– మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ
విజయవాడ, మహానాడు: నగరంలో వరద తగ్గిన ప్రాంతాల్లో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను గురువారం మంత్రులు పొంగూరు నారాయణ, సవిత పరిశీలించారు. 54వ డివిజన్ లో చెత్త తొలగింపు, ఫైర్ ఇంజన్ లతో క్లీనింగ్ పనులు జరిగాయి. మంత్రులు వరద బాధితుల ఇళ్ళకు వెళ్ళి వారి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. వించిపేటలో ఫైర్ ఇంజిన్ ద్వారా పాఠశాలను శుభ్రపరిచారు. ఈ సందర్భంగా మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఏమన్నారంటే… విజయవాడలో గతంలో ఎప్పుడూ లేనంత వరదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మొదటి రోజు ప్రజలను రక్షించేందుకు వెళ్ళిన బోట్లు, ట్రాక్టర్లు కూడా బోల్తా పడ్డాయి. వరద బాధితులందరికీ సరిపడా ఆహారం, మంచినీరు, పాలు, బిస్కట్లు, పండ్లు అందించేలా సీఎం చంద్రబాబు అన్ని చర్యలు తీసుకున్నారు. ఇప్పటివరకూ 80 శాతం వరద తగ్గింది. వరద బాధితులకు నేటి నుంచి నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని సీఎం ఆదేశించారు. పారిశుద్ధ్య పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మొత్తం 10 వేల మంది కార్మికులు చెత్త తొలగింపు, బ్లీచింగ్ చల్లే పనుల్లో ఉన్నారు. అత్యాధునిక యంత్రాలు ఉపయోగించి చెత్తను త్వరితగతిన తొలగించేలా ఏర్పాట్లు చేశాం. బుధవారం ఒక్కరోజే బాధితులకు 26 లక్షల వాటర్ బాటిల్స్,10 లక్షల బిస్కట్ ప్యాకెట్లు, 8లక్షల పాల ప్యాకెట్లు సరఫరా చేశాం.