. ఈ రెండు కేసులు ఒకటేనని పేర్కొన్నారు. ముందుగా మనుషులను పంపి ఎత్తుకొచ్చి తరువాత ఎఫ్ఐఆర్ నమోదు చేసి, పక్క రాష్ట్రాల నుంచి ఎత్తుకొచ్చారని తెలిపారు. ఈ రెండు కేసులలో పోలీసు అధికారులు వ్యవహరించిన తీరు ఒకే విధంగా ఉందని చెప్పారు.
లాకప్ లో నాలాగా జత్వాని ని కొట్టి ఉంటే ఆ అమ్మాయి చచ్చిపోయి ఉండేదన్నారు. నన్ను చంపాలనే ఉద్దేశ్యంతో చిత్రహింసలకు గురి చేశారని, ఆ అమ్మాయిని ఇతరులను రక్షించడం కోసం వేధింపులకు గురి చేశారన్నారు. నన్ను దారుణంగా చిత్రహింసలకు గురిచేసిన కేసు త్వరలోనే కొలిక్కి వస్తుందని తెలిపారు. ఇప్పటికే నా కేసులో ముద్దాయిగా ఉన్న సీనియర్ పోలీసు అధికారి సీతారామాంజనేయులు, జత్వానిని వేధించిన కేసు సస్పెండ్ అయ్యారని గుర్తు చేశారు.
పీవీ సునీల్ కుమార్ సస్పెండ్ ఖాయం
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సిఐడి చీఫ్ గా వ్యవహరించిన పివి సునీల్ కుమార్ త్వరలోనే సస్పెండ్ కావడం ఖాయమని రఘురామ కృష్ణంరాజు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అంబేద్కర్ మిషన్ ఇండియా ( ఏఐఎం ) సంస్థను సర్వీస్ రూల్స్ కు విరుద్ధంగా నిర్వహిస్తున్నప్పటికీ, అతన్ని పాలకులు ఏ కారణం చేత క్షమిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. ఉద్యోగం చేసుకునే వ్యక్తి ఉద్యోగం చేసుకోవాలన్నారు.
అప్పుడప్పుడు నాపై ట్విట్లు సంధించే సునీల్ కుమార్, నన్ను లాకప్ లో చిత్రహింసలకు గురిచేసిన కేసులో ప్రధాన ముద్దాయిల్లో ఒకరని పేర్కొన్నారు. అలాగే మెడికల్ వృత్తికి కళంకం తెచ్చిన గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి అప్పటి సూపరిండెంట్ ప్రభావతిని కూడా సస్పెండ్ చేయనున్నారన్నారు. ఈ కేసులో నన్ను చిత్రహింసలకు గురి చేసిన తర్వాత నేను కిందకు నడుచుకుంటూ వచ్చి నన్ను బాగా చూసుకున్నారని, జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడడం తన తప్పని క్షమించాలని ఇద్దరు ఎమ్మార్వోల ముందు ఒప్పుకున్నట్లుగా నివేదికను ఇచ్చారన్నారు.
అసలు ఆ ఇద్దరు ఎమ్మార్వోలు ఎవరు అని ప్రశ్నించిన ఆయన, ఈ నివేదికను నా వద్దకు తెచ్చిన వ్యక్తి ఎయిడ్స్ వచ్చి మృతి చెందాడన్నారు . ఈ కేసులో త్వరలోనే అందరూ బయటకు వస్తారని, దారుణమైన అరాచకాన్ని చేసి దొరికేశారన్నారు. ఈ వెధవ పనులన్నీ చేసిన వ్యక్తులకు బుద్ధి రావడం కోసమే ఈ ఇష్యూ ని ఇంత సీరియస్ గా తీసుకుని పోరాడుతున్నానని రఘురామకృష్ణంరాజు పేర్కొన్నారు.
ఒక శిశుపాలుడు, కంసుడి వంటి రాక్షసుడు జగన్మోహన్ రెడ్డి
పాలకుడు అంటే ఎలా ఉండాలో తెలియకుండా ఒక శిశుపాలుడు, కంసుడు ఎలాగైతే అరాచకాలు చేశారో, జగన్మోహన్ రెడ్డి అనే రాక్షసుడు కూడా అలాగే అరాచకాలను చేశారని రఘురామ కృష్ణంరాజు విమర్శించారు. ఎటు వెళ్లిన తిరుపతి ప్రస్తావనే వస్తుందని పేర్కొన్న ఆయన, తొలుత జగన్మోహన్ రెడ్డికి నాకు తిరుమల తిరుపతి దేవస్థానం భూముల విక్రయంలోనే విభేదాలు తలెత్తాయని అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తులు ఇచ్చిన భూములను విక్రయించవద్దని చెప్పినందుకే జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా హార్ట్ అయ్యారని తెలిపారు. భూముల విక్రయం కోసం జారీ చేసిన జీవోను రద్దు చేయాలని సూచించగా, నా పార్లమెంట్ సభ్యత్వం క్యాన్సల్ చేయాలని అతడు ప్రయత్నాలు చేశాడని తెలిపారు. ఆ తరువాత భయపడి జీవోను రద్దు చేసినప్పటికీ, తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దోచుకోవడానికి తప్ప జగన్మోహన్ రెడ్డి ఏనాడు సద్భావనతో పని చేయలేదన్నారు.
