సమయం తక్కువగా ఉంది.. ప్రతి గ్రామంలో.. ప్రతి ఇంటికి వెళ్లాలి
తెలుగుదేశం పార్టీలోకి వచ్చేవారిని ఆహ్వానించండి
పార్టీ శ్రేణులకు మాజీ మంత్రి పరిటాల సునీత పిలుపు
ఎన్నికలు ఇక ఎంతో దూరం లేవు. నాయకులు, కార్యకర్తలు ఇకనుంచి ప్రజాక్షేత్రంలోనే పూర్తిస్థాయిలో ఉండాలని మాజీ మంత్రి పరిటాల సునీత సూచించారు. అనంతపురం రూరల్ మండల పరిధిలోని పాపంపేట, కక్కలపల్లి కాలనీ పంచాయతీల పరిధిలో ఉన్న నాయకులతో సమావేశం అయ్యారు.
అనంతపురం నగరంలోని ఆమె క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ నాయకులకు, శ్రేణులకు కొన్ని సూచనలు చేశారు. ఎన్నికలు దగ్గర పడుతున్నాయని ఇంకా మనం నిత్యం ప్రజాక్షేత్రంలోనే ఉండాలన్నారు. ముఖ్యంగా సూపర్ సిక్స్ పథకాలతో పాటు, బీ.సీ డిక్లరేషన్, మహిళల కోసం కొత్తగా తీసుకొచ్చిన పథకాలను పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని సూచించారు. ఇప్పటికే అన్ని గ్రామాలకు మనం వెళ్ళామని మరోసారి మన పథకాలను వివరిస్తూ ప్రతి ఇంటికి వెళ్లాలన్నారు. సాంకేతికపరంగా కూడా ప్రచారం నిర్వహిస్తున్న తరుణంలో ఆ దిశగా నాయకులు ముందుకు వెళ్లాలన్నారు. మరోవైపు ఇప్పటికే ఎమ్మెల్యే సోదరుల వలన వైసీపీ నాయకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని వారందరూ వైసీపీలోకి రావాలనే ఆలోచనతో ఉన్నారని అన్నారు. అలాంటివారికి మనం ధైర్యం చెప్పి పార్టీలోకి తీసుకొని రావాలని సూచించారు పార్టీలోకి వచ్చిన ప్రతి నాయకునికి సముచిత స్థానం ఉంటుందని, అలాగే పాత వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు అన్న భరోసా ఇవ్వాలన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మన ప్రచార కార్యక్రమాలను మరింత వేగవంతం చేద్దామని సూచించారు.
ఈ సమావేశంలో పాపంపేట, కక్కలపల్లి కాలనీ పంచాయతీల పరిధిలోని తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, క్లస్టర్, యూనిట్ ఇంచార్జీలు, బూత్ కన్వీనర్లతో పాటు కన్వీనర్ జింకా సూర్యనారాయణ, మాజీ జడ్పీటీసీ వేణుగోపాల్, క్లస్టర్ ఇంచార్జీలు మురళి, రఘు, లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు.