– హోం మంత్రి వంగలపూడి అనిత
అమరావతి, మహానాడు: ముంబయి నటి జెత్వానీ కేసుకు సంబంధించి కొంతమంది పోలీసులను విచారిస్తున్నామని హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఈ మేరకు ఆమె విజయవాడ నోవటెల్ హోటల్ వేదికగా మానవ అక్రమ రవాణా, సైబర్ నేరాలు అరికట్టేందుకు మేధావులతో జరిగిన జాతీయ సదస్సు అనంతరం మీడియాతో ఏమన్నారంటే… కాదంబరి జెత్వానీ కేసులో వేగంగా దర్యాప్తు జరుగుతోంది. ఇప్పటికే ముగ్గురు ఐపీఎస్‌లను సస్పెండ్ చేశాం. కేసులో తప్పు చేసిన ఎవర్ని వదిలే ప్రసక్తేలేదు. కేసులో కొంతమంది పోలీసులను విచారిస్తున్నాం. విచారణ తర్వాత కొంతమంది పోలీసులపై చర్యలు ఉంటాయి. కేసును సీఎం చంద్రబాబు చాలా సీరియస్‌గా తీసుకున్నారు. కుక్కల విద్యాసాగర్ ను అరెస్ట్ చేశాం.
ప్రతి జిల్లాకో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తాం. మానవ అక్రమ రవాణాను అరికట్టడమే లక్ష్యంగా కఠిన చట్టాలు తీసుకొస్తున్నాం. రెండు రోజుల సదస్సులో న్యాయవాదులు, సామాజికవేత్తల విలువైన సలహాలను పరిగణలోకి తీసుకుంటాం. చిన్నారులు, మహిళల రక్షణే మొదటి ప్రాధాన్యం. టెక్నాలజీ, శిక్షణ కలిగిన వారిని నియమించి హ్యుమన్ ట్రాఫికింగ్ పై ఉక్కుపాదం. ఆకర్షించే సందేశాలతో వలేసి అమాయకుల డబ్బు కాజేస్తున్నారు.
మహిళల ఫోటోలను మార్ఫింగ్ చేసి డబ్బులు వసూలు చేసే మాఫియాల పని పడతాం. ప్రజలు, మహిళల అవగాహన కోసం ప్రభుత్వం సదస్సులు. సైబర్ హ్యూమన్ ట్రాఫికింగ్‌పై చర్చ జరగాలి. సైబర్ హ్యూమన్ ట్రాఫికింగ్‌ను అరికట్టేందుకు ఎన్జీవోలు, సామాజిక సంస్థలు ఏకమవ్వాలి. ప్రజలు, మహిళల అప్రమత్తతే సైబర్ నేరాలు అరికట్టడంలో కీలకం. ఫోరెన్సిక్ ల్యాబ్ ను సకల వసతులతో ఫోరెన్సిక్ యూనివర్శిటీలా తీర్చిదిద్దుతాం.