స్వామిని దోపిడీ చేయడానికి చేసిన అతడి ప్రయత్నాలకు అడ్డుపడినందుకే నన్ను ఇబ్బంది పెట్టాడని తెలిపారు. అందుకు శ్రీవారు నన్ను నాలుగుసార్లు వారు చేసిన కుట్రలకు, ప్రాణాపాయం కలగకుండా కాపాడారని తెలిపారు. విజయ్ పాల్ అరెస్ట్ అయిన తర్వాత నిజం చెబితే మంచిదని పేర్కొన్నారు. నిజం చెప్పకపోయినా వచ్చే నష్టం లేదని, ఇప్పటికే చాలా మంది నిజం చెప్పేశారన్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఇక్కడ ఉంటున్నప్పుడు, చాలామంది చాలా విషయాలు చెప్పారని తెలిపారు. వాళ్లు దాగుడుమూతలు ఆడితే , బీభత్సమైన చెరసాల నుంచి తప్పించుకోలేరన్నారు . లాకప్ లో నన్ను చిత్రహింసలకు గురి చేసిన కేసులో న్యాయం జరగటం మొదలయ్యింది. త్వరలోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ కేసును పరిష్కరిస్తారన్న సంపూర్ణ నమ్మకం తనకు, రాష్ట్ర ప్రజలకుఉందని తెలిపారు.
పొన్నవోలు సమాధానం చెప్పు
పెద్ద చవటాయి ఎవరంటే రాష్ట్ర ప్రభుత్వం మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఉన్నవోలు సుధాకర్ రెడ్డే నని తనుకు తానే నిరూపించుకుంటారని రఘురామకృష్ణంరాజు ఎదేవా చేశారు. తన అజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు ప్రదర్శిస్తుంటారని విమర్శించారు. సోమవారం కూడా మీడియాతో మాట్లాడుతూ ఒక రసగుళిక వదిలారని అపహాస్యం చేశారు. పంది కొవ్వు 1400 రూపాయలకు కిలో అయితే 400 రూపాయలకు కిలో నెయ్యిలో ఎలా కలుపుతారని ప్రశ్నించడమే కాకుండా, బంగారంలో ఇత్తడిని ఎలా కలుపుతారని ప్రశ్నించడం ఆయన అజ్ఞానాన్ని తెలియజేస్తుందన్నారు. పంది నెయ్యిని బంగారంతో పోల్చి, ఆవు నెయ్యిని ఇత్తడితో పోల్చడం విస్మయాన్ని కలిగిస్తోందన్నారు.
దీనితో మరోసారి పొన్నవోలు సుధాకర్ రెడ్డి తానోక ఆదముడు, నీచుడనని మరొకసారి నిరూపించుకున్నాడన్నారు. సబ్బుల్లో కలిపే పంది కొవ్వు ధర 1400 ఉంటుందా అని నేను గూగుల్ సెర్చ్ చేశానని రఘురామకృష్ణంరాజు తెలిపారు.. లార్డ్ అంటే పోన్నవోలు సుధాకర్ రెడ్డి కి తెలియదని కేవలం మీ లార్డ్ అనడం తప్ప అంటూ అపహాస్యం చేశారు. పంది కొవ్వు కేవలం 56 నుంచి 57 రూపాయలు ఉంటుందని, అత్యధికంగా 115 రూపాయలకు మించి ఉండదని రఘురామ కృష్ణంరాజు వెల్లడించారు. పుత్తడిలో ఇత్తడి కలుపుతారా అన్న పొన్నవోలు సుధాకర్ రెడ్డి అందులో మూడో వంతు రేటు కూడా లేని పందికొవును కలుపుతారు కదా అంటూ ప్రశ్నించారు. జనాలకు ఏమీ తెలియదని నిన్న సాయంత్రం ఓ స్టేట్మెంట్ ఇచ్చిన పొన్నవోలు సుధాకర్ రెడ్డి తక్షణమే దీనిపై వివరణ ఇవ్వాలని రఘురామకృష్ణం రాజు డిమాండ్ చేశారు.