– భవన నిర్మాణాలు, లేఅవుట్లు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల జారీలో జాప్యం నివారణ
– మంత్రి నారాయణ ఆదేశాలతో వాట్సప్ నెంబర్, ఈమెయిల్ ఏర్పాటు
– రాష్ట్రస్థాయిలో అధికారులతో దరఖాస్తుల పరిష్కారంపై ఫోకస్ పెట్టిన మంత్రి నారాయణ
అమరావతి, మహానాడు: రాష్ట్రంలో లేఅవుట్లు, భవన నిర్మాణాల అనుమతుల్లో జాప్యం లేకుండా చూసేలా ప్రభుత్వం ముందుకెళ్తుంది…ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించారు. భవన నిర్మాణాలు, లేఅవుట్లు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల జారీకి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకున్నప్పటికీ కొన్నిచోట్ల అనుమతుల జారీ ఆలస్యం అవుతుంది.
ఇటీవల ఈ సమస్యను పరిష్కరించేందుకు మంత్రి పొంగూరు నారాయణ నేరుగా రంగంలోకి దిగారు. మున్సిపాల్టీలు, కార్పొరేషన్ లలో పర్యటించి టౌన్ ప్లానింగ్ విభాగంలో పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను అక్కడికక్కడే పరిష్కరించారు. విశాఖపట్నం, పాలకొల్లు, నెల్లూరు, మచిలీపట్నం మున్సిపాల్టీల్లో సమావేశాలు నిర్వహించి పెండింగ్ లో ఉన్న దరఖాస్లుదారులను పిలిచి మాట్లాడారు. చాలావరకూ దరఖాస్తులను అధికారుల సమక్షంలోనే పరిష్కరించారు. మరోవైపు ఆన్ లైన్ అనుమతుల జారీలో రియల్ ఎస్టేట్ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతో నిర్మాణ రంగ సంస్థల ప్రతినిధులతో పలుమార్లు మంత్రి నారాయణ చర్చలు జరిపారు. ఆయా సమస్యల పరిష్కారానికి ప్రస్తుతం అధికారులు కసరత్తు చేస్తున్నారు.
పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థ
తాజాగా పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి మంత్రి నారాయణ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. భవన నిర్మాణాలు, లే అవుట్ లు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల జారీ, ఏపీ రేరా అనుమతులపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. అన్ని రకాల ఫీజులు చెల్లించి, సరైన డాక్యుమెంట్లు ఉన్నప్పటికీ ఆన్లైన్ లో పెండింగ్ లో ఉన్న దరఖాస్తుల తక్షణ పరిష్కారానికి కీలక ఆదేశాలు జారీ చేశారు. త్వరితగతిన ఆయా దరఖాస్తులు పరిష్కరించేలా ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటుకు పట్టణ ప్రణాళికా విభాగానికి ఆదేశాలు జారీ చేసారు.
మంత్రి నారాయణ ఆదేశాలతో దరఖాస్తుల పరిష్కారానికి టౌన్ ప్లానింగ్ విభాగం చర్యలు చేపట్టింది. ప్రత్యేకంగా వాట్సప్ నెంబర్ లతో పాటు ఒక మెయిల్ ఐడీని కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. 9398733100, 9398733101 నంబర్లకు వాట్సాప్ ద్వారా లేదా apdpmshelpdesk@gmail.com ఈమెయిల్ కు కూడా దరఖాస్తు వివరాలు పంపవచ్చని అధికారులు ప్రకటించారు. దీనిద్వారా క్షేత్ర స్థాయిలో వివిధ కారణాలతో పెండింగ్ లో ఉన్న దరఖాస్తులు త్వరగా పరిష్కారం అవుతాయని ప్రభుత్వం భావిస్తోంది.